Kisan Credit Card : రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ 2025-26 దేశ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది మోదీ 3.O సర్కార్. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశ రైతాంగానికి తీపికబురు చెప్పారు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో ఒకటి ఈ కిసాన్ క్రెడిట్ స్కీం... రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు బ్యాంకుల ద్వారా దీన్ని అమలు చేస్తున్నారు. అయితే తాజా బడ్జెట్ లో రైతులకు ఈ KCC పథకం ద్వారా మరింత లబ్దిని చేకూర్చే ఏర్పాటుచేసింది మోదీ సర్కార్. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేసారు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ద్వారా రైతులు, పాడిరైతులు, మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా షార్ట్ టర్మ్ లోన్స్ అందిస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు షార్ట్ టర్మ్ లోన్స్ అందించేవారు. దీన్ని రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 7.7 కోట్లమంది రైతులు లబ్ది పొందనున్నారు. ఈ లోన్ వడ్డీని కూడా మరింత తగ్గించి రైతులకు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇలా దేశ రైతాంగానికి బడ్జెట్ 2025 ద్వారా గుడ్ న్యూస్ వినిపించింది.