
Dark Tourism : దేవభూమిగా పిలుచుకునే కేరళపై ఆ దేవుడే కన్నెర్రజేసాడు. వయనాడ్ లో ప్రకృతి విళయతాండవం చేసి మారణహోమం సృష్టించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి... దీంతో వయనాడ్ ప్రజల ప్రాణాలు గాల్లో కలిసాయి. గత మంగళవారం తెల్లవారుజామున కొండప్రాంతాల్లోని ఇళ్లపై బండరాళ్లు, మట్టిదిబ్బలు పడటంతో నిద్రలో వున్నవారు సజీవ సమాధి అయ్యారు. ఇంకా వందలాది మంది గాయపడగా... వేలాదిమంది నిరాశ్రయులై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇప్పటివరకు 350 మందికిపైగా మృతిచెందినట్లు గుర్తించారు. ఇంకా వందలాదిమంది ఆఛూకీ లభించడంలేదు. బండరాళ్ల కింద, మట్టిదిబ్బల మధ్య, పారుతున్న వరదనీటిలో...ఎక్కడచూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అలాగే కూలిన ఇళ్లు, చచ్చిపడివున్న జంతువులతో ఆ ప్రాంతమంతా విషాదంతో నిండివుంది.
ఇలా చూడ్డానికి భయంకరంగా మారినవేళ వయనాడ్ కు టూరిస్ట్ లు పెరిగారట. దీంతో ప్రకృతి విపత్తుల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు చేపట్టిన రెస్య్యూ ఆపరేషన్స్ కు ఆటంకం కలుగుతోందట. దీంతో కేరళ పోలీసులు ఇతర ప్రాంతాల నుండి వయనాడ్ కు ఎవరూ రావద్దని అభ్యర్థిస్తున్నారు. ఇలా వయనాడ్ విపత్తువేళ డార్క్ టూరిజం అనే పదం వైరల్ గా మారింది.
అసలు ఏమిటీ డార్క్ టూరిజం :
టూరిజం అంటే కనువిందుచేసే ప్రకృతి అందాలు, చారిత్రక ప్రాంతాల పర్యటన. ఈ టూరిజంకు కేరళ చాలా ఫేమస్. పచ్చని ప్రకృతి సోయగాలు, అందమైన కొండకోనలు, జలజలాపారే సెలయేర్లు, సముద్ర తీరప్రాంతాలతో భారతదేశంలో అత్యధికంగా టూరిస్టులను ఆకర్షిస్తున్న రాష్ట్రం కేరళ.
అయితే ఈ ప్రకృతి అందాల వెనక దాగివున్న ప్రమాదం ఎంత భయంకరమో తాజాగా బయటపడింది. అందంగా కనిపిస్తూ ఎప్పుడూ ప్రశాంతంగా వుండే కొండలే తాజాగా ప్రళయం సృష్టించారు. టీ ఎస్టేట్స్ తో రమణీయంగా వుండే వయనాడ్ ప్రాంతమంతా ఇప్పుడు శవాళ దిబ్బగా మారింది. భారీ వర్షాలు, వరద ప్రవాహం దాటికి కొండచరియలు విరిగిపడటంతో భారీ విధ్వంసం జరిగింది.
ఈ ప్రకృతివిళయం, మారణహోమాన్ని చూసేందుకు ఇతర ప్రాంతాలనుండి అనేకమంది వయనాడ్ వెళుతున్నారట. ఇలా విషాదంలో మునిగిన ప్రాంతాలను చూసేందుకు వెళ్లడానే డార్క్ టూరిజం అంటారు. ఇంకా చెప్పాలంటే మనకు ఆనందాన్నిచ్చే ప్రాంతాలను చూసేందుకు వెళ్లడం టూరిజం... ఇతరుల బాధలను చూసేందుకు వెళ్లడం డార్క్ టూరిజం.
ప్రకృతి విపత్తులకు గురయిన ప్రాంతాలనే కాదు యుద్దభూమిని, సమాధులను, ఉరితీసిన ప్రాంతాలను చూసేందుకు వెళ్లడమూ డార్క్ టూరిజమే. మరణం,హింస, విషాదభరిత ప్రాంతాలను సందర్శిస్తే అది డార్క్ టూరిజంలో భాగమే.
డార్క్ టూరిజంతో పొంచివున్న ప్రమాదం :
వయనాడ్ విపత్తు ఏ స్థాయిలో జరిగిందో మనందరం టీవిల్లోనో, సోషల్ మీడియా మాధ్యమాల్లోనో చూస్తున్నాం. కానీ కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నేరుగా వయనాడ్ లో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతానికే వెళుతున్నారు. అక్కడి పరిస్థితులను కళ్లారా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కేరళలో మరీముఖ్యంగా వయనాడ్ లో డార్క్ టూరిజం పెరిగిపోయింది.
ఇప్పటికే వయనాడ్ లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా వుంది... వర్షాలు కొనసాగుతున్నా ప్రాణాలకు తెగించి రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది. కేరళ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది, పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఇతర ప్రాంతాలనుండి ఈ ప్రకృతి విపత్తును చూసేందుకు వచ్చేవారి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అంతేకాదు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరేదైనా ప్రమాదం జరిగితే ఇలా చూసేందుకు వచ్చినవాళ్ళు కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం వుంటుంది. కాబట్టి డార్క్ టూరిజంను అపేయాలని ప్రజలన హెచ్చరిస్తున్నారు కేరళ పోలీసులు.
అంతేకాదు వర్షాలు, వరదనీటితో వయనాడ్ ప్రాంతం ప్రమాదకరంగా వుంది. ఇక చనిపోయిన జంతువులు, ఇతర వ్యర్థాలతో వ్యాధులు సంక్రమించే అవకాశం వుంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో పర్యటించి సహాయక చర్యలకు ఆటంకం కలిగించడమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకోవద్దని... పరిస్థితులు మెరుగుపడ్డాకే వయనాడ్ కు రావాలని సూచిస్తున్నారు.