కొత్త టోల్ పాలసీతో ఎంత డబ్బు ఆదా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవేలు ఉన్నాయి. వీటిపై అనేకచోట్ల టోల్ ప్లాజాలు ఏర్పాటుచేసి ఛార్జీలు వసూలు చేస్తారు. ఒక్కో టోల్ ప్లాజా వద్ద ఒక్కోలా చార్జీలు ఉంటాయి. ఇలా ప్రతిసారి టోల్ చెల్లించకుండా నిత్యం ఆ టోల్ గేట్ ద్వారా ప్రయాణం సాగించేవారు నెలవారి పాసులు పొందవచ్చు. నెలకు రూ. 340 టోల్ పాస్ కోసం చెల్లించాలి... అంటే ఏడాదికి రూ. 4,080 ఖర్చు అవుతుంది. అందులోనూ ఈ పాస్ కేవలం ఆ ఒక్క టోల్ గేట్ లోనే పనిచేస్తుంది.
అయితే కొత్త టోల్ పాలసీలో ఏడాదికి కేవలం రూ.3 వేలు చెల్లించి టోల్ పాస్ పొందవచ్చు. ఇది దేశంలోని అన్ని టోల్ ప్లాజాల్లో పనిచేస్తుంది. అంటే నెలవారి పాసులతో పోలిస్తే ఈ ఏడాది పాస్ తక్కువ ధరకు రావడమే కాదు ప్రయాణ సమయంలో డబ్బులను భారీగా ఆదా చేస్తుంది.
ఏడాది టోల్ పాస్ లతో పాటు వెహికిల్ లైఫ్ టైమ్ టోల్ పాసుల జారీకి కూడా కేంద్రం సిద్దమవుతోంది. అంటే ఓ వాహనానికి 15 ఏళ్లపాటు టోల్ కట్టాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.30 వేలు చెల్లించి పాస్ తీసుకోవాలన్నమాట. ఈ లైఫ్ టైమ్ పాస్ ను కూడా కొత్త టోల్ పాలసీ ద్వారా ప్రవేశపెట్టే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.