mouni baba
Prayagraj Kumbh Mela 2025 : సంసార జీవితాన్ని వదిలిపెట్టి ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవారే సన్యాసులు. సాధారణంగా ఇలా సన్యాసంలో చేరినవారు నిత్యం దైవచింతనలో, ధ్యానంలో వుంటారు. కొందరు సన్యాసులు, మునులు మాత్రం కాషాయ వస్త్రాలు ధరించినా సమాజ శ్రేయస్సులోనే దేవున్ని చూసుకుంటారు. అలాంటి సన్యాసుల్లో ఒకరే ఈ మౌని బాబా.
మంచి చదువుకున్న కుటుంబంనుండి వచ్చిన దినేష్ స్వరూప్ సన్యాసిగా మారాడు. అయితే ఓవైపు దైవ చింతనలో మునిగిపోతూనే మరోవైపు తన జ్ఞానాన్ని యువతకు పంచుతున్నారు. ఇలా ఈ మౌని బాబా ఇప్పటికే ఎందరో యువత జీవితాలను మార్చారు. ప్రస్తుతం ఈయన ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో కనిపించారు. ఈ సందర్భంగా మౌని బాబా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Mouni Baba
ఎవరీ మౌని బాబా :
ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ ప్రాంతానికి చెందిన దినేష్ స్వరూప్ మంచి విద్యావంతుడు. అతడు జీవశాస్త్రంలో బిఎస్సి పూర్తిచేసాడు. అతడి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధుల్లో వుండగా మరణించాడు... దీంతో కారుణ్య నియామకం కింద అతడి ఆ ఉద్యోగం వచ్చింది.
అయితే దినేష్ కు మాత్రం ఈ సంసార జీవితంపై విరక్తి పుట్టింది. అందువల్లే మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి, కుటుంబానికి కూడా దూరమై సన్యాసంలో చేరారు. ప్రతాప్ గఢ్ లోని చిల్విలా శివశక్తి బజరంగ్ ధామ్ కు తన మకాం మార్చాడు. ఇలా ఆద్యాపక వృత్తిని వదిలేసి ఆద్యాత్మికత వైపు నడిచాడు. మౌని బాబాగా మారిపోయారు.
ఇలా సన్యాసంలో చేరినప్పటి నుండి మాట్లాడటం మానేసారు దినేష్. ఇలా గత 40 ఏళ్లకు అతడి నోటినుండి ఒక్కమాట కూడా బయటకు రాలేదు. ఇలా జీవితాంతం మౌనంగా వుండేందుకు సిద్దపడ్డాడు కాబట్టి అతడిపేరు మౌని బాబాగా స్థిరపడిపోయింది.
కేవలం దశాబ్దాలుగా మౌనంగా వుండటమే కాదు తిండి కూడా తీసుకోవడంలేదు ఈ మౌని బాబా. కానీ రోజుకు ఐదారుసార్లు టీ మాత్రం తాగుతారు... అదే అతడి ఆహారం. తనవద్దకు వచ్చే భక్తులకు కూడా టీనే ప్రసాదంగా అందిస్తారు. ఇలా ఏళ్లతరబడి ఆహారం తీసుకోకున్నా ఆయన చాలా ఆరోగ్యంగా వున్నారు.
Mouni Baba
మౌని బాబా సివిల్స్ కోచింగ్ :
ఇలా సన్యాసిగా మారినా అతడిలోని ఉపాధ్యాయుడు ఇంకా మేల్కొనే వున్నాడు. అందువల్లే తన విజ్ఞానాన్ని వృధాచేయడం ఇష్టంలేని స్వ కాషాయం ధరించే క్లాసులు చెప్పడం ప్రారంభించాడు. ప్రస్తుత ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మరీ యువత జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలైన ఐఎఎస్, ఐపిఎస్ వంటి వాటికోసం ప్రిపేర్ అవుతున్న యువతకు ఈ మౌన ముని కోచింగ్ ఇస్తున్నారు. ఆయనవద్ద కోచింగ్ తీసుకున్నవారిలో ఇప్పటికే పలువురు సివిల్స్ ర్యాంకులు సాధించారు. ప్రతిఏటా ఆయనవద్ద కోచింగ్ తీసుకున్నవారిలో ఒకరిద్దరికి ర్యాంక్ వస్తుంది. ఇలా ఇప్పటికే చాలామంది సివిల్ సర్వెంట్స్ ను తయారుచేసారు మౌని మహారాజ్.
