
Top 5 Most Educated Countries : 'విద్య లేనివాడు వింత పశువు' అనేది సామెత... ఇది నిరక్షరాస్యులను అవమానించడానికి కాదు అక్షరాస్యత ఎంత గొప్పతనాన్ని తెలియజేసేందుకు మన పెద్దలు చెప్పిన మాట. భూమిపై వున్న అన్ని జంతువుల కంటే మనిషి తెలివైనవాడు... వారిని మరింత తెలివిమంతులను చేసేదే చదువు. ఏ దేశంలో అయితే అక్షరాస్యత ఎక్కువగా వుంటుందో ఆ దేశం అభివృద్ది దిశగా దూసుకుపోతుంది... ఇది ఏదో నోటిమాట కాదు అనేక సర్వేలు ఈ విషయం బైటపెడుతున్నాయి.
చదువుకున్నవారు ఎక్కువగా వుండే దేశాలు ఇప్పటికే మంచి అభివృద్దిని సాధించాయి. అక్షరాస్యత తక్కువగా వున్న దేశాలు ఇప్పటికీ పేదరికంలో మగ్గుతున్నాయి. ఇది గుర్తించిన అనేక దేశాలు విద్యావ్యవస్థపై దృష్టిపెట్టారు... తమ ప్రజలను విద్యావంతులను చేయడానికి కృషిచేస్తున్నాయి. ఇలా మనదేశంలో కూడా విద్యార్థులకు మెరుగైన విద్య అందించి ప్రపంచస్థాయిలో పోటీకి సిద్దం చేస్తున్నారు. అయితే ఇప్పటికీ మనం అక్షరాస్యతలో చాలా వెనకబడి వున్నాం... ఇందుకు అనేక కారణాలున్నాయి.
ప్రపంచంలో అత్యధిక విద్యావంతులను కలిగిన దేశం ఏదంటే ఎక్కువమంది టక్కున అమెరికా పేరు చెబుతారు. కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ విషయంలో టాప్ 10 దేశాల జాబితాలో కూడా ఆ దేశం లేదు. అత్యధిక విద్యావంతులను కలిగిన 10 దేశాలేవో తెలుసుకుందాం.
1. సౌత్ కొరియా :
ప్రపంచంలోనే అత్యధికంగా చదువుకున్న జనాభాను కలిగిన దేశం దక్షిణ కొరియా. ఇలా మంచి చదువు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను కలిగిన ఈ దేశం సైన్స్ ఆండ్ టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ దేశ మొత్తం జనాబాలో దాదాపు 69 శాతం అక్షరాస్యులే. ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే వీరిలో 76 శాతం మహిళలే. పురుషుల్లో విద్యావంతులు కేవలం 63 శాతమే.
2. కెనడా :
అంతర్జాతీయ స్ధాయి యూనివర్సిటీలు, విద్యాసంస్థలను కలిగిన దేశం కెనడా. దీన్నిబట్టే అక్కడ చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థమవుతుంది. కాబట్టే కెనడా అత్యధిమంది విద్యావంతులు కలిగిన దేశంగా నిలిచింది. కెనడా జనాభాలో 66 శాతం విద్యావంతులు వున్నారు.వీరిలో 75 శాతం మహిళలు, 58 శాతం పురుషులు విద్యావంతులు.
3. జపాన్ :
ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే వెంటనే జపాన్ గుర్తుకువస్తోంది. వాళ్లే ఎలాంటి అద్భుతాలనైనా చేయగల నేర్పరులు. ఇలా జపనీస్ ను ట్యాలెంటెడ్ గా తీర్చిదిద్దుతోంది వారి విద్యావ్యవస్థ. ముఖ్యంగా జపాన్ ప్రజలు మ్యాథ్స్, సైన్స్ రంగాల్లో మంచి ప్రావీణ్యం కలిగివుంటారు. జపాన్ అత్యధిక విద్యావంతులను కలిగిన దేశాల్లో మూడోస్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం జనాభాలో 65 శాతం విద్యావంతులే... వీరిలో మహిళలు 68, పురుషులు 62 శాతం.
4.ఐర్లాండ్ :
ప్రపంచంలో అత్యధిక విద్యావంతులైన జనాభాను కలిగిన దేశాల్లో ఐర్లాండ్ నాలుగో స్థానంలో వుంది. ఇక్కడ మొత్తం 63 శాతం విద్యావంతులుంటే వారిలో 67 శాతం మహిళలు, 59 శాతం పురుషులు వున్నారు.
5. లక్సెంబర్గ్ :
ఇక్కడ 63 శాతం విద్యావంతులు వున్నారు. వీరిలో 68 శాతం మహిళలు, 59 శాతం పురుషులు వున్నారు. అంటే లక్సెంబర్గ్ లో కూడా మహిళలే అత్యధికంగా చదువుకుంటున్నారన్నమాట.
ఇక ప్రపంచంలో విద్యావంతులను అత్యధికంగా కలిగిన దేశాల జాబితాలో యునైటెడ్ కింగ్డమ్, లిథువేనియా, నెదర్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా నిలిచాయి. అమెరికా టాప్ 10 లో కూడా లేదు. ఉన్నత విద్యావంతులను కలిగిన దేశాల జాబితాలో భారత్ చాలా వెనకబడి వుంది.