సినిమా హీరోలా ఉంటాడని ఊహించుకున్నా.. భర్త నారాయణ మూర్తి గురించి సుధామూర్తి...

First Published May 11, 2023, 2:22 PM IST

నారాయణ మూర్తి మొదటి సారి కలవడానికి వెళ్లినప్పుడు.. ఆయన హీరోలా ఉంటాడని ఊహించుకున్నానని.. తీరా తలుపు తీయగానే చూసి ఈ చిన్నపిల్లాడేంటీ? అనుకున్నానని సుధామూర్తి చెప్పుకొచ్చారు. 

పరిచయం అక్కరలేని పేరు సుధా మూర్తి. ఇన్ఫోసిస్ అనగానే  నారాయణమూర్తి తర్వాత గుర్తుకు వచ్చేపేరే సుధా మూర్తి.  ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గానే కాకుండా.. ఒక రచయిత్రిగా.. మంచి మనసున్న వ్యక్తిగా చాలామందికి సుపరిచితమైన వ్యక్తి ఆమె. 

ఆమె తన సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మంది మనసుల్ని  గెలుచుకున్నారు. తన రచనలు, సహాయ కార్యక్రమాలతో  ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఇటీవల ఒక టీవీ షోలో ఆమె  తన భర్త నారాయణమూర్తితో తన తొలి పరిచయం గురించి చెప్పారు. ప్రస్తుతం ఇది ఇప్పుడు వైరల్ గా మారింది.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే…

బాలీవుడ్ టాక్ షో అనే కపిల్ శర్మ కార్యక్రమంలో ఇటీవల సుధా మూర్తి పాల్గొన్నారు. ఇందులో సుధా మూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టండన్, ప్రొడ్యూసర్ గునీత్ మోంగా  కూడా పాల్గొన్నారు.. ఈ షోకు సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఇందులో యాంకర్ కపిల్ శర్మ సుధా మూర్తిని ఉద్దేశించి నారాయణమూర్తిని మొదటిసారి ఎప్పుడు కలిశారని అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ ప్రసన్న అనే తన స్నేహితురాలి ద్వారా  నారాయణమూర్తి తనకు పరిచయమయ్యారని చెప్పకు వచ్చారు. ఆమె రోజూ ఒక పుస్తకం తీసుకువచ్చేదని చెప్పారు.  

ఆ పుస్తకంలోని మొదటి పేజీలో నారాయణమూర్తి పేరు ఉండేదని చెప్పారు. అయితే ఆయన పేరు పక్కన పెషావర్, ఇస్తాంబుల్ అని ప్రదేశాల పేర్లు కూడా ఉండేవట.. ఇది చూసి నారాయణ మూర్తి  బహుశా ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ అయి ఉంటాడేమో అని తను మొదట అనుకున్నట్లుగా చెప్పారామె..

అయితే చివరికి ఒక రోజు తను నారాయణమూర్తిని కలవడానికి వెళ్లానని..  కలిసే ముందు తాను అతని సినిమా హీరోల ఉంటాడని ఊహించుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ, తీరా అతన్ని కలవడానికి వెళ్లిన తర్వాత డోర్ ఓపెన్ చేయగానే ఈ చిన్న పిల్లాడు ఎవరు? అనిపించిందని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు సుధా మూర్తి. ఈ సరదా సంభాషణ వినగానే అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా గట్టిగా నవ్వేశారు.

సుధా మూర్తి, నారాయణ మూర్తిల వివాహం 44 సంవత్సరాల క్రితం అయ్యింది. వీరికి రోహన్ మూర్తి, అక్షతా మూర్తి అని ఇద్దరు పిల్లలు. అక్షత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  బ్రిటన్ ప్రధాని భార్య అక్షతా మూర్తి. గొప్ప మానవ మూర్తి అయిన సుధా మూర్తి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ,,  పద్మభూషణ్ లాంటి గొప్ప పురస్కారాలతో గౌరవించింది. 

click me!