అసలు మాటలే ఆడకుండా ఎలా కోచింగ్ ఇస్తున్నారనేగా మీ అనుమానం? ఈ కోచింగ్ కోసం మౌన ముని కాస్త హైటెక్ బాబాగా మారిపోయారు. ప్రస్తుతం ప్రతిఒక్కరివద్ద స్మార్ట్ ఫోన్లు వుంటున్నాయి... వాటిలో వాట్సాఫ్ తప్పనిసరిగా వుంటోంది. దీన్నే తన కోచింగ్ కోసం ఉపయోగిస్తున్నారు ఈ బాబా.
తనవద్ద కోచింగ్ తీసుకునే యువతకోసం స్వయంగా తన చేతితోనే నోట్స్ ప్రిఫేర్ చేస్తారు మౌని బాబా. దీన్ని వాట్సాఫ్ లో తన విద్యార్థులకు షేర్ చేస్తారు. విద్యార్థులకు కూడా ఏవయినా డౌట్స్ వుంటే ఇలా వాట్సాప్ లో మౌని బాబాకు అడుగుతారు. వాటికి ఇలా నోట్స్ ద్వారానే సమాధానం ఇస్తుంటారు ఈ మౌన ముని.
ఇలా దినేష్ కాస్త మౌన మునిగా మారినా...అతడిలోకి ఉపాధ్యాయుడు మాత్రం మారలేదు. కాషాయం కట్టిన ఇతడు ఇప్పటికే ఎందరో యువతను దేశంలోనే అత్యున్నత సర్వీసుల్లో చేరి జీవితంలో స్థిరపడేలా చేసారు. మరోవైపు తన ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఎందరో శిష్యులను పొందారు... వారికి దైవచింతన మార్గంలో నడిపిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండురకాల ఉపాధ్యాయ వృత్తులు చేపట్టారు మౌని బాబా.
Mouni Baba
మౌని బాబా కాదు హైటెక్ ముని :
సివిల్స్ కోచింగ్ లోనే కాదు తన జీవితంలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఈ మౌని బాబా. ఏదయినా అవసరం వున్నపుడు కంప్యూటర్ ను ఉపయోగిస్తుంటారు. ఇక మంచి స్పోర్ట్స్ బైక్ పై రయ్ రయ్ మంటూ దూసుకెళ్ళడం ఈయనకు చాలా ఇష్టమట. అందువల్లే అప్పుడప్పుడు కాషాయ వస్త్రాల్లోనే బైక్ ఎక్కి నచ్చిన చోటికి వెళ్ళివస్తుంటారు.
ఇక సన్యాసంలో చేరినా చదువుపై మక్కువ తగ్గని ఈ మౌన ముని పుస్తకాలు కూడా రాస్తున్నారు. ఇప్పుడు ఆయన 'ధర్మ కర్మ మర్మ సాగర్' అనే పుస్తకాన్ని రచిస్తున్నారు. ఈ పుస్తకం మనిషి పుట్టుక నుండి మరణం వరకు, నిద్ర నుండి మేల్కొనే వరకు ప్రతి పనికి సంబంధించిన గ్రంథ నియమాలను అందిస్తుంది. ఇది ఫిబ్రవరి 2025 నాటికి ప్రచురించబడుతుంది. మహా కుంభమేళా పూర్తయ్యేనాటికి ఈ పుస్తకం అందుబాటులోకి వస్తుంది.
ఇలా ఓ సన్యాసి సివిల్స్ కోచింగ్ ఇవ్వడం, టెక్నాలజీని ఉపయోగించడం, పుస్తకాలు రాయడం... వీటితోపాటు దైవ చింతనలో మునిగిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన జీవితవిధానం నేటి తరానికి స్పూర్తిధాయకంగా నిలుస్తోంది. ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025 లో ఈ మౌన ముని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయనను చూసేందుకు,ఆశిస్సులు తీసుకునేందుకు ఎందరో యువత ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవికూడా చదవండి :
మీరు ఐఏఎస్, ఐపిఎస్ కావాలనుకుంటున్నారా? : అయితే మీకోసమే ఈ సూపర్ స్కీమ్!
22 ఏళ్లకే ఐఎఎస్ ... చదువుల తల్లి అనన్య సింగ్ సక్సెస్ స్టోరీ