Published : Nov 10, 2025, 08:28 PM ISTUpdated : Nov 10, 2025, 09:32 PM IST
Delhi Red Fort car blast: ఢిల్లీలో ఎర్రకోట మెట్రో గేట్ నం.1 వద్ద కారులో పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో పది మందికిపైగా మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దర్యాప్తు కోసం NIA బృందం రంగంలోకి దిగింది.
దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట సమీపంలోని లాల్‌కిల్లా మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సోమవారం సాయంత్రం భారీ కారు పేలుడు జరిగింది. ఈ ఘటనలో పది మందికిపైగా మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. పేలుడు సమయంలో ఆ ప్రాంతంలో భారీ జనసంచారం ఉండటంతో పానిక్ పరిస్థితులు నెలకొన్నాయి.
తగలబడిన కార్లు
ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం, సాయంత్రం సుమారు 6:55 గంటల సమయంలో పేలుడు జరిగినట్లు కాల్ వచ్చింది. వెంటనే ఏడు ఫైర్ టెండర్లు, 15 CAT అంబులెన్స్ వాహనాలు ఘటనాస్థలికి చేరాయి. ఆ కారు పూర్తిగా దగ్ధమవగా, దాని సమీపంలోని మూడు నుండి నాలుగు వాహనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి.
పేలుడు తీవ్రత కారణంగా సమీప వాహనాల అద్దాలు పగిలిపోయాయి, లైట్లు ఆగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
25
గాయపడినవారిని LNJP ఆసుపత్రికి తరలింపు
పేలుడులో గాయపడిన పలువురిని లోక్‌నాయక్ జయప్రకాశ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు. మీడియా నివేదికల ప్రకారం, ఆసుపత్రికి చేరేలోపే 9 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. ప్రస్తుతం పలువురు బాధితులు చికిత్స పొందుతున్నారు.
పేలుడు తీవ్రత కారణంగా మృతదేహాల గుర్తింపు కూడా కష్టంగా మారినట్లు వైద్యులు తెలిపారు.
35
దర్యాప్తు ప్రారంభం.. ఘటనాస్థలిలో NIA బృందం
ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ పోలీస్ ప్రత్యేక శాఖ, ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు. ఎన్ఐఏ (National Investigation Agency) బృందం కూడా దర్యాప్తు చేపట్టేందుకు ఘటనాస్థలికి చేరింది. పేలుడు కారణం ఇంకా నిర్ధారించలేదు.
ఢిల్లీ పోలీస్ అధికారి మాట్లాడుతూ, “ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. పేలుడు కారణం, వాహనాల దగ్దం, బాంబు పదార్థాల స్వభావం గురించి విశ్లేషణ జరుగుతోంది” అని తెలిపారు.
ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ నగరమంతా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసు పహారా, మెట్రో, రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దిల్లీతో పాటు ముంబై, హైదరాబాద్ ఇలా దేశమంతా హై అలెర్ట్ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలను ముమ్మరం చేశారు.
గత రెండు రోజుల క్రితం ఫరీదాబాద్‌లో 360 కిలోల పేలుడు పదార్థాలతో ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పేలుడుతో దేశ భద్రతా వ్యవస్థపై మరింత ఆందోళన కలిగిస్తోంది. ముంబై, గురుగ్రామ్, నోయిడా నగరాల్లో కూడా పోలీసు పహారా కఠినతరం చేశారు.
55
ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే?
ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఒక స్థానికుడు మాట్లాడుతూ, “మేము రోడ్డుపై నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా భయంకరమైన శబ్దం వినిపించింది. ఒకరి చెయ్యి రోడ్డుపై పడింది. ఆ దృశ్యంతో చాలా భయమేసింది” అని తెలిపారు.
ఘటన స్థలంలో ధ్వంసమైన వాహన అవశేషాలు, పగిలిన గాజు ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయని అధికారులు చెప్పారు.