
కరోనా మహమ్మారి సృష్టించిన మారణహోమాన్ని ఇంకా మరిచేపోలేదు... గుట్టలుగా శవాలను దహనం చేసిన దృశ్యాలు ఇంకా కళ్లముందు మెదులుతూనే వున్నాయి. యావత్ ప్రపంచం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని విళవిళ్లాడిపోయింది... ఇప్పుడిప్పుడే ఈ మహమ్మారి భయం నుండి భయటకువస్తున్నాం. ఇలాంటి సమయంలో మరో వైరస్ ను మనుషులపై రుద్దుతున్నాయి గబ్బిలాలు. కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా ప్రాణాంతకం కావడంపై మళ్లీ భయాందోళన మొదలయ్యింది.
ఏమిటీ వైరస్..? :
ఇటీవల కేరళ రాష్ట్రంలోని పండిక్కాడ్ పట్టణంలో ఓ 14ఏళ్ల బాలుడు అనారోగ్యంతో మృతిచెందాడు. అయితే ఆ బాలుడి మృతికి కారణం నిఫా వైరస్ గా గుర్తించారు. ఈ వైరస్ పేరు వినగానే ఒక్కసారిగా భయాందోళన మొదలయ్యింది. మృతిచెందిన బాలుడి కుటుంబసభ్యులతో పాటు మరికొందరికి వైద్య పరీక్షలు నిర్వహించగా 60 మందికి ఈ వైరస్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు... వీరిని ఐసోలేషన్ లో పెట్టారు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.
బాలుడి మృతిచెందడంతో పాటు మరికొందరిలో నిఫా లక్షణాలు కనిపించడంతో కేరళ వైద్యారోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ముందుగా నిఫా కేసులు బయటపడ్డ పడిక్కాడ్ పట్టణంలో ఆంక్షలు విధించారు... ప్రజలందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలంటూ మళ్ళీ కరోనా సమయంలో మాదిరిగానే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా నిఫా వైరస్ లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే సమాచారం అందించాలని కోరారు.
ఇలా కేరళలో నిఫా వైరస్ కేసులు బయటపడటంతో భారత్ లో మరీముఖ్యంగా దక్షణాది రాష్ట్రాల్లో భయం మొదలయ్యింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా నిఫావైరస్ వ్యాప్తితో భయపడుతున్నారు. ఈ క్రమంలో అసలు ఏమిటీ నిఫావైరస్? ఎలా వ్యాప్తి చెందుతుంది? లక్షణాలు ఏమిటి? అనేది తెలుసుకుందాం.
కరోనా వైరస్ గురించి మనందరికీ తెలుసు... సేమ్ అలాంటిదే ఈ నిఫావైరస్ కూడా. ఇది కూడా జంతువుల నుండి మనుషులకు వ్యాపించే వైరస్. ముఖ్యంగా గబ్బిలాలు, పందుల నుండి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది... కాబట్టి ముందు జాగ్రత్తలు అవసరం. వైరస్ లక్షణాలతో బాధపడేవారికి దూరంగా వుండాలి...సోషల్ డిస్టెన్స్ పాటించాలి.
నిఫా వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన ఐదు రోజుల నుండి రెండు వారాల తర్వాత లక్షణాలు బయటపడతాయి. కొందరిలో గుర్తించదగిన లక్షణాలు కనిపించవు... అయితే చాలావరకు శ్వాస సంబంధిత సమస్యలతో ఈ వైరస్ లక్షణాలు బయటపడతాయి. లక్షణాలు బయటపడ్డ వెంటనే ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి ప్రాణాతకంగా మారుతుంది. ఈ వైరస్ బారినపడినవారిలో 70శాతం మరణాలు నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం.
నిఫా వైరస్ లక్షణాలు :
ప్రాథమిక లక్షణాలు :
తీవ్ర జ్వరం
తలనొప్పి
వాంతులు
గొంతుమంట
కండరాల నొప్పి
తీవ్ర లక్షణాలు :
తల తిరగడం
అధిక నిద్రమత్తు
తీవ్ర శ్వాస సమస్యలు
స్పృహ కోల్పోవడం
మెదడు వాపు
న్యుమోనియా
నిఫా వైరస్ వ్యాప్తి :
జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. పందులు, గబ్బిలాలే ఈ వైరస్ వాహకాలుగా పనిచేస్తున్నాయి.. ఇతర జంతువులు, మనుషులకు వీటి ద్వారానే వైరస్ సంక్రమిస్తోంది.
ఈ నిఫా వైరస్ సోకకుండా ముందుజాగ్రత్తలు పాటించడమే మంచిది...ఎందుకంటే ఒక్కసారి ఈ వైరస్ బారినపడితే చికిత్స చేసేందుకు ప్రత్యేక మందులు,వ్యాక్సీన్లు లేవు. కేవలం ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా చికిత్స అందిస్తారంతే. ఈ వైరస్ ను శరీరంనుండి తరిమికకొట్టే ప్రత్యేక చికిత్స లేదు.
అయితే ఈ నిఫా వైరస్ కేసులు కేరళలోనే ఎక్కువగా బయటపడుతున్నాయి. కేరళ వాతావరణం ఈ వైరస్ వ్యాప్తికి అనుకూలంగా వుండటంతోనే అక్కడే కేసులు బయటపడుతున్నాయని భావిస్తున్నారు. 2018 లో ఇలాగే కేరళలో 18 మంది నిఫా బారినపడితే 17 మంది మరణించారు... కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. దీన్ని బట్టే ఈ వైరస్ ఎంత ప్రమాదకారో అర్థమవుతోంది.
నిఫా వైరస్ చరిత్ర :
మొట్టమెదట నిఫా వైరస్ కేసులు మలేషియాలో బయటపడ్డాయి. 1998లోనే ఈ మహమ్మారి 108 మలేషియా వాసులను పొట్టన పెట్టుకుంది. సుంగయ్ నిఫా అనే గ్రామంలో ఈ వైరస్ మొదట బైటపడింది కాబట్టి దీనికి నిఫా అనే పేరు వచ్చింది.