Operation Kaveri: సుడాన్ నుంచి భారతీయుల తరలింపు.. 246 మందితో స్వదేశానికి చేరుకున్న మరో విమానం..

First Published Apr 27, 2023, 5:28 PM IST

సుడాన్‌లో అంతర్యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ కావేరి  కింద స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. 

సుడాన్‌లో అంతర్యుద్దం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ కావేరి  కింద స్వదేశానికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సూడాన్ నుంచి 246 మంది భారతీయులతో కూడిన భారత వైమానిక దళానికి చెందిన విమానం గురువారం ముంబైలో ల్యాండ్ అయింది. ఇది సుడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిన రెండో విమానం.

ఈ విమానం భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి బయలుదేరింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైలో ల్యాండ్ అయ్యిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 

Latest Videos


‘‘మరో ఆపరేషన్ కావేరి విమానం ముంబైకి వచ్చింది. మరో 246 మంది భారతీయులు మాతృభూమికి తిరిగి వచ్చారు’’ అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం ట్వీట్ చేశారు. ఇక, అంతకుముందు బుధవారం సౌదీ అరేబియాలోని జెడ్డా నుండి 360 మంది భారతీయ తరలింపులతో కూడిన మొదటి విమానం ఢిల్లీకి చేరుకుంది. 

‘‘జెడ్డా నుంచి భారతీయులను త్వరగా స్వదేశానికి పంపడానికి మా ప్రయత్నాలు ఫలించాయి. ఐఏఎఫ్ C17 Globemaster ద్వారా ప్రయాణించే 246 మంది భారతీయులు త్వరలో ముంబైకి చేరుకుంటారు. జెడ్డా విమానాశ్రయం నుంచి వారిని ఇండియాకు పంపడం ఆనందంగా ఉంది’’ అని విమానం ముంబైకి బయలుదేరే నిమిషాల ముందు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన జెడ్డాలోనే ఉండి  భారతీయుల తరలింపు ప్రక్రియను  పర్యవేక్షిస్తున్నారు. 

ఇక, ఆపరేషన్ కావేరి కింద భారతదేశం తన పౌరులను ఖార్టూమ్, ఇతర సమస్యాత్మక ప్రాంతాల నుండి బస్సులలో పోర్ట్ సుడాన్‌కు తరలిస్తుంది. అక్కడి నుంచి వారిని తొలుత సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారత వైమానిక దళానికి చెందిన విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్నారు. భారతీయుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ జెడ్డాకు చేరుకున్నారు. 

click me!