
Artificial Intelligence Ministry : తమిళనాడులో సరికొత్త పాలన సాగుతోంది... సాంప్రదాయ ద్రవిడ పార్టీల మార్క్ పరిపాలనకు కొత్త సీఎం జోసెఫ్ విజయ్ చరమగీతం పాడుతున్నారు. మార్పు కోసమే తమిళ ప్రజలు తనకు అధికారాన్ని అప్పగించారని సీఎం నమ్ముతున్నట్లున్నారు.. అందుకే TVK సర్కార్ కొత్తకొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. చివరకు మంత్రివర్గ విస్తరణలో కూడా సీఎం విజయ్ కొత్తదనం చూపించారు... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసమే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.
నిన్న (మే 21, గురువారం) తమిళనాడు కేబినెట్ విస్తరణ జరిగింది... సీఎం విజయ్ తన టీమ్ లోకి మరో 23 మందిని చేర్చుకున్నారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసినవారిలో 21 మంది టివికే, 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.. దీంతో తమిళనాడు కేబినెట్ సభ్యుల సంఖ్య 33కి చేరింది.
అయితే ముఖ్యమంత్రి విజయ్ కొత్తగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు... అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్ట్రీ. దీన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజిటల్ సర్వీసెస్ తో జతచేసి డాక్టర్. కుమార్ కు అప్పగించారు. ఇలా దేశంలోనే మొద్దమొదటి ఏఐ శాఖ మంత్రిగా ఆర్. కుమార్ కు అవకాశం దక్కింది. అయితే ఇప్పటకే కేరళలో ప్రభుత్వం ఏఐ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసింది... ఈ శాఖను కలిగిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది.
తమిళనాడు ప్రభుత్వం టెక్నాలజీలో మరో విప్లవాన్ని సృష్టించే ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. సాధారణంగా ప్రభుత్వాలు రోడ్లు, సాగునీరు, తాగునీరు, పథకాలు వంటి అంశాలకే ప్రాధాన్యం ఇస్తాయి... ఇవే ప్రజలకు అవసరం అనుకుంటాయి. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా విజయ్ తన ప్రభుత్వ ప్రాధాన్యాలను నిర్దేశించుకుంటున్నారు... భవిష్యత్తు అంతా AI చుట్టూనే తిరగబోతోందని గుర్తించారు. అందుకోసమే తమిళనాడు ప్రభుత్వం దీని కోసమే ప్రత్యేకంగా ఒక వ్యవస్థను సిద్ధం చేసింది... చెన్నైని మరో సిలికాన్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు సిద్దమయ్యింది.
ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు ద్వారా "మేము కేవలం సాఫ్ట్‌వేర్లు తయారుచేసే రాష్ట్రంగానే కాదు... AI రాష్ట్రంగా కూడా ఎదగాలనుకుంటున్నాము" అని విజయ్ ప్రభుత్వం సంకేతాలిస్తోంది. AI రంగంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయి... వీటిని తమవైపు తిప్పుకునేందకు తమిళనాడు వేసిన మాస్టర్ ప్లానే ఈ ఏఐ మినిస్ట్రీ. ఈ నిర్ణయం వల్ల తమిళనాడు కేవలం 'డెట్రాయిట్ ఆఫ్ ఇండియా' (ఆటోమొబైల్ హబ్) గానే కాకుండా AI క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మారే అవకాశం ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే చెన్నై వైపు చూస్తున్నాయి... ఇవి సాప్ట్ వేర్ రంగంలోనే కాదు ఏఐ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ప్రయత్నించనుంది.
కేవలం పెట్టుబడుల కోసమే కాదు పాలనలో కూడా ఏఐ ని ఉపయోగించేందుకు విజయ్ సర్కార్ సిద్దమయ్యింది. వివిధ రంగాల్లో AI ని వాడి సరికొత్త విప్లవానికి నాంది పలకాలని చూస్తోంది. ఏఏ రంగాల్లో, ఎలా ఏఐని వాడవచ్చో తెలుసుకుందాం.
పాలనలో పారదర్శకత : AI ద్వారా ప్రభుత్వ పథకాలు నేరుగా అర్హులకు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించవచ్చు. ఉదాహరణకు Facial Recognition ద్వారా పెన్షన్ పంపిణీని మరింత సులభతరం చేయడం.
వ్యవసాయంలో విప్లవం : ఏ పంట వేస్తే లాభం ఉంటుంది..? వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? చీడపీడల నివారణ ఎలా? వంటి విషయాల్లో రైతులకు AI సలహాలు అందించడం.
ఆరోగ్య రంగం : మారుమూల గ్రామాల్లో ఉన్న వారికి కూడా AI చాట్‌బాట్‌లు, రోబోటిక్ డయాగ్నోసిస్ ద్వారా మెరుగైన వైద్య సలహాలు అందించడం.
భాషా అడ్డంకులు తొలగించడం : తమిళం వంటి ప్రాచీన భాషను AIతో అనుసంధానించి, అధికారిక పనుల్లో అనువాద ప్రక్రియను వేగవంతం చేయడం.
డేటా అనలిటిక్స్ : ప్రజల అవసరాలను డేటా రూపంలో విశ్లేషించి ముందే పరిష్కారాలు చూపడం.
నైపుణ్యాభివృద్ధి : కాలేజీ విద్యార్థులకు AI పాఠాలను నేర్పించి, వారిని ప్రపంచ స్థాయి టెక్ నిపుణులుగా తీర్చిదిద్దడం.