New Aadhar APP
New Aadhar APP : ఆధార్ కార్డు ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది... భారతీయ పౌరులకు ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అందుకే దేశంలోని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డును జారీచేస్తోంది కేంద్ర ప్రభుత్వం. చిన్నారుల నుండి ముసలివారికి వరకు ప్రతి ఒక్కరికి ఓ ప్రత్యేక సంఖ్యను కేటాయించి ఆధార్ జారీ చేస్తున్నారు. అయితే ఆధార్ కార్డ్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని దీనిపై నిరంతరం పనిచేస్తోంది ప్రభుత్వం.
తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త యాప్‌ను విడుదల చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇకపై మీరు ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీని వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ లో ఆధార్ యాప్ ఉంటే సరిపోతుంది.
ప్రస్తుతం ఈ అప్లికేషన్ బీటా వెర్షన్‌లో ఉంది... UIDAI దీనిని ఇంకా పరీక్షిస్తోంది. టెస్టింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే దీన్ని ప్లే స్టోర్‌లో విడుదల చేస్తారు. అప్పుడే ఈ కొత్త ఆధార్ యాప్ ను ఉపయోగించుకునే వీలుంటుంది. కాబట్టి ఎవరైనా మీకు ఫోన్ చేసి కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేయమని చెబితే జాగ్రత్తగా ఉండండి. యాప్‌ను ఎప్పుడూ అధికారిక యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి.
New Aadhar APP
కొత్త ఆధార్ యాప్ ఎలా పనిచేస్తుంది?
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో ఒక వీడియోను షేర్ చేశారు. కొత్త ఆధార్ యాప్ ఎలా పనిచేస్తుందో ఇందులో వివరించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, ఫేస్ ఆథెంటికేషన్ ద్వారా ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో వీడియోలో చూపించారు. ''కొత్త ఆధార్ మొబైల్ యాప్ ఫేస్ ఐడీ ఆథెంటికేషన్ ద్వారా ఓపెన్ అవుతుంది. ఇకపై ఎలాంటి ఫిజికల్ కార్డులు, ఫోటోకాపీలు అవసరం లేదు'' అని కేంద్ర మంత్రి ట్వీట్ చేసారు.
కొత్త ఆధార్ యాప్ వల్ల ఉపయోగాలు ఏమిటి?
- ఈ ఆథెంటికేషన్‌లో యూజర్ యొక్క బేసిక్ సమాచారం మాత్రమే షేర్ చేయబడుతుంది, అది అవతలి వ్యక్తికి అవసరం.
- ఇప్పుడు ఆధార్ కార్డు స్కాన్ చేసినా లేదా దాని కాపీ ఇచ్చిన అందులో ముద్రించిన మొత్తం వివరాలు లీక్ అవుతాయి.
- కొత్త ఆధార్ యాప్‌లో యూజర్ల డేటా ప్రైవసీకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అంటే మీ ఆధార్ కార్డు వివరాలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. మీ గోప్యమైన సమాచారం సైబర్ నేరగాళ్లు లేదా మోసగాళ్ల వరకు చేరదు.
- కొత్త ఆధార్ యాప్‌లో ఆథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా అవతలి వ్యక్తికి ఎంత అవసరమో అంతే సమాచారం చేరుతుంది.
New Aadhar APP
కొత్త ఆధార్ యాప్‌లో ప్రత్యేకతలు ఏమిటి?
- కొత్త ఆధార్ యాప్‌లో క్యూఆర్ స్కానింగ్, ఫేస్ ఆథెంటికేషన్ ద్వారానే మీ వెరిఫికేషన్ జరుగుతుంది.
- కొత్త ఆధార్ యాప్‌లో మీ అనుమతి లేకుండా ఎలాంటి డేటా షేర్ కాదు. అంటే పూర్తి ప్రైవసీ ఉంటుంది.
- ఎక్కడైనా వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్ లేదా ఫోటోకాపీ చూపించాల్సిన అవసరం లేదు. హోటల్, ఎయిర్‌పోర్ట్‌లో ఆధార్ వంటి డాక్యుమెంట్ల ఫోటోకాపీలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
- కొత్త ఆధార్ యాప్ ద్వారా చాలా రకాల స్కామ్‌ల నుంచి ప్రజలు తప్పించుకుంటారు.