
Top Universities in India 2024 : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్టర్లతో జరిపిన సమావేశంలో విద్యావ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేసారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిస్థితిపై ఆయన మరింత విచారం వ్యక్తం చేసారు. గతంలో దేశంలోనే టాప్ 10 విశ్వవిద్యాలయాల్లో ఏపీకి చోటు వుండేదని... కానీ ప్రస్తుతం ఒక్కవర్సిటీ కూడా లేవంటూ సీఎం విచారం వ్యక్తం చేసారు.
ఏపీలో విద్యావ్యవస్థ వైఎస్ జగన్ పాలనలో నాశనం అయ్యిందనేది సీఎం చంద్రబాబు చెప్పదల్చుకున్నారు. కానీ ఇదే కామెంట్స్ ప్రజల్లో మరో ప్రశ్నను లేవనెత్తాయి. ఇంతకూ మన దేశంలో టాప్ యూనివర్సిటీలు ఏవి..? ఇందులో ఏపీ వర్సిటీలకు చోటులేవు... మరి తెలంగాణకైనా చోటుందా..? ఏ యూనివర్సిటీ టాప్ లో వుంది..? అనేది తెలుసుకునేందుకు తెలుగు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశంలోని టాప్ 10 యూనివర్సిటీలేవో తెలుసుకుందాం.
1. ఇండియన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (కర్ణాటక) :
ఈ విశ్వవిద్యాలయం కర్ణాటక రాజధాని బెంగళూరులో వుంది. ఈ యూనివర్సిటీ ఏర్పోస్పేస్,కెమికల్, సివిల్,కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులతో పాటు మరెన్నో కోర్సులను అందిస్తోంది. ఇలా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్‌డి కోర్సులు అందిస్తోంది. ఈ యూనివర్సిటీలో సీటుకు మంచి డిమాండ్ వుంది. భారత విద్యాశాఖ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) ప్రకారం మంచి మేధోసంపత్తిని అందిస్తున్న ఈ యూనివర్సిటీ దేశంలోనే అత్యుత్తమమైనది.
2. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ :
దేశ రాజధాని న్యూడిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదాలకే కాదు విద్యకు నిలయం. ఈ యూనివర్సిటీ విద్యార్థులు కేవలం చదువులోనే కాదు విద్యార్థి సంఘాల్లోనూ చాలా యాక్టివ్ గా వుంటారు. ఇలా మంచి మేధావులనే కాదు చాలామంది రాజకీయ నాయకులను ఈ యూనివర్సిటీ అందించింది. విదేశీ విద్యలో బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి ఈ యూనివర్సిటీ పర్ఫెక్ట్ ప్లేస్.
3. జామియా మిలియా యూనివర్సిటీ :
దేశ రాజధాని న్యూడిల్లీలోని మరో ప్రఖ్యాత విశ్వవిద్యాలయం జామియా మిలియా ఇస్లామియా. NIRF ప్రకారం ఈ వర్సిటీ దేశంలోనే మూడో అత్యుత్తమమైనది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్‌డి తో పాటు అనేక స్థాయిలలో మొత్తం 256 కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తోంది. ముఖ్యంగా హిందీ, అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో అనేక కోర్సులను ఈ వర్సిటీ విద్యార్థులకు అందిస్తోంది.
జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం :
పశ్చిమ బెంగాల్ కు చెందిన జాదవ్ పూర్ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో వుంది. ఈ వర్సిటీ దాదాపు 146 కోర్సులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది.
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం :
ప్రాచీన నగరం వారణాసిలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం బనారస్. స్వాతంత్ర్య సమరయోధులు మదన్ మోహన్ మాలవ్య 1916లో ఈ వర్సిటీని స్థాపించారు. డిగ్రీతో పాటు పిజి, పిహెచ్‌డి లో అనేక కోర్సులను అందిస్తోంది. ఈ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్స్ లో ఐదో స్థానంలో నిలిచింది.
ఇలా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్స్ 2023 ప్రకారం చూసుకుంటే దేశంలోని టాప్ 5 యూనివర్సిటీల్లో తెలుగు రాష్ట్రాల వర్సీటలకు చోటు దక్కలేదు. కానీ టాప్ 10 లో మాత్రం తెలంగాణ రాజధానిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చోటు దక్కింది.
NIRF ర్యాకింగ్స్ ప్రకారం కర్ణాటకకు చెందిన మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, తమిళనాడుకు చెందిన అమృత విశ్వవిద్యాపీఠం, వెల్లూరు ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉత్తర ప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాలు వరుసగా 6,7,8,9 స్థానాల్లో నిలిచారు. తెలంగాణలో HCU 10వ స్థానంలో నిలిచింది.