Prime Minister Modi's Podcast: జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తో కలిసి తన తొలి పోడ్‌కాస్ట్ లో ప్రధాని నరేంద్ర మోడీ తన ఆందోళనలు సహా అనేక అంశాలపై మాట్లాడారు. తాను కలిగి ఉన్న స్థానాన్ని పరిగణనలోకి తీసుకొని తరచుగా తన భావోద్వేగాలను దూరంగా ఉంచాల్సి వచ్చిందని పేర్కొంటూ పలు ఉదాహరణలను చెప్పారు. తన చిన్ననాటి జీవితం నుంచి ఇప్పటివరకు సాగిన ప్రయాణం వరకు జరిగిన అనేక విషయాలను కూడా ప్రధాని ప్రస్తావించారు.
ఈ క్రమంలోనే నిఖిల్ కామత్ ఈ సమస్యను ఎలా డీల్ చేశారని ప్రధానిని ప్రశ్నించగా, చాలా మంది పిల్లలు కూడా తమకు ఆందోళన కలుగుతోందని చెబుతున్నారని అన్నారు. 'నాకు కూడా ఆందోళనగా ఉంది. నేను మీతో మాట్లాడుతున్నాను.. అయితే, నేను కూడా ఆందోళనగా-ఆత్రుతగా ఉన్నాను. నేను ఏదైనా చెబితే మీకేం అనిపిస్తుందో నాకు తెలియదు. ఇది చాలా కఠినమైన సంభాషణ. చాలా మంది పిల్లలు ఆందోళన గురించి మాట్లాడుతున్నారు" అని కామత్ ప్రధాని మోడీతో అన్నారు.
"మీరు కూడా మీ జీవితంలో ఆందోళనను అనుభవించి ఉంటారు. అయితే, చిన్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేశారు?" అని ప్రధానిని ప్రశ్నించగా.. "చిన్నతనంలో తనకు కూడా ఆందోళన వచ్చి ఉండొచ్చు.. అయితే, అంతటితోనే దేవుడు నా కోసం తలుపులు మూసేశాడని కాదు అని ప్రధాని సమాధానమిచ్చారు. మీ ముందు ఎన్ని అందోళనలు, సమస్యలు ఉన్నా దానిని అధిగమించే అన్ని విషయాలు ఉంటాయని ప్రధాని అన్నారు.
ప్రధాని మోడీ ఈ పోడ్ కాస్ట్ లో కొన్ని అద్భుతమైన కోట్స్ ను చెప్పారు. తన జీవితంలో జరిగిన విషయాలతో ప్రస్తావించారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి..
"నాతో సహా అందరూ తప్పులు చేస్తారు. అన్నింటికంటే ముందు నేను మానవుడిని.. దేవుడిని కాదు" : ప్రధాని నరేంద్ర మోడీ
"నేను టీ అమ్ముకునే రైల్వే ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు 30-40 మంది (పాడి రైతులు) ఎప్పుడూ ఉండేవారు... వారితో మాట్లాడుతూ క్రమంగా నేను హిందీ నేర్చుకున్నాను" : ప్రధాని నరేంద్ర మోడీ
"రాజకీయాలను పెద్ద కాన్వాస్ నుంచి చూడాలి. ప్రజాస్వామ్యంలో ఓటరు కూడా ఒక విధంగా రాజకీయ నాయకుడే. ఓటు వేసేటప్పుడు వారు తమ మనస్సు పెడతారు" : ప్రధాని నరేంద్ర మోడీ
"సమాజం సత్యాన్ని గుర్తించదనేది నిజం కాదు. మీరు ఓర్పు, అంకిత భావం కలిగి ఉండాలి. ఓట్ల కోసమ ఏదైనా చేస్తాను అనే తత్వం ఉండకూడదు. అటువంటి వైఖరితో మీరు విజయం సాధించలేరు" : ప్రధాని నరేంద్ర మోడీ
నేను సీఎం అయ్యాక నా పాత మిత్రులను సీఎం హౌస్ కు ఆహ్వానించాలనుకున్నాను. నేను వారందరినీ ఆహ్వానించాను. అయితే, నేను దానిని ఎంజాయ్ చేయలేకపోయాను. ఎందుకంటే అక్కడ నేను నా స్నేహితులను వెతుక్కొవాల్సి వచ్చింది. వారందరూ నన్ను మిత్రునిలా కాకుండా ముఖ్యమంత్రిగానే చూశారు" : ప్రధాని నరేంద్ర మోడీ
"నేను సీఎం అయ్యాక ఒక మాట ఇచ్చాను.. హార్డ్ వర్క్ చేయడానికి నేను ఎప్పుడూ సిగ్గు పడను. నా కోసం నేను ఏమీ చేయను. నేను మనిషినే కానీ దురుద్దేశంలో నేను ఎప్పుడూ తప్పులు చేయను. ఇదే నా జీవిత మంత్రం" : ప్రధాని నరేంద్ర మోడీ
లక్ష్యంతో రాజకీయాల్లోకి రండి : ప్రధాని నరేంద్ర మోడీ
తన మొట్టమొదటి పోడ్‌కాస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లో యువత భాగస్వామ్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. వారు రాజకీయాలలోకి రావాలనీ, అక్కడ త్యాగం, అంకిత భావంతో ఉండాలని అన్నారు. యువకులను "ఒంటరి ఆశయం కంటే త్యాగం, అంకితభావంతో" రాజకీయాలను చేరుకోవాలని కోరారు. "ప్రజల హృదయాలను గెలుచుకోవడం, వారితో వారి జీవితాలను గడపడం మంచి నాయకుడిని చేస్తుంది" అని అన్నారు. మంచి వ్యక్తులు వ్యక్తిగత ఆశయాల కోసం కాకుండా ఒక లక్ష్యంతో రాజకీయాల్లో చేరడం చాలా కీలకమని ప్రధాని అన్నారు.
వ్యక్తిగత ఆశయం కంటే దేశ శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే లక్ష మంది యువ నాయకులు భారతదేశానికి అవసరమని పునరుద్ఘాటిస్తూ ఎర్రకోట నుండి తాను చేసిన ప్రకటనను కూడా ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. 'రాజకీయాల్లోకి రావాలంటే దేశానికి లక్ష మంది యువత అవసరమని ఎర్రకోట నుంచి నేను చెప్పాను. తాను అనే ఆశయం ఎక్కువ కాలం ఉండదు. రాజకీయాల్లో లక్ష్యం, త్యాగం ఉండాలని ప్రధాని అన్నారు. ఐక్యత, నిస్వార్థత ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పారు.
ఇది నా జీవితంలో అతిపెద్ద పరీక్ష : ప్రధాని మోడీ
2002లో గుజరాత్ లో ఎన్నికలు జరిగాయి. ఇది నా జీవితంలో అతిపెద్ద పరీక్ష. మధ్యాహ్నం 12 గంటల వరకు వివరాలు ఇవ్వొద్దని చెప్పాను. అప్పుడు మా ఆపరేటర్ ఒక నోట్ పంపాడు, దానిలో నేను మూడింట రెండు వంతుల ఆధిక్యంలో ఉన్నాను. నా శరీరం లోపల ఏమీ జరగడం లేదని నేను నమ్మను, కానీ, దానిని అధిగమించాలనే ఆలోచన నాకు ఉంది" అని ప్రధాని మోడీ అన్నారు.
పరిస్థితిని ఎదుర్కోవడానికి మరొక ఉదాహరణను ఇస్తూ, ఐదు బాంబు పేలుళ్లు జరిగినప్పుడు నేను ఎలా ఉండేవాడినో ఊహించుకోండి అని మోడీ అన్నారు. పోలీస్ కంట్రోల్ రూంకు వెళ్లాలని చెప్పాననీ, అయితే తన సెక్యూరిటీ అనుమతించలేదని, కానీ తాను పట్టుబట్టానని చెప్పారు. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. అప్పుడు నేను తిరిగి వచ్చి వాహనంలో కూర్చొని నేను ఆసుపత్రికి వెళ్తానని (క్షతగాత్రులను పరామర్శించడానికి) చెప్పాను. నాలో అశాంతి లేదా ఆందోళన ఉందని మీరు చెప్పగలరు, కానీ నేను దానిని భిన్నంగా అనుభవిస్తున్నానని" ప్రధాని చెప్పారు.
జీవితం-మరణం.. ఎప్పుడూ ఆలోచన లేదు
తాను ఎప్పుడూ జీవన్మరణాల గురించి ఆలోచించలేదని, హిసాబ్ కితాబ్ పెట్టుకునే జీవితం గడిపే వారికి ఇది ఒక ఉదాహరణ కావచ్చునని ప్రధాని పేర్కొన్నారు. తాను సీఎం అయినప్పుడు ఆశ్చర్యపోయానని మోడీ అన్నారు. 'నా నేపథ్యం నేను అనుకోనిది. నేను ప్రైమరీ స్కూల్ టీచర్ అయి ఉంటే మా అమ్మ స్వీట్లు పంచేది. అయితే నాకు అలాంటివి దొరకవు' అని ప్రధాని చెప్పారు.