kerala Wayanad Landslides: వయనాడ్‌ విలయం: 293కి పెరిగిన మృతుల సంఖ్య.. 240 మంది మిస్సింగ్‌

First Published | Aug 2, 2024, 10:58 AM IST

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన మరింత విషాదకరంగా మారుతోంది. గంటగంటలకు మృతుల సంఖ్య పెరిగిపోతోంది. మూడు రోజులు దాటినా ఇంకా 240 మంది జాడ తేలియ రాలేదు.

 

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే 293 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 240 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని సమాచారం. 1,700 మంది సహాయక శిబిరాల్లో ఉన్నారు. గురువారం నిర్వహించిన సహాయక చర్యల్లో 40 మృతదేహాలను బలగాలు వెలికితీశాయి. శుక్రవారం కూడా విపత్తు ప్రాంతంలో సోదాలు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ చర్యలను ఆరు జోన్లుగా విభజించి... గల్లంతైన వారి కోసం శోధిస్తున్నారు.

Bailey bridge

రెండు రోజులు తీవ్రంగా శ్రమించిన అనంతరం బెయిలీ వంతెన నిర్మాణాన్ని సైన్యం పూర్తిచేసింది. వరద ప్రభావిత ప్రాంతానికి వాహనాలు, అంబులెన్స్‌లు ఈ బెయిలీ వంతెన మీదుగానే వెళ్తున్నాయి. చలియార్ నదికి 40 కిలోమీటర్ల పరిధిలో కూడా సైన్యం, విపత్తు నిర్వహణ బృందాలు అన్వేషణ చేపట్టనున్నాయి.


మరోవైపు, వయనాడ్ విపత్తులో గల్లంతైన వారి కోసం నదిలో వెదకడానికి డైవర్ల సహాయం కోరుతున్నారు అధికారులు. వయనాడ్ విపత్తులో ఇరవహింజి పుజా, చలియార్‌లలో గల్లంతయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

kerala landslide

ముక్కం, కోటంచెరి, తిరువంబాడి పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు రోజుల పాటు నదిలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం డైవింగ్ నిపుణుల సాయం కోరుతూ పోలీసులు రంగంలోకి దిగారు. అలా చేయాలనుకునే వారు ముక్కం, కోటంచెరి, తిరువంబాడి పోలీస్ స్టేషన్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. 94979 90122 నంబరును సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు పోలీసులు అందిస్తారని చెప్పారు.

కాగా, కేరళలో నేడు, రేపు (ఆగస్టు 02, 03 తేదీల్లో) కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ తీరం నుంచి దక్షిణ గుజరాత్ తీరం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌పై కూడా అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగస్టు 02, 03 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 

Latest Videos

click me!