Wayanad Landslide Rescue Operations: నేనూ సైన్యంలో చేరతా, దేశాన్ని రక్షిస్తా.. కదిలిస్తున్న చిన్నారి లేఖ

First Published | Aug 4, 2024, 7:57 AM IST

వయనాడ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటన కేరళ చరిత్రలోనే అత్యంత భారీ విపత్తుగా రికార్డుల్లోకెక్కుతోంది. సైన్యం, NDRF, అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు, స్థానికులు సాహసోపేతంగా పనిచేసి ప్రాణాలను కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో సైన్యం సాహసాన్ని కీర్తిస్తూ 3వ తరగతి విద్యార్థి రాసిన లేఖ పలువురిని కదిలిస్తోంది.

  •  
వయనాడ్‌లో ఆరో రోజు సహాయ చర్యలు

కేరళ రాష్ట్రం వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక, గాలింపు చర్యలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ముండక్కై, సామ్లిమట్టం వద్ద ఇవాళ (ఆదివారం) మిలిటరీ, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడతాయి. కాగా, సోమవారం ఉదయం 7 గంటలకు చలియార్‌ నదిలో రెండు భాగాలుగా అన్వేషణ కొనసాగిస్తారు. 

వయనాడ్ కొండచరియలు విరిగిపడి ఎంత మంది చనిపోయారు?

మరోవైపు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 365కి చేరింది. 148 మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. మరో 206 మంది ఆచూకీ కనిపెట్టాల్సి ఉంది. మృతుల్లో 30 మంది చిన్నారులు ఉండటం కలచివేస్తోంది. కాగా, 93 సహాయ కేంద్రాల్లో 10,042 మంది ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు, గుర్తుతెలియని మృతదేహాలను ప్రభుత్వ శ్మశానవాటికల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


కొండచరియలు విరిగిపడిన అన్ని ప్రాంతాల్లో సోదాలు

శనివారం విపత్తు ప్రాంతం నుంచి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన అన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వివిధ బలగాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. తమిళనాడు ఫైర్ ఫోర్స్ డాగ్ స్క్వాడ్ కూడా సహకారం అందిస్తోంది. ఇవాళ (ఆదివారం) కూడా గాలింపు చర్యలు అదేవిధంగా కొనసాగుతాయి. వివిధ బృందాలుగా విడిపోయి సూచిపర దిగువ ప్రాంతాలతో పాటు స్మలిమట్టం, చురల్మల, ముండకై, చలియార్ నదిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తారు. చలియార్‌ నదీ ప్రాంతంలో 12 మృతదేహాలు లభ్యం కావడంతో విస్తృతంగా సోదాలు నిర్వహించాలని నిర్ణయించారు. 

కేరళ చరిత్రలోనే భారీ విపత్తు

కేరళ చరిత్రలో అత్యంత భారీ విపత్తుగా నిలిచిన ఈ ఘటనను చూసి అనేక మంది చలించి పోతున్నారు. ఇప్పటికే విపత్తు నిర్వహణ బృందాలు, సైన్యం, వాలంటీర్లు, ఇతర విభాగాలు సహాయక చర్యలు చురుగ్గా పాల్గొంటున్నాయి. పలువురు ప్రముఖులు సైతం స్పందించి బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. 

బెయిలీ వంతెన ఎలా నిర్మించారు?

అయితే, వయనాడ్‌ ప్రాంతంలో విపత్తు సేవలందించడంతో పాటు కీలకమైన తాత్కాలిక బెయిలీ వంతెన నిర్మాణానికి సైన్యం తీవ్రంగా శ్రమించింది. కఠినమైన పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవలకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలను అందరినీ కదిలిస్తున్నాయి. ముండక్కై కొండచరియలు విరిగిపడినప్పటి నుంచి అనేక మంది ప్రాణాలను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది, NDRF, వాలంటీర్లు, స్థానికులు. ఇండియన్ ఆర్మీ, నేవీ, వైమానిక దళంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘రెస్క్యూ ఆపరేషన్‌కు అత్యంత కీలకమైన బెయిలీ బ్రిడ్జి నిర్మాణం సహా తర్వాతి రెస్క్యూ ఆపరేషన్‌కు భారత సైన్యం నాయకత్వం వహించింది. గల్లంతైన వారిని రక్షించడంలో, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో భారత సైన్యం చేసిన సేవ మాటల్లో చెప్పలేనిది’ అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

కదిలిస్తున్న చిన్నారి ర్యాన్ లేఖ

ఈ నేపథ్యంలో ఓ చిన్నారి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్‌ ఆర్మీ చేస్తున్న సేవలను టీవీలో చూసినన ర్యాన్‌ అనే మూడో తరగతి విద్యార్థి ఆర్మీకి లేఖ రాశాడు. ఈ పోస్ట్‌ను భారత సైన్యం సదరన్ కమాండ్ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ‘డియర్  ఆర్మీ, వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో భూమి కింద చిక్కుకున్న చాలా మందిని మీరు రక్షించడం చూసి నేను చాలా సంతోషించాను. కేవలం బిస్కెట్లు, నీళ్లతో బ్రిడ్జిని నిర్మిస్తున్న వీడియోలో మిమ్మల్ని చూసి గర్వపడ్డాను. మీ స్ఫూర్తితో నేను కూడా ఏదో ఒకరోజు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడతా.’’ అంటూ ర్యాన్ రాసిన లేఖ పలువురిలో స్ఫూర్తి నింపుతోంది.

Latest Videos

click me!