ఆటోడ్రైవర్ యూట్యూబ్ ఛానెల్ వైరల్.. పర్సనల్ ఫైనాన్స్ పై పాఠాలు చెబుతూ...

First Published Apr 27, 2023, 11:05 AM IST

బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ పగలంతా ఆటో నడుపుతూనే.. తన హాబీ అయిన యూట్యూబ్ చానల్ ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. పర్సనల్ ఫైనాన్స్ మీద టిప్స్ ఇస్తూ ఆకర్షిస్తున్నాడు. 

బెంగళూరు : వృత్తి, ప్రవృత్తి.. ఇవి రెండూ వేర్వేరు అంశాలు..  ఒకదానికొకటి పొంతనలేకుండా ఉంటాయి. అయితే రెండింటిమధ్య సమన్వం సాధించడం మామూలు విషయం కాదు. అలా చేసేవాళ్లు అతి కొద్దిమందే ఉంటారు. ఈ ఆటో డ్రైవర్ అలాంటివాడే. తన హాబీతో తనతో పాటు నలుగురికి మంచి జరగాలని కోరుకుంటున్నాడు. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్.. పర్సనల్ ఫైనాన్స్ మీద ఓ యూ ట్యూబ్ చానల్ నడుపుతూ నలుగురికి సాయపడుతున్నాడు. అతని గురించిన డిటైల్స్ ఇవి.. 

auto drive

జనార్దన్ ఆటో నడుపుతూ వ్యక్తిగత ఫైనాన్స్‌పై యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. ఆ ఆటోలో ప్రయాణీంచిన ఓ బెంగళూరు వ్యక్తి అతని ఆటోలో ఉన్న బోర్డును ఫోటో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ట్వీట్‌లో చేర్చబడిన ఫోటో ఆటో లోపల ఉంచిన ప్లకార్డ్‌ను చూపిస్తుంది, దీంట్లో “దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ జనార్ధన్ పెట్టుబడిదారు. ప్లీజ్ షేర్, లైక్, కామెంట్” అని ఉంటుంది.

సిఎంఆర్ యూనివర్సిటీలో బీకాం గ్రాడ్యుయేట్ అయిన 29 ఏళ్ల జనార్దన్ ఎప్పుడూ స్టాక్ మార్కెట్‌పై మక్కువ చూపేవాడు. తర్వాత ఆ అభిరుచిని గోల్డ్ జనార్ధన్ ఇన్వెస్టర్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌గా మార్చాడు.

“గ్రాడ్యుయేషన్ తర్వాత, నేను 2018లో ఒక ఆటోమొబైల్ కంపెనీకి సేల్స్‌పర్సన్‌గా చేశాను. కోవిడ్ సమయంలో, నా ఉద్యోగం పోయింది. దీనివల్ల నేను విపరీతమైన ఆర్థిక ఒత్తిడికి గురయ్యాను. పని కోసం వెతుకుతున్నాను, కానీ నాకు నెలకు రూ.15-20వేల కంటే ఎక్కువ ఇవ్వడానికి ఏ కంపెనీ సిద్ధంగా లేదు,”అని జనార్దన్ చెప్పారు. 

ఆ తరువాతే జనార్థన్ ఆటో నడపడం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు డ్రైవ్ చేస్తాడు. “ఉద్యోగం లేకుండా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. మధ్యతరగతి వారికి డబ్బును ఎలా నిర్వహించుకోవాలో.. వినియోగించుకోవాలో తెలియదని నేను గ్రహించాను. వారు ఆస్తులు కొనడానికి కష్టపడతారు. కార్ల వంటి విలాసవంతమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తారు, ఇవి నిజంగా పెట్టుబడి కాదు. కానీ బాధ్యతలు అనుకుంటారు. 

నేను పుస్తకాలు చదవడం,యూట్యూబ్ ద్వారా డబ్బు శక్తిని గ్రహించాను. డబ్బును ఆదా చేయడం లేదా పెట్టుబడి పెట్టడం, సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి గల ప్రాముఖ్యతను ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను”అని జనార్దన్ ఆర్థిక సలహా గురించి యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించడం గురించి మాట్లాడుతూ చెప్పారు. కొన్ని వీడియోలను చూస్తే, జనార్దన్ కున్న ఆర్థిక పరిజ్ఞానం.. ఏ ఆర్థికవేత్త లేదా ఇన్వెస్ట్ మెంట్ గురూ చెప్పేవాటికంటే తక్కువ కాదనే విషయం అర్థమవుతుంది. 

అతని యూట్యూబ్ చానల్ తో స్పూర్తి పొందిన వారు కూడా చాలా మందే ఉన్నారు. జనార్థన్ తనగురించి మాట్లాడుతూ.. “మా నాన్న డ్రైవర్. మాకు ఆటో ఉంది. ప్రస్తుతం నేను ఉబర్ లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే.. ఈ కష్ట సమయంలో, డబ్బు విలువ, పొదుపు లేదా పెట్టుబడి ప్రాముఖ్యతను గ్రహించాను.

మనం డబ్బు సంపాదిస్తాం కానీ దాన్ని ఎలా నిర్వహించాలో మనలో చాలా మందికి తెలియదు. నేను ఇప్పటికే యూట్యూబ్ ఛానెల్‌ని కలిగి ఉన్నాను. వ్యక్తిగత ఫైనాన్స్ పరిజ్ఞానంతో స్టాక్స్‌పై కోర్సు చేశాను”అని పంచుకున్నాడు. "నేను ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇతరులకు సహాయం చేయడానికి యూట్యూబ్‌లో గ్రాఫ్‌లు, చార్ట్‌ల సహాయంతో నా జ్ఞానాన్ని చురుగ్గా పంచుకోవడం ప్రారంభించాను" అని తెలిపారు.

ప్రయాణీకుల సీటు పక్కనే, అతని యూట్యూబ్ ఛానెల్ పేరు ఇంగ్లీష్, కన్నడలలో రాసి ఉంటుంది. సబ్ స్క్రైబ్ చేసుకోమని.. ఫాలో అవ్వమని కోరతాడు. అతని ఆటో ఎక్కిన ప్రయాణికులు అతని గురించి తెలుసుకున్న తర్వాత.. ఆసక్తిని కనబరుస్తారు.  అతని కథ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. జనార్ధన్ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రస్తుతం 3.65వేల ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది.

click me!