మహారాజా భూపీందర్ సింగ్
చాలామంది భారతీయ రాజులు లగ్జరీ కార్లను, ముఖ్యంగా విదేశాల నుండి దిగుమతి చేసుకున్న హై-ఎండ్ మోడళ్లను ఇష్టపడేవారు. ఇలాంటివారిలో పటియాలాకు చెందిన మహారాజా భూపీందర్ సింగ్ ఒకరు. ఈయన తన రోల్స్ రాయిస్ కార్ల సేకరణతో ప్రసిద్ధి చెందారు. జర్మన్ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ కూడా ఈయనకు ఓ కారును బహుమతిగా ఇచ్చాడని కూడా చెబుతారు.
మహారాజా భూపీందర్ సింగ్
పటియాలా ప్రాంతాన్ని పాలించిన మహారాజా భూపీందర్ సింగ్ వద్ద రోల్స్ రాయిస్ కార్ల కలెక్షన్ ఉండేది. ఈ కార్లు చాలామంది రాజుల వద్ద వుండేవి. కానీ మరే ఇతర భారతీయ రాజు వద్ద లేని ఒక ప్రత్యేకమైన వాహనం కూడా ఆయన వద్ద ఉండేదట. అదే ఆయనకు హిట్లర్ బహుమతిగా ఇచ్చిన మేబాచ్ కారు.
మొఘల్ పాలన పతనం తరువాత 1763లో బాబా ఆలా సింగ్ పటియాలా సంస్థానాన్ని స్థాపించారు. 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి పటియాలా పాలకులు సహకారం అందించారు. దీంతో పటియాలా రాజులకు బ్రిటీష్ ప్రభుత్వం కూడా అనేక రకాలుగా సహాయసహకారాలు అందించింది. అలాగే ఈ ప్రాంతంలోని సారవంతమైన వ్యవసాయ భూమి కలిగివుండటం, పంటలు బాగా పండటంతో భారతదేశంలోని అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన రాజ్యంగా పటియాలా నిలిపింది.
మహారాజా భూపీందర్ సింగ్
పటియాలా పాలకులు ఆఫ్ఘనిస్తాన్, చైనాతో పాటు వివిధ దేశాల్లో జరిగిన యుద్ధాల్లో బ్రిటిష్ సైన్యానికి మద్దతు ఇచ్చారు. ఇలా బ్రిటన్ తో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకున్నారు. ఈ పటియాలా రాజవంశానికి చెందినవారే మహారాజా భూపీందర్ సింగ్.
1891 నుండి 1938 వరకు పటియాలా రాజ్యాన్ని భూపీందర్ సింగ్ పాలించారు. ఈ సమయంలో ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఆయన వద్ద 27 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు వుండేవట. అలాగే పారిస్‌లోని కార్టియర్ రూపొందించిన ప్రసిద్ధ 'పటియాలా హారం'తో సహా అపారమైన నగల సేకరణ ఆయన వద్ద ఉండేవని చరిత్ర చెబుతోంది.
మహారాజా భూపీందర్ సింగ్
హిట్లర్ మహారాజా భూపీందర్ సింగ్‌కు ఇచ్చిన మేబాచ్ కారు చాలా ప్రత్యేకతలు కలిగివుండేదట. శక్తివంతమైన 12-సిలిండర్ ఇంజిన్‌తో కూడిన ఆరు మేబాచ్ కార్లలో ఇది ఒకటి. ప్రారంభంలో హిట్లర్‌ను కలవడానికి అయిష్టత చూపిన భూపీందర్ సింగ్ తరువాత అతనిని అనేకసార్లు కలిసి మాట్లాడారు. ఈ సమయంలోనే ఆయన హిట్లర్ నుండి బహుమతిగా విలాసవంతమైన మేబాచ్‌ను, జర్మన్ ఆయుధాలతో పాటు అందుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన ఇతర కార్లతో పాటు మోతీ బాగ్ ప్యాలెస్ గ్యారేజీలో మేబాచ్ కారును కూడా పెట్టారట.
మహారాజా భూపీందర్ సింగ్
మహారాజా భూపీందర్ సింగ్ మరణం తరువాత, ఆయన కుమారుడు మహారాజా యాదవీందర్ సింగ్ సింహాసనాన్ని అధిష్టించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పటియాలాను తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్ లో విలీనం చేసారు.
మహారాజా భూపీందర్ సింగ్
కాలక్రమేణా పటియాలా రాజ కుటుంబం మేబాచ్ తో పాటు ఇతక కార్ల కలెక్షన్ ను, విలువైన వస్తువులను అమ్మేసింది. ఈ మేబాచ్ కారు అనేకమంది చేతులుమారి ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక ప్రైవేట్ వ్యక్తి వద్ద వుంది. అయితే మహారాజా భూపీందర్ సింగ్ కేవలం కార్ల కలెక్షన్ మాత్రమే కాదు ప్రైవేట్ విమానాన్ని కలిగి ఉన్న మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. ఆయన పటియాలాలో ఒక విమానాశ్రయాన్ని నిర్మించారు.