
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయంలో సుదీర్ఘ కాలంగా మూతపడి ఉన్న రత్న భాండాగారాన్ని ఆదివారం తెరాచారు. ముందుగా నిర్ణయించినట్లు సరిగ్గా ఆదివారం భాండాగారాన్ని తెరిచారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రాష్ట్ర పరభుత్వం నియమించిన కమిటీలోని 11 మంది సభ్యులు మాత్రమే ఈ భాండాగారం లోపలికి వెళ్లారు. కమిటీ ఛైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్‌తో పాటు కమిటీ సభ్యులు, అధికారులు, ఆర్కియాలజిస్టు, అర్చకులు, సేవకులు నిధి ఉన్న గదిలోకి వెళ్లారు. 1978 తర్వాత జగన్నాథుని ఆలయ భాండాగారాన్ని తెరవలేదు. దీంతో విష సర్పాలుంటాయన్న అనుమానంతో స్నేక్ క్యాచర్లు, 40 మంది ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందం సభ్యులు ఆలయం వెలుపల సిద్ధం చేశారు.
దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని తెరవడంతో దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భారీగా విలువైన ఆభరణాలు, వజ్రాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో కొంతకాలంగా వివాదం నెలకొంది. కాగా, ప్రభుత్వ అనుమతి రావడంతో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి నిధి ఉన్న గదిని తెరిచారు. కోర్టు అనుమతితో ఈ గదిని గతంలో ఓసారి తెరిచేందుకు ప్రయత్నించగా.. చివరి నిమిషంలో అది జరగలేదు. భాండాగారం తాళం లేదన్న కారణంతో వీలుకాలేదు.
ఇప్పుడే ఎందుకు?
దేవాలయ నిర్వహణలో భాగంగా.. 1955లో శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ప్రతి మూడేళ్లకోసారి రత్న భాండాగారాన్ని తెరవాలి. లోపల ఉన్న సంపదను లెక్కించాలి. అయితే, 1978 తర్వాత రత్న భాండాగారాన్ని తెరవలేదు. గతంలో మూడేళ్లకోసారి రత్న నిధిని తెరిచి అందులో ఉండే సంపదను లెక్కించేవారు. చివరగా 1978లో లెక్కింపు చేపట్టగా 70 రోజులు సమయం పట్టింది. అయితే, ఆ సమయంలో కొన్నింటిని లెక్కేయకుండా వదిలేశారన్న అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన న్యాయస్థానాలు భాండాగారాన్ని తెరవాలని ఆదేశించాయి. సంపద లెక్కించాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. భాండాగారం గదులు పూర్వం నిర్మించినవి కావడంతో జీర్ణావస్థకు చేరాయి. వర్షపు నీటి కారణంగా గోడలు బీటలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి.
దీంతో 2019లో జగన్నాథుని ఆలయ రహస్య నిధి ఉన్న గదులను తెరవాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ ఏడాది ఏప్రిల్ 6న అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నియమించిన కమిటీ తలుపులు తెరిచేందుకు వెళ్లగా... రహస్య గది తాళం చెవి కనిపించలేదని వెనుదిరిగారు. ఆ తర్వాత పలు కారణాలతో ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. రాజకీయ పార్టీలు ప్రచార అస్త్రంగానే ఈ అంశాన్ని వాడుకున్నాయి. బీజేపీ కూడా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకుంది. ఒడిశాలో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరుస్తామని హామీ ఇచ్చింది. వాగ్దానం చేసిట్లే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలలో 16 మందితో కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రత్న భాండాగారం తెరవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ఎంత నిధి ఉంది?
1978 లెక్కల ప్రకారం... రత్న భాండాగారంలో 12వేల 831 భారీల బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్లు గత ప్రభుత్వం వెల్లడించింది. ఒక భారీ అంటే 11.66 గ్రాములు. అయితే, ఈ నిధి మొత్తం విలువపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అలాగే, 1978 నుంచి 2018 మధ్య జగన్నాథునికి భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది. ఎట్టకేలకు నిధి తలుపులు తెరుచుకున్న నేపథ్యంలో ఈసారి లెక్కింపు పూర్తయితే జగన్నాథుని ఆభరణాల విలువపై స్పష్టత వస్తుంది.
ఇప్పటివరకు నిధి ఉన్న రహస్య గది జీర్ణావస్థకు చేరుకున్న నేపథ్యంలో సంపదను వేరే గదికి తరలించి పటిష్ట మధ్య లెక్కించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఒడిశా ప్రభుత్వం డిజిటలైజ్ చేస్తుంది. ప్రస్తుతం జగన్నాథుని రథ యాత్ర జరుగుతోంది. రథయాత్ర జరిగే సమయంలో జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవిలు ఆలయం బయట ఉంటారు. ఈ నెల 19వ తేదీ వరకు స్వామి, అమ్మవార్లు ఆలయం వెలుపల ఉండనుండగా.. లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుందన్న అంశంపై మాత్రం స్పష్టత రావడం లేదు.
చరిత్ర ఇదీ...
తూర్పు గంగా రాజ వంశానికి చెందిన శాసనాల ప్రకారం.. జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని కళింగ పరిపాలకుడైన రాజా అనంతవర్మ చోడగంగదేవ్ ప్రారంభించారు. ఈ ఆలయంలోని జగన్మోహన, విమన భాగాల నిర్మాణాన్ని క్రీస్తు శకం 1078 - 1148 మధ్య కాలంలో చేపట్టారు. అనంత వర్మ మనుమడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో 1174లో పూర్తిచేసి ప్రస్తుతం ఉన్న రూపునిచ్చారు. ఆలయంలో నాటి నుంచి ఉన్న రత్న భాండాగారాన్ని అత్యంత విలువైందిగా చెబుతారు. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశగా బేస్‌మెంట్‌లో ఉండే రహస్య గదిలో భక్తులు సమర్పించే ఆభరణాలు, విరాళాలను భద్రపరుస్తారు. కాగా, జగన్నాథునికి ఆభరణాల కోసం అనంగ భీమదేవ్ రెండున్నర లక్షల మధాల బంగారాన్ని (ఒక మధా అంటే 5.83 గ్రాములు) విరాళంగా ఇచ్చారు. ఆ ఆభారణాలతో పాటు భక్తులు సమర్పించిన బంగారం, కానుకలను కూడా తాజాగా తెరిచిన భాండాగారంలోనే భద్రపరిచేవారు.
ఆభరణాలను దాచేందుకు రెండు గదులు...
రత్న భాండాగారంలో రెండు గదులున్నాయి. వీటిలో ఒకటి బీతర్ భండార్, మరొకటి బాహరా భండార్. వీటినే లోపలి గది, బయటి గది అని కూడా పిలుస్తారు. దేవుడి విగ్రహాలకు అలంకరించే ఆభరణాల కోసం వెలుపలి గదిని తరచూ తెరుస్తారు. బీతర్ భండార్‌ను మాత్రం 46 సంవత్సరాలుగా తెరవలేదు.