HMPV వైరస్ ప్రమాదకరమా? ఇప్పటివరకు ఇండియాలో కేసులెన్ని? తెలంగాణ, ఏపీ పరిస్థితి?

First Published | Jan 7, 2025, 1:29 PM IST

భారతదేశంలో HMPV (హ్యూమన్ మెటాప్నిమో వైరస్) చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశంలోకి వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే ఒక్కోటిగా కేసులు బైటపడుతున్నారు. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసులెన్ని? తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా వుందో తెలుసుకుందాం. 

HMPV Virus

HMPV : కరోనా కథ ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచంపైకి మరో వైరస్ దండయాత్ర ప్రారంభించింది. కరోనా మాదిరిగానే చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకుతోంది. HMPV  (హ్యూమన్ మెటాప్నిమో వైరస్) చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే భారతదేశంలోకి కూడా ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఒకటి తర్వాత ఒకటి కేసులు బైటపడుతూనే వున్నాయి... దీంతో ప్రజల్లో భయాందోళన పెరుగుతుంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే HMPV వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. అంతేకాదు ఈ వైరస్ అంత ప్రమాదకరం కాదని... ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు ధైర్యం చెబుతున్నాయి. చిన్నారులు, వృద్దుల ఆరోగ్యంపై ఈ వైరస్ కొంత ప్రభావం చూపించవచ్చు... కానీ సంపూర్ణ ఆరోగ్యంతో వున్నవారిపై దీని ప్రభావం పెద్దగా వుండదని చెబుతున్నారు. అయినప్పటికి ప్రజల్లో ఆందోళన తగ్గడం లేదు. 

మరోవైపు కరోనా సమయంలో మాదిరిగానే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ వంటివి పెడతారా? అన్న అనుమానం వ్యాపారవర్గాల్లో మొదలయ్యింది. ఇదే జరిగితే మళ్లీ తమ వ్యాపారాలు దెబ్బతింటాయని వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఉద్యోగులు, సామాన్య ప్రజలు కూడా ఈ HMPV వైరస్ మళ్లీ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనని భయపడుతున్నారు.    
 

HMPV Virus

భారత్ లో ఇప్పటివరకు బైటపడ్డ HMPV కేసులెన్ని? 

పొరుగుదేశం చైనాలో కొంతకాలంగా HMPV వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పుడు ఇది ఇండియాను కూడా చేరింది. నిన్న(జనవరి 6, 2025) సోమవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో మొదటి HMPV కేసు బైటపడింది. ఓ ఎనిమిది నెలల శిశువులో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. 

ఇలా మొదటి HMPV కేసు బైటపడి ఇంకా 24 గంటలు కూడా గడవలేదు...దేశవ్యాప్తంగా ఒక్కోటిగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక ,తమిళనాడు, గుజరాత్ లో ఈ వైరస్ కేసులు బైటపడగా తాజాగా మహారాష్ట్రకు కూడా HMPV వైరస్ వ్యాపించింది. నాగ్ పూర్ లో మరో ఇద్దరు చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. 

తాజా కేసులతో కలిపి దేశంలో HMPV వైరస్ బారిన పడ్డవారి సంఖ్య ఏడుకు చేరింది.  బెంగళూరులో 2, చెన్నై 2, అహ్మదాబాద్ లో 1 వైరస్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నాగ్ పూర్ లో 7, 13 ఏళ్ళ ఇద్దరు చిన్నారులకు HMPV పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇలా దేశంలో ఈ వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 


HMPV Virus

తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త : 

HMPV వైరస్ కేసులు దక్షణాదిలోనే ఎక్కువగా వెలుగుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే వున్న కర్ణాటక, మహారాష్ట్రలో ఇప్పటికే కేసులు బైటపడ్డాయి. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. 

HMPV వైరస్ అంత ప్రమాదకరమేమీ కాదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దేశంలో HMPV కేసుల నమోదు, వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తోందని... ఇది రాష్ట్రంలో వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు చేపడుతోందని మంత్రి రాజనర్సింహ తెలిపారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా HMPV వైరస్ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్ కేసులు నమోదు కాలేవని తెలిపారు. అయితే కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు బైటపడ్డ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు. 

HMPV వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. వైరస్ ను రాష్ట్రంలోకి ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రజలకు ఈ వైరస్ లక్షణాల గురించి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ వైరస్ బారినపడకుండా ముందుగానే జాగ్రత్తపడేలా చూడాలన్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా వుండాలని సీఎం చంద్రబాబు సూచించారు.

HMPV వైరస్ వ్యాప్తిని నివారించేందుకు, అవసరం వున్నపుడు సాయం కోసం వైద్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. మైక్రో బయాలజీ, ఫీడియాట్రిషన్స్, పల్మనాలజిస్ట్ లతో పాటు ఇతర వైద్య నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి దాని సలహాలు,సూచనలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి : 

HMPV వైరస్ ఎవరికి ఎక్కువ ప్రమాదం

ఇండియాలో తొలి HMPV కేసు .. 8 నెలల శిశువుకు పాజిటివ్ : ఇక కరోనా సీన్ రిపీట్ కావాల్సిందేనా?

HMPV : ఈ వైరస్ తో తెలుగు ప్రజలు జాగ్రత్త ... ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?

Latest Videos

click me!