Narendra Modi Birthday
Narendra Modi Birthday : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్ 17, మంగళవారం) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడి బర్త్ డే వేడుకలను బిజెపి శ్రేణులు ఘనంగా నిర్వహించుకుంటున్నాయి... పార్టీలకు అతీతంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 74 వసంతంలోకి అడుగుపెడుతున్న మోదీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ప్రజా సేవలోనే బర్త్ డే సెలబ్రేషన్ గా మార్చుకుంటున్నారు. ఇవాళ ఆయన ఒడిషాలో పర్యటించి కీలకమైన ప్రభుత్వ పథకాలను ప్రారంభించనున్నారు.
Narendra Modi Birthday
బర్త్ డే రోజు మోదీ ఎలా గడపనున్నారు :
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు మోదీ సర్కార్ పీఎం ఆవాస్ యోజన పథకాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే భారీగా ఇళ్లను నిర్మించింది. మరో 26 లక్షల ఇళ్లను బర్త్ డే సందర్భంగా పేదలకు గిప్ట్ గా ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మోదీ పాల్గొంటున్నారు.
భువనేశ్వర్ లోని గడకానా మురికివాడలో పర్యటించి పీఎం ఆవాస్ యోజన ఇళ్ల లబ్దిదారులతో మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఇళ్ల నిర్మాణం గురించి వారికి వివరించనున్నారు. ఇలా పుట్టినరోజుల నిరుపేద ప్రజలతో గడిపేందుకు సిద్దమయ్యారు ప్రధాని మోదీ.
తన బర్త్ డే రోజుల మరో అద్భుతమైన పథకాన్ని కూడా మోదీ ప్రారంభించనున్నారు. 'సుభద్ర యోజన' పేరిట ప్రతి ఏటా కోటి మందికిపైగా పేద మహిళలకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. ఏడాదిలో రెండు వాయిదాల్లో ఈ సొమ్మును మహిళల అకౌంట్స్ లో జమ చేస్తారు. ఈ పథకాన్ని భువనేశ్వర్ లోని జనతా మైదాన్ నుండి ప్రారంభించనున్నారు.
ఒడిషా ఎన్నికల సమయంలో పేద మహిళకు ఆర్థిక సాయం పథకాన్ని బిజెపి ప్రకటించింది.ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీన్ని చేర్చింది. ఈ హామీని నెరవేర్చేందుకు సిద్దమైన ప్రభుత్వం మోదీ బర్త్ డే కానుకగా ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది. పూరీ జగన్నాథుడి సోదరుడు సుభద్ర పేరుమీద ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.
ఇక రూ.2,871 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రూ.1000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్ట్ పనులను ప్రారంభించనున్నారు. ఇలా పుట్టినరోజున కూడా ప్రజాసేవలో బిజీబిజీగా గడపనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.
గత ఐదేళ్లుగా మోదీ బర్త్ డే రోజున ఏం చేసారంటే :
2023 బర్త్ డే :
గతేడాది అంటే 2023 లో ప్రధాని నరేంద్ర మోదీ 'పీఎం విశ్వకర్మ యోజన' పథకాన్ని ప్రారంభించారు. సాంప్రదాయ చేనేత కళాకారుల కోసం ఏర్పాటుచేసిన పథకమిది. వారిలో నైపుణ్యాన్ని మరింత మెరుగపర్చి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
దీంతోపాటు ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (IICC) ను ప్రారంభించారు మోదీ. అలాగే విస్తరించిన డిల్లీ ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ ను కూడా మోదీ ప్రారంభించారు.
2022 బర్త్ డే :
2022 సెప్టెంబర్ 17న తన పుట్టినరోజు వేడుకలకు సరికొత్తగా జరుపుకున్నారు ప్రధాని మోదీ. విదేశాలను నుండి తీసుకువచ్చిన చిరుత పులులతో ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. నమీబియా నుండి తీసుకువచ్చిన చిరుతలను మధ్య ప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వదిలిపెట్టారు. అంతేకాదు ప్రొఫెషనల్ కెమెరామెన్ గా మారి వాటిని ఫోటోలు తీసారు.
2021 బర్త్ డే :
కరోనా మహమ్మారి నుండి యావత్ దేశాన్ని కాపాడేందుకు ఈ బర్త్ డే ను ఉపయోగించుకున్నారు మోదీ. 2021 సెప్టెంబర్ 17న అంటే ప్రధాని పుట్టినరోజున మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగా ఒకేరోజు 2.26 కోట్లమందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చి చరిత్ర సృష్టించారు.
2020 బర్త్ డే :
కరోనా వ్యాప్తి ఎక్కువగా వుండటంతో పుట్టినరోజు వేడుకలక ప్రధాని మోదీ దూరంగావున్నారు. కానీ బిజెపి శ్రేణులు మాత్రం సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, రక్తదాన శిబిరాలను నిర్మించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
2019 బర్త్ డే :
సొంత రాష్ట్రం గుజరాత్ లో 'నమామి నర్మద' కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. అలాగే స్టాట్యూ ఆఫ్ యూనిటి సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
ప్రధానికి మోదీ కానుకల వేలం :
భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులంతా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బిజెపి శ్రేణులు కూడా మోదీ బాటలోనే నడుస్తూ ప్రజాసేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ తమ అభిమాన నాయకుడి బర్త్ డే వేడుకలు జరుపుకుంటున్నారు.
అయితే మోదీ పుట్టినరోజు సందర్భంగా సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది కేంద్ర సాంస్కృతిక శాఖ. ప్రధానికి వివిధ సందర్భాల్లో ఇప్పటివరకు వచ్చిన 600పైగా బహుమతులను వేలం వేయనున్నారు. ఈ మొత్తం బహుమతుల బేస్ ధరను రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు.
ఇలా వేలంపాట ద్వారా వచ్చే డబ్బును ప్రధాని మోదీ గంగానది ప్రక్షాళనకు ఉపయోగించనున్నారు. ఈ వేలంలో ఎవరైనా పాల్గొని వస్తువుల దక్కించుకోవచ్చని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.