
భారతీయుల్లో విదేశీ మోజు భారీగా పెరిగింది. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసమే కాదు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాల బాట పడుతున్న భారత విద్యార్థులు ఆ లైఫ్ కు అలవాటుపడిపోయి అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇలా మన దేశ మేధోసంపద విదేశాలకు తరలిపోతోంది.
తాజా లెక్కల ప్రకారం చదువుల కోసం విదేశాల్లో భారీగా విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏటా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు పెరుగుతున్నారే తప్ప తగ్గడంలేదు. ఇలా 2024 నాటికి అంటే ప్రస్తుతానికి విదేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏకంగా 13 లక్షలు. ఇవేవో నోటిలెక్కలు కాదు... కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన లెక్కలు.
ప్రపంచంలోని 108 దేశాల్లో భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో విదేశాలకు తరలివెళుతున్న విద్యార్థుల సమాచారం ప్రభుత్వం వుందా..? ఎవరు ఏ దేశానికి వెళుతున్నారు..? ప్రస్తుతం ఏ దేశంలో ఎంతమంది వున్నారు..? మొత్తంగా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతమంది..? అనే ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
2024లో వివిధ దేశాల్లో 13,35,878 మంది భారతీయ విద్యార్థులు వున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. 2023 తో పోలిస్తే విదేశాల్లోని మన విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. 2019 లో 9లక్షల పైచిలుకు విద్యార్థులుంటే 2023 నాటికి ఈ సంఖ్య 13,18,955 కు చేరిందని... ప్రస్తుతం మరింత పెరిగిందన్నారు. ఇలా విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుందని స్యయంగా విదేశీ వ్యవహారాల మంత్రి వెల్లడించారు.
ఏ దేశంలో ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్.. :
భారతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్దంగా వుంటారు. అయితే ఎక్కువమంది అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలకు ఎక్కువమంది వెళుతుంటారు.ఈ దేశాల్లో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు వున్నాయి... వీటిలో చదివేందుకు భారతీయ విద్యార్థులు ఇష్టపడుతుంటారు.
కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రకటించిన సమాచారం మేరకు... ప్రస్తుతం భారతీయ విద్యార్థులు అత్యధికంగా వున్న దేశం కెనడా. ఇక్కడ 4,27,000 మంది విద్యార్థులు వున్నట్లు సమాచారం.
కెనడా తర్వాత భారతీయ విద్యార్థులు ఎక్కువగా వున్నది అమెరికా. ఇక్కడ 3,37,630 మంది వున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చదువుల కోసం అక్కడే ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోతున్నారు. మంచి ఉద్యోగ అవకాశాలు వుండటం, లగ్జరీ జీవనశైలి వుండటంతో అమెరికాకు వెళ్లేందుకు భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు.
కేంద్ర మంత్రి ప్రకటించిన వివరాల్లో ఓ ఆసక్తికర అంశం వుంది. ఇలా అభివృద్ది చెందిన కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లోనే కాదు మన దాయాది దేశాలు పాకిస్థాన్, చైనా లోనూ మన విద్యార్ధులు వున్నారట. చైనాలో 8,580 మంది భారతీయ విద్యార్థులు వివిధ కోర్సులు చేస్తున్నారట. ఇక పాకిస్థాన్ లో 14 మంది విద్యార్థులు వున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ నుండి భారీగా భారతీయ విద్యార్థులను తరలించింది ప్రభుత్వం. కానీ ఇప్పటికీ ఆ దేశంలో 2,510 మంది విద్యార్థులు వున్నారట. అలాగే ఇజ్రాయెల్ లో 900, గ్రీసులో ఎనిమిదిమంది విద్యార్థులు చదువుకుంటున్నారని కేంద్రం ప్రకటించింది.
ఇలా విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు భారత ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని మంత్రి తెలిపారు. ఆ దేశాల్లోని భద్రతా పరమైన నియమాలను ఎంబసీ అధికారులతో వివరించే కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. విద్యార్థులతో ఆయా దేశాల్లోని ఎంబసీ అధికారులు, కేంద్ర మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతూనే వుంటుందని... ఎలాంటి సమస్య ఎదురైన పరిష్కరిస్తున్నామని అన్నారు. కాబట్టి విదేశాల్లోని విద్యార్థులు తమ వివరాలను అక్కడి భారత ఎంబసీకి అందించాలని ... వ్యక్తిగతంగా ఎంబసీకి రాలేనివారు గ్లోబల్ రిస్తా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సూచించారు.