ప్రస్తుతం సైన్యం నిర్మిస్తున్న బెయిలీ వంతెన వయనాడ్‌లోని కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ (DSC) కెప్టెన్ పురాన్ సింగ్ నథావత్ బెయిలీ వంతెన నిర్మాణాన్ని సమన్వయం చేస్తున్నారు. వంతెన నిర్మాణ సామగ్రిని 17 ట్రక్కుల్లో వయనాడ్‌కు తీసుకొచ్చారు. బ్రిటిష్ వారు కనిపెట్టిన ఈ వంతెన నేడు ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
బెయిలీ వంతెనను మొట్టమొదటిసారి 1942లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటీషర్ డొనాల్డ్ బెయిలీ నిర్మించారు. ఈ వంతెనలు ఇప్పటికీ అతని పేరుతోనే పిలుస్తున్నారు. వంతెనలు కట్టడం అతనికి కాలక్షేపం లాంటిది. అతను వివిధ రకాల వంతెనల నమూనాలను నిర్మించి ఉంచారు. వాటి నమూనాను తన పైఅధికారికి చూపించాడు. పైఅధికారి వంతెన ఉపయోగాన్ని అర్థం చేసుకుని వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అప్పుడు ఈ వంతెనను నిర్మించి వివిధ మార్గాల్లో పరీక్షించారు. సపోర్ట్ బ్రిడ్జ్, ఆర్చ్ బ్రిడ్జ్, ఫ్లాట్ ట్రస్ బ్రిడ్జ్ లాంటి వివిధ రూపాల్లో వంతెనలు నిర్మించి.. వాటి వినియోగాన్ని పరీక్షించారు. ఇలాంటి వంతెనను సిల్లర్స్ ఛానల్‌పై నిర్మించారు. ఇది అవాన్ నది, రివర్ స్టోర్ పక్కన ఉన్న చిత్తడి ప్రాంతం (స్టాన్‌పిట్ మార్షెస్) మీదుగా ఉంది. ఇక్కడ నిర్మించిన నేటికి వినియోగంలో ఉంది.
అనేక ట్రయల్స్, చెక్స్ తర్వాత బెయిలీ బ్రిడ్జిని కార్ప్స్ ఆఫ్ రాయల్ మిలిటరీ ఇంజినీర్స్‌కు అందించింది. అన్ని పరిశీలనల అనంతరం 1942లో ఉత్తర ఆఫ్రికాలో బ్రిటిష్ సైన్యం కోసం నిర్మించారు. 1944 నాటికి ఇటువంటి వంతెనలు మరిన్ని నిర్మించారు. ఈలోగా అమెరికా ప్రభుత్వం కూడా వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అమెరికా అయితే సొంత డిజైన్‌ను తయారు చేసుకుంది.
బెయిలీ వంతెన అంటే ఏమిటి?
బెయిలీ బ్రిడ్జ్ అనేది తాత్కాలిక వంతెన. దీనిని విడి భాగాలతో తయారు చేస్తారు. కాబట్టి వంతెన నిర్మించడం లేదా తొలగించడం చాలా సులభం. వంతెన ప్రధాన భాగాలు స్టీల్, కలపతో చేస్తారు. ముందుగా నిర్మించిన భాగాలను బ్రిడ్జి అవసరమైన చోటికి తీసుకొచ్చి ఒకచోట చేర్చి నిర్మిస్తారు. ఏటవాలులు ఉన్న కఠినమైన ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో బెయిలీ వంతెనలను వినియోగిస్తారు. చిన్న వాహనాలు వెళ్లేలా నిర్మించారు. లోడ్ మోసే సామర్థ్యాన్ని బట్టి 40 నుంచి 70 టన్నుల బరువు మోసేలా వీటిని వివిధ రకాలుగా విభజించారు. ఈ వంతెనలను బ్రిటిష్, కెనడియన్, అమెరికన్ సైన్యాలు ఎక్కువగా ఉపయోగిస్తాయి.
బెయిలీ వంతెన ప్రయోజనాలు
బెయిలీ వంతెన తయారు చేయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. బిగించడానికి భారీ యంత్రాలు అవసరం లేదు. కలప, ఉక్కుతో ముందుగా తయారు చేసిన తేలికైన విడి భాగాలను ఈజీగా సెట్ చేయొచ్చు. చిన్నచిన్న భాగాలు కాబట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు సులభంగా తరలించవచ్చు. తక్కువ బరువున్న భాగాలు కావడం వల్ల చేతితో అమర్చవచ్చు. క్రేన్ అవసరం అసలే ఉండదు. అయినా ఈ బ్రిడ్జిలు చాలా దృఢంగా ఉంటాయి. టన్నుల కొద్దీ బరువున్న పెద్ద యుద్ధ ట్యాంకులను కూడా బెయిలీ బ్రిడ్జిలు మోయగలవు.
భారతదేశంలో బెయిలీ వంతెనలు
1996 నవంబర్ 8న కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని రాణి వద్ద పంపా నదిపై మొదటి బెయిలీ వంతెనను నిర్మించారు. పంపా నదిపై 36 ఏళ్ల నాటి రాణి వంతెన కూలిపోవడంతో సైన్యం దాని స్థానంలో తాత్కాలిక వంతెనను నిర్మించింది. ఈ వంతెన మీదుగా రెండు నెలల పాటు తేలికపాటి వాహనాలు నది దాటాయి. కశ్మీర్‌లో సైనిక అవసరాల కోసం తొలిసారిగా ఇలాంటి వంతెనను నిర్మించారు. లడఖ్‌లోని ద్రాస్, సురు నదుల మధ్య వంతెన నిర్మించారు. ఇది 30 మీటర్లు (98 అడుగులు) పొడవు ఉంటుంది. ఈ వంతెన సముద్ర మట్టానికి 5,602 మీటర్ల ఎత్తులో ఉంది.
72 గంటల రికార్డు సమయంలోనే నిర్మాణం...
కొండలు,లోయల ప్రాంతాల్లో విపత్కర పరిస్థితుల్లో బెయిలీ బ్రిడ్జిలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. భారత్‌లో సైన్యం తమ అవసరాల కోసం సిక్కిం లాంటి ఈశాన్య ప్రాంతాల్లోని సవాళ్లతో కూడుకున్న వాతావరణ పరిస్థితుల్లో వినియోగిస్తుంటుంది. ఇటీవల సవాళ్లతో కూడిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ.. సిక్కింలోని డిక్చు-సంక్లాంగ్ రహదారిపై 70 అడుగుల బెయిలీ వంతెనను 72 గంటల్లోనే నిర్మించారు మన సైనికులు.