కేరళలోని వయనాడ్ జిల్లా గత కొన్ని రోజులుగా తీవ్ర విపత్తును ఎదుర్కొంటోంది. భారీ వర్షాలు, కొండచరియల విరిగిపడటం కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. బురద మట్టిలో కూరుకుపోయి చనిపోయిన వారి సంఖ్య 270 దాటింది. మరో 200 మందికి పైగా గల్లంతయ్యారు. వారి జాడ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. ఇంకా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రకృతి విపత్తు కేరళను వణికిస్తోంది.
కుండపోత వానలు, ఒక్కసారిగా పోటెత్తిన భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలతో వయనాడ్ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాలు, బురద, రాళ్లతో కూడిన వరదలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గ్రామాలకు గ్రామాలకు నామరూపాల్లేకుండా పోయాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండచరియల విరిగిపడటంతో వర్షం ఇంకా కురుస్తూనే ఉండటంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి.
ప్రకృతి ప్రకోపించడంతో వయనాడ్ జిల్లాలోని అనేక గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఈ విధ్వంసం ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసింది. సైన్యం, సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించడానికి తాత్కాలిక వంతెనలు నిర్మిస్తున్నారు. వాతావరణ శాఖ రెండు రోజులు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేరళలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నప్పటికీ, విపత్తు నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పవచ్చు. కేరళలో వరదలు, ప్రకృతి విపత్తులు మానవ తప్పిదాలతో కూడిన విషాదంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను ఎదుర్కొనడం కోసం విపత్తు నిర్వహణ చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వరదలతో కొండచరియలు విరిగిపడి సృష్టించిన ఈ బీభత్సవం కేరళ చూసిన అతిపెద్ద విపత్తుల్లో ఒకటి. వయనాడ్ జల్లాలోని ముండకై కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు కీలకమైన బెయిలీ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి వరకు కొనసాగిన వంతెన నిర్మాణం ఉదయం చివరి దశకు చేరుకుంది. ఈ వంతెనను ఆర్మీ సభ్యులు నిర్మిస్తున్నారు. గంటల వ్యవధిలో ముండకై వైపు ఉన్న భూమికి వంతెన అనుసంధానం కావచ్చని భావిస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే బెయిలీ బ్రిడ్జి మీదుగా జేసీబీ లాంటి వాహనాలు ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సహాయక చర్యలు చేపట్టడం మరింత సులభం అవుతుంది.
వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటం కేరళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెను విపత్తుగా మారుతోంది. మృతుల సంఖ్య 270కి చేరగా.. ముండకై, చలియార్‌లో ఇప్పటివరకు 98 మృతదేహాలను వెలికితీశారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత 75 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.
రెండో రోజు (బుధవారం) భారీ వర్షాలు, కొండలపై వరదలు రావడంతో సహాయక చర్యలకు పెద్ద సవాల్‌గా మారింది. చురల్‌మల వద్ద సహాయక చర్యల కోసం నిర్మించిన తాత్కాలిక వంతెన మునిగిపోయింది. దీంతో తాళ్ల సాయంతో రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 1,592 మందిని సైన్యం, బలగాలు రక్షించారు. 8,107 మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు.