ఇండియాలో తొలి HMPV కేసు .. 8 నెలల శిశువుకు పాజిటివ్ : ఇక కరోనా సీన్ రిపీట్ కావాల్సిందేనా?

First Published | Jan 6, 2025, 1:22 PM IST

భారతదేశంలోకి HMPV వైరస్ ఎంటర్ అయ్యింది. కరోనా మాదిరిగా ఈ వైరస్ వ్యాప్తి కూడా చైనా నుండే ప్రారంభమయ్యింది. దీంతో మళ్లీ కరోనా పరిస్థితులు వస్తాయా అన్న ఆందోళన మొదలయ్యింది. తెలుగు ప్రజలను మరింత ఆందోళన పెడుతున్న విషయం ఏంటంటే HMPV వైరస్ మొదట దక్షిణ భారతదేశంలో బయటపడటం. 

HMPV Virus

HMPV : అనుకున్నంతా జరిగింది... ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్న కొత్త వైరస్ భారత్ కు చేరింది. దేశంలో మెట్టమొదటి కేసు దక్షిణాదిలోనే వెలుగుచూడటం మనల్ని మరింత ఆందోళనకు గురిచేసే విషయం. తెలుగు రాష్ట్రాలకు పొరుగునే వున్న కర్ణాటకలో HMPV (హ్యూమప్నిమో వైరస్) బైటపడింది. ఆ రాష్ట్ర రాజధాని, ఐటీ సిటి బెంగళూరులో ఓ 8 నెలల పసికందు ఈ వైరస్ బారిన పడింది. ఆ చిన్నారి ప్రస్తుతం నగరంలోకి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. 

ఇటీవల తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. అయితే శిశువుకు వైద్యం అందించినా జ్వరం తగ్గకపోవడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు టెస్టులు చేసారు. ఇందులో HMPV  పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. ఇలా ఇండియాలో మొదటి కేసు వెలుగుచూసింది. 

అయితే కర్ణాటక ప్రభుత్వం నుండి మాత్రం ఇప్పటివరకు HMPV కేసుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మొదటి కేసు బైటపడ్డ హాస్పిటల్ నుండి ప్రభుత్వం వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాస్పిటల్ సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత హెచ్ఎంపివి వైరస్ పై నిర్దారణకు వచ్చాకే ప్రభుత్వం నుండి ప్రకటన విడుదల కానుంది. 

HMPV Virus

తెలుగు ప్రజలు తస్మాత్ జాగ్రత్త : 

భారతదేశంలో HMPV కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఇక ప్రజలు మరోసారి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా మాదిరిగానే ఈ వైరస్ కూడా గాలిద్వారా ఒకరినుండి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి గతంలో కరోనా సమయంలో మాదిరిగా ప్రతిఒక్కరు మాస్కులు ధరించి ఇంటినుండి బయటకు రావడం మంచిది. అలాగే శానిటైజర్లతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 

దక్షిణాదిన తొలి HMPV కేసు వెలుగుచూసింది... బెంగళూరు నుండి మన తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు ఎక్కువగా వుంటాయి. కాబట్టి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రజలు మరింత జాగ్రత్తగా వుండాలి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని ప్రజలు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు పాటించడం ప్రారంభించాలి. మాస్కులు, శానిటైజర్లు ఇక బయటకు తీయాలి. 

ఇప్పటికే ఈ హ్యూమప్నిమో వైరస్ చైనా నుండి విదేశాలకు వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అప్రమత్తంగా వుండాలని అన్ని రాష్ట్రాలను సూచించింది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజారోగ్య, కుటుంబసంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మావతి రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలు చేసారు. ముఖ్యంగా ప్రజలు రద్దీ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించాలని... అందరూ మళ్లీ మాస్కులు ధరించాలని సూచించారు.  

ఇప్పటికయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి కేసులు నమోదు కాలేవని ఆమె తెలిపారు. ఈ వైరస్ గురించి ఆందోళన చెందొద్దని... అదే సమయంలో అజాగ్రత్త కూడా వద్దని అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని ... ఇప్పటివరకు అయితే ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పద్మావతి సూచించారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా కర్ణాటకలో HMPV కేసు బైటపడటంతో అప్రమత్తమైంది. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు... క్షేత్రస్థాయి అధికారులంతా అప్రమత్తం కావాలని ఆదేశించారు. ముఖ్యంగా బెంగళూరు నుండి హైదరాబాద్ కు వచ్చేవారిలో HMPV లక్షణాలుండేవారికి ప్రత్యేకంగా టెస్టులు నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోకి ఈ వైరస్ ను ఎంట్రీ కానివ్వకుండా వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. 
 


HMPV Virus

ఇప్పటికే మలేషియా, జపాన్ కు కూడా HMPV వ్యాప్తి : 

గతంలో కరోనా మాదిరిగానే ఈ HMPV వైరస్ కూడా మెళ్లిగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఇలా భారత్ తో పాటు మలేషియా, జపాన్ లలో ఈ కేసులు బైటపడుతున్నాయి. ఇప్పటికే చైనాలో లక్షలాదిమంది ఈ వైరస్ బారినపడగా మలేషియాలో 300 కు పైగా కేసులు నమోదయ్యాయి. జపాన్ లో కూడా ఈ HMPV కేసులు భారీగా నమోదవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థల నుండి అందుతున్న సమాచారం. 

ఇలా చైనా నుండి మరో వైరస్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) పరిస్థితిని గమనిస్తోంది. ఇప్పటికే ఈ HMPV వైరస్ లక్షణాల గురించి అందరికీ అవగాహన కల్పించాలని... ఎవరిలో అయినా అవి కనిపిస్తే వెంటనే హాస్పిటల్ కు తరలించాలని చాలా దేశాలు వైద్యారోగ్య అధికారులను ఆదేశిస్తున్నాయి. అమెరికా వంటి దేశాలు కూడా ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాయి. 

సాధారణంగానే శీతాకాలంలో చిన్నారులు, వృద్దులు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, చర్మ సమస్యలతో బాధపడుతుంటారు... ఈ HMPV బారిన పడ్డవారిలో కూడా ఈ లక్షణాలే కనిపిస్తాయి. రోగ నిరోదక శక్తి తక్కువగా వుండే పిల్లలు, వృద్దుల్లోనే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుంది. కాబట్టి వారిపట్ల జాగ్రత్తగా వుండాలని... జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలను సాధారణంగా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా వుండాలి. వివిధ దేశాల్లో ఈ HMPV వైరస్ కేసులు నమోదవుతున్నాయి... కాబట్టి ఆయా దేశాలను వెళ్ళేముందు అక్కడి పరిస్థితిని తెలుసుకోవాలి. చైనా,మలేషియా వంటి దేశాలకు వెళ్లకపోవడమే మంచిది... ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఈ వైరస్ కేసులు ఎక్కువగా వున్నాయి. 
 

HMPV Virus

HMPV లక్షణాలు : 
 
హెచ్ఎంపివి వైరస్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో చలి ఎక్కువగా వుంటుంది కాబట్టి జలుబు సర్వసాధారణం. అయితే ఇదే లక్షణాలను ఈ HMPV వైరస్ సోకినవారిలో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ వైరస్ నిర్దారణ కాస్త కష్టతరమైంది. ఇక దగ్గు, తుమ్ములు, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోయి శ్వాస  ఇబ్బందిగా మారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఇది ప్రధానంగా శ్వాసకు సంబంధించిన సమస్యలు సృష్టిస్తుంది... ఈ వైరస్ వల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా వుంటుంది. ఇక జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

ఈ HMPV వైరస్ కొందరిలో చాలా సీరియస్ శ్వాస సమస్యలకు దారితీస్తుంది. ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసి ప్రాణాంతకంగా మారుతుంది. ఇది కొన్నిసార్లు న్యుమోనియా, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. ఇది గాలిద్వారా ఈజీగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇది ఒక్కసారిగా విజృంభిస్తుంది... లక్షణాలు బయటపడేలోపే మరింతమందికి వ్యాప్తి చెందుతుంది. 

చిన్నారులు, వృద్దులుకు ఈ వైరస్ ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి వీరిలో జలుబు,దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసాయం పొందడం మంచిది. అలాగే ఈ లక్షణాలు కనిపిస్తే ఇతరులు కూడా వైద్యం పొందడం ఉత్తమం.  

ఇవి  కూడా చదవండి :

HMPV : ఈ వైరస్ తో తెలుగు ప్రజలు జాగ్రత్త ... ఇది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా?

చైనాలో మరో కొత్త వైరస్ విజృంభణ ... ఏమిటీ HMPV, లక్షణాలేంటి?
  
 

Latest Videos

click me!