Viral Video : మూత్రంతో కళ్లు కడుక్కుంటే మంచిదా..? ఈమె చేసింది కరెక్టేనా..? డాక్టర్లు ఏమంటున్నారంటే

Published : Feb 12, 2026, 04:25 PM ISTUpdated : Feb 12, 2026, 04:54 PM IST

పూణేకు చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మూత్రంతో కళ్లు కడుక్కుని, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాచేయడం కంటికి మంచిదంటోంది సదరు మహిళ. మరి డాక్టర్లు ఏమంటున్నారు..? 

PREV
15
యూరిన్ తో కళ్లను కడుక్కున్న మహిళ... వైరల్ వీడియో

Urine Eye Wash Viral Video : యూరిన్ తో ఎన్నో లాభాలు ఉన్నాయంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన నుపుర్ పిట్టి మూత్రంతో తన కళ్లను కడుక్కుంది… దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇదేదో పబ్లిసిటీ స్టంట్ కాదంటూ తన చర్యను సమర్దించుకుంది… మూత్రంలో కళ్లను కాపాడే ఔషధ గుణాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.

మూత్రంతో కళ్లు కడుక్కోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నుపుర్ చెబుతోంది. మూత్రం అనేది ప్రకృతిసిద్ధమైన ఔషధమని పేర్కొంటోంది. కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, మంట వంటి సమస్యలకు ఇది మంచిదని చెబుతోంది. ఇలా తాను మూత్రంతో కళ్లకు అద్దుకోవడమే కాదు ఇతరులు కూడా తనను ఫాలో కావాలని చెబుతోంది నుపుర్ పిట్టి.

ఈ వీడియో చూసినవారికి నిజంగానే మూత్రం కళ్ళకు మంచిదా..? అనే అనుమానం కలగకమానదు. మరి ఈ వీడియోపై డాక్టర్లతో పాటు నెటిజన్లు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

25
మూత్రంతో కళ్లు కడుక్కుంటే మంచిదా..?

తన వీడియోలో నుపుర్ చెప్పింది నమ్మితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రం అంటే మనిషి శరీరం నుంచి వచ్చే వ్యర్థం... ఇందులో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఉంటాయని అంటున్నారు . దీంతో కళ్లు కడుక్కుంటే తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కనురెప్పల అలర్జీ, కార్నియాలో పుండ్లు వంటి సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు.

మూత్రంలోని అమ్మోనియా, యూరియా వంటివి కళ్లలో తీవ్రమైన మంటను కలిగిస్తాయి… దీనివల్ల కళ్లు ఎర్రబడటం, నొప్పి, అలర్జీ, కంటిచూపు దెబ్బతినడం జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. మూత్రం pH స్థాయి వ్యక్తిని బట్టి మారుతుంది… ఇది కంటిలోని సున్నితమైన కణజాలాలను దెబ్బతీసి, కార్నియాను శాశ్వతంగా పాడుచేయగలదని అంటున్నారు. ఇలా కొన్నిసార్లు శాశ్వత అంధత్వానికి కూడా దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

35
మూత్రంలో కళ్లు కడుక్కోవడమేంటి..!

మూత్రంతో కళ్లు కడుక్కోవడం వల్ల ప్రయోజనం ఉంటుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పుడు, ప్రమాదకరమైన నమ్మకం అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రమాదకరమైన చిట్కాలను గుడ్డిగా నమ్మవద్దని, కళ్లలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

డాక్టర్లు, నెటిజన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో నుపుర్ సోషల్ మీడియా నుంచి కళ్లను మూత్రంతో కడుక్కున్న వీడియోను తొలగించింది. కానీ అప్పటికే చాలామంది ఈ వీడియోను చూసేశారు. ఆమె తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. పబ్లిసిటీ కోసమే ఇందంతా చేసిందని మండిపడుతున్నారు.

45
కళ్లను కాపాడుకునే చిట్కాలు...

కళ్లు చాలా సున్నితమైన అవయవం. వాటిని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం. కళ్లలో దుమ్ము, నలకలు పడినా లేదా మంటగా అనిపించినా శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.

కళ్లు పొడిబారినా, మంటగా ఉన్నా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించిన మందులనే వాడాలి.

కళ్లను తాకే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. 

దుమ్ము, ధూళి, సూర్యరశ్మి నుంచి కళ్లను కాపాడుకోవడానికి సాధారణ కళ్లద్దాలు లేదా సన్‌గ్లాసెస్ వాడటం మంచిది. 

వాహనాలపై వెళ్లేటప్పుడు దుమ్ము ఎక్కువగా పడుతుంటే, ప్రత్యేకంగా లభించే సేఫ్టీ గ్లాసెస్ ధరించవచ్చు.

కళ్ల ఆరోగ్యం కోసం ఎప్పటికప్పుడు కంటి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం. అంతేగానీ సొంతంగా మెడిసిన్స్ వాడటం మంచిదికాదు.

చివరగా సోషల్ మీడియాలో ఏది చెబితే అది నమ్మి కళ్లను పాడుచేసుకోవద్దు.

55
డాక్టర్ల సూచన ఇదే..

సోషల్ మీడియాలో లైకుల కోసం కొందరు ఇలాంటి తప్పుడు వైద్య చిట్కాలతో వీడియోలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఎవరూ ఇంట్లో ప్రయత్నించవద్దు. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా, నిపుణులను సంప్రదించిన తర్వాతే చికిత్స తీసుకోవాలి. సొంత వైద్యం, ఇంటర్నెట్‌లో చూసి చికిత్సలు చేసుకోవడం వంటివి అస్సలు చేయకూడదని డాక్టర్లు గట్టిగా చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories