Prayagraj Mahakumbh Mela 2025
Prayagraj Mahakumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం ప్రయాగరాజ్ మహా కుంభమేళా. దీనికోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్రత్యేక కుంభమేళాలో భారతదేశంలోని సగం జనాభా అంటే 40 కోట్ల మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది... సాధుసంతులు ఇప్పటికే సంగమ ప్రాంతానికి చేరుకున్నారు.
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు (45 రోజులపాటు) ప్రయాగరాజ్ జనసంద్రం కానుంది... కోట్లాదిగా తరలివవచ్చే భక్తులు, సన్యాసులు, సాధువులతో కుంభనగరి కాషాయమయం కానుంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమతీరంలో ఏర్పాటుచేసిన టెంట్ సిటీ సందడిగా మారనుంది. ఇక ముఖ్య పర్వదినాల్లో, పవిత్రస్నానాలు చేసే రోజున భక్తుల తాకిడి మరింత ఎక్కువగా వుండనుంది.
ఇలా కోట్లాది హిందూ ప్రజలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ కుంభమేళాలో ఇతర మతస్తులకు ప్రవేశం వుటుందా? అనే ప్రశ్న చాలామందిలో మెదులుతోంది. మరీముఖ్యంగా ముస్లింలు ఈ చారిత్రాత్మక కుంభమేళాలో పాల్గొనవచ్చా? అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా సమాధానం ఇచ్చారు.
Prayagraj Mahakumbh Mela 2025
కుంభమేళాలో ముస్లింల ప్రవేశంపై యోగి క్లారిటీ
మరో మూడురోజుల్లో ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా ప్రారంభంకానుంది. ఈ మహా ఉత్సవం కోసం యోగి సర్కార్ గత నాలుగైదు నెలల నుండే ప్రయాగరాజ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దేశ విదేశాల నుండి కుంభమేళాకు భక్తులు, పర్యాటకులు తరలివస్తారు... అందుకు తగినట్లుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. ప్రయాగరాజ్ కుంభమేళా ఏర్పాట్ల పర్యవేక్షణకు యోగి సర్కార్ ప్రత్యేక అధికారులను నియమించింది.
కుంభమేళా కోసం చేపట్టిన ఏర్పాట్లన్ని దాదాపు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతంలో పర్యటిస్తున్నారు. జనవరి 9, 10 తేదీల్లో అంటే నిన్న, ఇవాళ ఆయన ప్రయాగరాజ్ లోనే వుండి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు... అలాగే ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న సాధుసంతులను అడిగి ఏర్పాట్లు ఎలా వున్నాయో తెలుసుకుంటున్నారు.
అయితే తాజాగా ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ముస్లింలకు ప్రవేశం లేదని, వారిపై నిషేధం విధించబడిందని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రచారం అవుతున్నారు. చివరకు ఈ విషయం సీఎం యోగి దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయన తాజాగా ప్రయాగరాజ్ వేదికగానే దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముస్లింలకు ప్రయాగరాజ్ లో ప్రవేశం వుంటుందో లేదో తెలిపారు.
"భారతీయ సంప్రదాయాలపై గౌరవం వున్న ఎవరైనా ప్రయాగరాజ్ మహాకుంభ్‌కు రావచ్చు. కానీ ఎవరైనా దురుద్దేశంతో ఇక్కడికి వస్తే అంత మంచి అనుభవం ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి వారు రాకపోవడమే మంచిది. శ్రద్ధతో వచ్చే ప్రతి ఒక్కరికీ ప్రయాగరాజ్‌లో స్వాగతం" అంటూ సీఎం యోగి క్లారిటీ ఇచ్చారు.
ఇంకా "మహాకుంభ్‌కు ఎవరైనా రావచ్చు. మహాకుంభ్ అనేది కులమతాలకు అతీతమైన ప్రదేశం. ఇక్కడ ఎలాంటి వివక్షతకు తావులేదు. మహాకుంభ్ 'వసుధైవ కుటుంబకం' అనే భావనకు ప్రతీక. ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తారు. ఇక్కడ ఎవరిపైనా వివక్ష చూపబడదు" అని సీఎం యోగి స్పష్టం చేసారు.
Prayagraj Mahakumbh Mela 2025
ముస్లింలు కుంభమేళాలో వ్యాపారాలు చేసుకోవచ్చా?
ముస్లింలు చాలామంది హిందూ ఉత్సవాలు, జాతరల్లో చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటుచేసి వ్యాపారాలు చేసుకుంటారు. ఇలా కుంభమేళాలో కూడా వీరు వ్యాపారం చేసుకోవచ్చా? లేదంటే ఇతర మతస్తులను అనుమతి వుండదా? అనే అనుమానాలు చాలామందికి వుంటాయి. వీటికి కూడా సీఎం యోగి ఆదిత్యనాథ్ క్లారిటీ ఇచ్చారు.
ప్రయాగరాజ్ కుంభమేళాకు వచ్చేవారు ఎవరైనా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించవారు అయివుండాలని సీఎం యోగి స్పష్టం చేసారు. ఇలాంటివారిని కుంభమేళాకు సాదరంగా ఆహ్వానిస్తున్నామని... కానీ అలజడులు సృష్టించాలనే కుట్రలతో వచ్చేవారికి స్థానం లేదన్నారు. మంచి మనసుతో వచ్చేవారు ఇతర మతస్తులయినా వ్యాపారం చేసుకోవచ్చని యూపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
కుంభమేళా అనేది భారత ప్రజల సాంస్కృతిక వారసత్వం... కాబట్టి దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిది. దేశాన్ని ప్రేమించేవారు, పరమతాన్ని గౌరవించేవారు ఈ కుంభమేళాలో పాల్గొనవచ్చు. అంటే భారతీయులు ఎవరైనా కుంభమేళాలో పాల్గొనవచ్చు... కానీ అలజడులు సృష్టించే ఉద్దేశంతో వస్తే తగిన చర్యలుంటాయి.