వాయనాడ్‌లోని ముండక్కైలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందిని సైన్యం సాహసోపేతంగా సహాయక చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇంకా 200 మంది జాడ తెలియాల్సి ఉండగా.. సహాయక చర్యలను సులభతరం చేసేందుకు సైన్యం తాత్కాలికంగా ఉపకరించే బెయిలీ వంతెన నిర్మాణం చేపట్టింది.
ఈ బెయిలీ వంతెనను నిర్మించేందుకు సైన్యం దాదాపు రెండు రోజులకు పైగా శ్రమించాల్సి వచ్చింది. హెలికాప్టర్, ట్రక్కుల్లో టన్నుల కొద్దీ బరువైన విడిభాగాలను బురదమయంగా మారిన వరద ప్రభావిత ప్రాంతానికి తరలించారు సైనికులు, ఇతర సిబ్బంది. ఆ తర్వాత జోరువాన, అనుకూలించని వాతావరణం మధ్యనే వంతెన నిర్మాణం చేపట్టారు. రాత్రింబవళ్లు శ్రమించిన అనంతరం గురువారం బెయిలీ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.
Seetha Ashok Shelke
కాగా, సైన్యం నిర్మించిన బెయిలీ వంతెనపై మహిళా ఆర్మీ ఇంజనీర్ మేజర్ సీతా షెల్కే విజయ గర్వంతో నిలబడి ఉన్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈమె గురించి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. సహాయక చర్యల్లో కీలకమైన వంతెన నిర్మాణానికి మేజర్ షెల్కే నాయకత్వం వహించారు. ఎంతో శ్రమతో నిర్మించిన ఈ వంతెన పైనుంచి ట్రక్కులు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తూ వరద బాధితులకు సాయం అందించాయి.
Bailey bridge
సహాయక చర్యల్లో కీలకమైన ఈ బెయిలీ వంతెన నిర్మాణం వెనుక ఉన్న మహిళా శక్తి.. మేజర్ సీతా షెల్కే. కఠినమైన పరిస్థితులను కూడా ఆమె ఎదుర్కొని సహాయక చర్యలు చేపట్టారు. మహిళా ఆర్మీ ఇంజినీర్ అయిన మేజర్ సీతా షెల్కే.. ముండక్కై వద్ద కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సైన్యం నిర్మించిన బెయిలీ వంతెనపై విజయగర్వంతో నిలబడ్డారు. ఇంతకీ ఈ సీత ఎవరంటే..?
Seetha Ashok Shelke
మేజర్ సీతా పూర్తి పేరు.. సీతా అశోక్ షెల్కే. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా పార్నర్ తాలూకాలోని గాడిల్‌గావ్ అనే చిన్న గ్రామం నుంచి సైన్యంలో చేరారు. కేవలం 600 మంది జనాభా కలిగిన గాడిల్‌గావ్ ఒక చిన్న గ్రామం. న్యాయవాది అయిన అశోక్ బిఖాజీ షెల్కే నలుగురు పిల్లల్లో సీత ఒకరు. అహ్మద్‌నగర్‌లోని ప్రవర రూరల్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన సీత.. ఆ తర్వాత సైన్యంలో చేరారు.
ఐపీఎస్ కావాలనేది సీతా షెల్కే లక్ష్యం. అయితే, సరైన మార్గదర్శకత్వం లేకపోవడంతో లక్ష్యం చేరుకోలేకపోయారు. ఆ తర్వాత భారత సైన్యంలో చేరడంపై దృష్టి సారించారు. రెండుసార్లు సశస్త్ర సీమాబల్ (SSB) పరీక్షలో విఫలమయ్యారు. అయినా, నిరుత్సాహపడకుండా పట్టుదలతో మూడో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించారు. చివరికి 2012లో సైన్యంలో చేరారు.
Seetha Ashok Shelke
సీతా షెల్కే చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత అద్భుతమైన విజయాలు సాధించారు. కుగ్రామం నుంచి వచ్చిన ఆమె.. ఆర్మీలో చేరాలనే కలను సాకారం చేసుకోవడంలో తల్లితండ్రులు అచంచలమైన మద్దతునిచ్చారని చెబుతారు.
ముఖ్యంగా, బెయిలీ వంతెనను నిర్మించడంలో ఆర్మీకి చెందిన మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ నుంచి 250 మంది సైనికులు పనిచేశారు. ఈ బృందానికి మేజర్ షెల్కే నాయకత్వం వహించారు. దాదాపు మూడు రోజులు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో అసాధారణమైన నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించారు. పగలు, రాత్రి నిరంతరాయంగా శ్రమించిన తర్వాత... సైన్యం 190 అడుగుల పొడవైన ఉక్కు వంతెనను విజయవంతంగా నిర్మించింది. భారీ వర్షాలు, వరదలను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. రెస్క్యూ ఆపరేషన్‌కు అవసరమైన వాహనాలు కొత్తగా నిర్మించిన ఈ బెయిలీ వంతెనను దాటడం ప్రారంభించడంతో స్థానికుల్లో కాస్త ధైర్యం వచ్చింది. ఇది సహాయ చర్యలు, తదుపరి శోధన కార్యకలాపాల్లో కీలకమైన అడుగులు వేయడానికి తోడ్పడింది.