అదృష్టమంటే నీది సామీ... దినసరి కూలీకి దొరికిన కోటి రూపాయల వజ్రం

First Published | Jul 26, 2024, 1:25 PM IST

కాలం కలిసొస్తే ఓవర్ నైట్ మన జీవితమే మారిపోతుంది. ఇలాగే ఓ దినసరి కూలీకి అదృష్టం వరించి కోటీశ్వరుడు అయ్యాడు. అతడు జీవితం ఎలా మారిపోయిందంటే... 

Diamond

Diamond : అతడి రెక్కాడితే గాని కుటుంబం డొక్కాడదు... నిరుపేద జీవితం అతడిది. చిన్నప్పటి నుండి ఇలాగే కటిక పేదరికంలో పెరిగాడు. అతడికి కూలీ పని దొరికితేనే కుటుంబం కడుపు నిండుతుంది... లేదంటే అతడితో సహా అందరూ పస్తులే. ఇలాంటి  ఎన్నో కఠినమైన రోజులను అతడు గడిపాడు. ఈ కష్టాలను చూసి ఆ దేవుడికే జాలి కలిగిందో ఏమోగాని... ఒక్కసారిగా కడు పేదరికం నుండి కోటీశ్వరుడు అయ్యాడు. ఒక్క  వజ్రం అతడి జీవితాన్నే మార్చేసింది. ఇలా మధ్యప్రదేశ్ కు చెందిన కూలీ రాజు గౌడ్ ఓవర్ నైట్ లో కోటీశ్వరుడు అయ్యాడు. 

Diamond

పేదవాడి జీవితాన్ని మార్చిన వజ్రం : 

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా వజ్రాల గనులకు ఫేమస్. జిల్లా కేంద్రం పన్నా చుట్టుపక్కల చాలా వజ్రాల గనులున్నాయి.  కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఈ గనుల్లో డైమండ్ మైనింగ్ చేపడుతోంది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు గనులు, సహకార సంఘాలకు ఈ గనులను లీజుకు ఇస్తుంది ఎన్‌ఎమ్‌డీసీ. అయితే పర్యావరణానికి హాని చేయకుండా సాధారణ పనిముట్లు, పరికరాలతో తవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఇస్తుంది. 
 


Diamond

ఇలా లీజుకు తీసుకున్నవారు గనుల్లో ఏం దొరికినా అది వారి సొంతమే. తమకు దొరికిన వాటిని పరిశీలించి దాని విలువను కూడా ప్రభుత్వమే తెలియజేస్తుంది. దీంతో అనేక మంది సామాన్యులు ఈ గనులను లీజుకు తీసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. 

Diamond

పన్నా జిల్లాకు చెందిన చాలామందిలాగే కృష్ణ కళ్యాణ్ పూర్ పట్టి గ్రామానికి చెందిన రాజు గౌడ్  ఓ గనిని లీజుకు తీసుకున్నారు. రెండు నెలల క్రితం లీజుకు తీసుకుని ఏమైనా దొరుకుతాయేమోనని తవ్వకాలు చేపడుతూనే వుంది రాజు కుటుంబం. అయితే తాజాగా అతడిని అదృష్టం వరించింది. 
 

Diamond

తాను లీజుకు తీసుకున్న గనుల్లో తవ్వకాలు చేపట్టి మట్టిని జల్లెడ పడుతుండగా దగదగా మెరుస్తూ ఓ రాయి బైటపడింది. మొదట అది ఏదయినా రంగురాయి అయివుంటుందని రాజుగౌడ్ భావించాడు. కానీ చాలా స్పెషల్ గా కనిపించడం... అప్పటివరకు ఇలాంటిది ఎప్పుడూ చూడకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. 
 

Diamond

తనకు దొరికిన రాయిని తీసుకుని నేరుగా స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడతడు. అప్పుడు అతడికి తెలిసింది తనకు దొరికింది రాయి కాదు వజ్రమని. ఆ వజ్రాన్ని పరిశీలించిన అధికారులు అదెంత ధర పలుకుతుందో అంచనా వేసారు. అధికారుల మాట విని రాజుగౌడ్ అవాక్కయ్యాడు.  
 

Diamond

రాజుగౌడ్ కు దొరికిన వజ్రం గురించి మధ్య ప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. ఆ డైమండ్ విలువు దాదాపు కోటి రూపాయల వరకు వుంటుందని అంచనా వేస్తున్నారు. ఆ వజ్రాన్ని వేలం వేస్తామని... ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి అప్పగిస్తామని... ఆ డబ్బుల్లో ప్రభుత్వ పన్నులను తీసుకుని మిగతావి రాజు గౌడ్ కు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 

Diamond

ఇలా ఒక్క డైమండ్ నిరుపేద రాజుగౌడ్ కుటుంబంలో వెలుగులు నింపింది. తనకున్న అప్పులన్ని తీర్చేసి మంచి ఇళ్ళు కట్టుకుంటానని...పిల్లల చదువుల కోసం కొంత దాచుకుంటానని రాజుగౌడ్ చెబుతున్నారు. తన కుటుంబ పరిస్థితిని చూసి ఆ దేవుడు తమను కరుణించాడని... చాలా అదృష్టవంతుడినని అంటున్నారు. రాజుగౌడ్ కు వజ్రం దొరకడంతో పన్నా గనులను లీజుకు తీసుకున్నవారిలోనూ ఉత్సాహం పెరిగింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తవ్వకాలను ముమ్మరం  చేసారు.

Latest Videos

click me!