న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు(శనివారం) కాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రైవేటు లైబ్రరీలో ముఖాముఖిగా భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాలు సమావేశం కావాల్సి ఉంది. కానీ, గంట వరకు వీరిరువురు చర్చలు జరిపారు. ఈ సమావేశం హృదయపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అనేక అంశాలపై పోప్ ఫ్రాన్సిస్‌తో మాట్లాడే అవకాశం దక్కిందని వివరించారు. భారత పర్యటనకు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించినట్టు ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌లు ఉన్నారు.
ఈ సమావేశంలో పర్యావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. అనంతరం భారత్‌కు రావాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రధాని మోడీ కోరారు. చివరిసారిగా 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పోప్ జాన్ పాల్ II భారత్ పర్యటించారు. మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతున్న కాలంలో పోప్‌ను భారత్‌కు ఆహ్వానించడం గమనార్హం.