
Narendra Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి పండగ సందర్భంగా దేశ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు, గత సంవత్సరకాలంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించడమే కాదు ఇకపై ప్రతి భారత పౌరుడు ఏం చేయాలో సూచించారు. ఇలా పీఎం మోదీ దీపావళి సందేశం ఆసక్తికర అంశాలను కలిగివుంది.
ప్రధానమంత్రి మోదీ దీపావళి సందర్భంగా ప్రజల్లో స్వదేశీ భావనను పెంపొందించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే 'వికసిత్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' అంశాలను ప్రస్తావించారు... ఈ దిశగా దేశం ముందుకు సాగేందుకు ప్రతి పౌరుడు భాద్యత తీసుకోవాలన్నారు. ప్రాథమిక బాధ్యతలను గుర్తించి సక్రమంగా నిర్వర్తించినపుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే ఇకపై మనం 'స్వదేశీ గూడ్స్' (స్థానిక వస్తువులు) వాడుతూ గర్వంగా 'ఇదీ నా దేశంపై ప్రేమ!'' అని చెప్పుకోవాలన్నారు. 'ఏక్ భారత్, శ్రేష్ట భారత్' (ఒకే దేశం-బలమైన దేశం) నిర్మించాలని ప్రధాని మోదీ సూచించారు.
ఇక దేశప్రజలు ప్రాంతాలు, బాషల పరంగా విడిపోరాదని.. దేశంలోని అన్ని బాషలను గౌరవిద్దామన్నారు మోదీ. అలాగే ప్రతిఒక్కరం పరిశుభ్రతను పాటిద్దాం... మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మంచి ఆరోగ్యం కోసం వంటకాల్లో 10 శాతం ఆయిల్ వాడకాన్ని తగ్గించాలని.. యోగా చేయాలని సూచించారు. ఇలాంటి చర్యలు దేశాన్ని వికసిత్ భారత్ దిశగా మరింత వేగంగా తీసుకెళతాయని ప్రధాని మోదీ అన్నారు.
దీపావళి అనేది వెలుగుల పండగ.. ఓ దీపంతో మరో దీపాన్ని వెలుగిస్తూ అంధకారాన్ని తొలగిస్తుంది. ఇదే స్పూర్తితో మనంకూడా సామరస్యంతో ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా పాజిటివ్ పద్దతిలో సమాజాన్ని నిర్మించాలన్నారు పీఎం మోదీ. ఇలా ఈ దీపావళి పండగ నుండి సరికొత్త వెలుగులు పంచాలన్నారు. ఈ పండగ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని ప్రధాని తెలిపారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచం చాలా సమస్యలను ఎదుర్కొంటోంది... కానీ భారతదేశం చాలా స్థిరత్వంతో ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. అందువల్లే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడోస్థానం కోసం ముందుకు సాగుతోంది... ఈ ప్రయాణం సరైన దారిలోనే సాగుతోందన్నారు.
దీపావళి సందర్భంగా దేశ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పీఎం. అయోధ్యలో రామమందిరం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి అని గుర్తుచేశారు. ఆ శ్రీరాముడు మనకు ధర్మం వైపు నిలవాలని... అధర్మంపై పోరాటం చేయాలని బోధించారు. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో మనం ఇదే చేశామని... భారత్ కేవలం ధర్మం వైపు నిలవడమే కాదు అధర్మానికి వ్యతిరేకంగా పోరాడిందన్నారు ప్రధాని.
ఈ దీపావళి చాలా ప్రత్యేకమైనది... దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో వెలుగులు నిండాయన్నారు. నక్సలిజం బలంగా ఉన్న ప్రాంతాల్లో మావోయిస్ట్ టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించివేశామన్నారు. ఇటీవల చాలామంది హింసను వీడిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారని తెలిపారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య పాలనపై నమ్మకంతోనే ఇది సాధ్యమయ్యిందని.. దేశం సాధించిన గొప్ప విజయాల్లో ఇది ఒకటన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశ భవిష్యత్ ను మార్చే నిర్ణయం తీసుకుంది... అదే జిఎస్టి సంస్కరణలు. దసరా నవరాత్రుల ప్రారంభంరోజే కొత్త జిఎస్టి ధరలు అమల్లోకి వచ్చాయన్నారు నరేంద్ర మోదీ. ఈ దీపావళి పండటపూట కూడా 'జిఎస్టి బచత్ ఉత్సవ్' (సేవింగ్ ఫెస్టివల్) లో ప్రజలు వేలకోట్లు ఆదా చేసుకున్నారని అన్నారు. ఇలా అనేక అంశాలను తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.