మోదీ బంపర్‌ ఆఫర్‌.. 50 ఏళ్లపాటు వడ్డీ లేకుండా రుణాలు

First Published | Jul 23, 2024, 7:38 PM IST

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా యువత, మహిళలు, రైతులకు పలు వరాలు ప్రకటించింది. వికసిత భారత్‌ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ఉపాధి కల్పన, వ్యవసాయంలో మెరుగైన ఉత్పాదన, మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ కేటాయింపులు చేసింది. అదే సమయంలో దేశంలో మౌలిక వసతుల కల్పనకు భారీగా కేటాయింపులు చేసింది. అలాగే, వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలనూ ప్రకటించింది. 

తొమ్మిది ప్రాధాన్యతలతో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అవసరమైన అనేక సంస్కరణలను ప్రస్తావించారు. 

అధిక వృద్ధి, ఉపాధి కల్పన

కేంద్ర బడ్జెట్‌- 2024లో అభివృద్ధి, ఉత్పాదకతకు పెద్దపీట వేశారు. భూమి, శ్రమ, మూలధనంతో సహా ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలను రాబోయే సంస్కరణలు కవర్ చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారు. అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల సహకారం అవసరమని పేర్కొన్నారు. 

ఉత్పాదకత పెంపు

దేశానికి వెన్నుముక లాంటింది వ్యవసాయ రంగం. ఈ రంగంలో ఉత్పాదకత పెంచడంతో పాటు స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్రం సానుకూల ప్రకటనలు చేసింది. కోటి మంది రైతులను ప్రకృతి సేద్యంలో ప్రోత్సహించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇందుకు తగ్గట్టు బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి రూ.1.52 లక్షల కోట్లు కేటాయించింది. ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు 109 కొత్త వంగడాలను రైతులకు అందించాలని నిర్ణయించింది మోదీ ప్రభుత్వం. 
 


ఉద్యోగ కల్పన, ఉపాధి శిక్షణ

ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈలపైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. యువతకు భారీగా ఉద్యోగాలు, ఉపాధి కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. రానున్న ఐదేళ్లలో 4కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది లక్ష్యం. 20 లక్షల మంది యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇవ్వడంతో పాటు 1000 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్స్‌ను అప్‌గ్రెడేషన్‌ చేయనున్నారు. అలాగే, నిరుద్యోగుల కోసం ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా 3 ఎంప్లాయ్‌మెంట్‌ లింక్డ్‌ ఇన్సెంటివ్స్‌ అమలు చేస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

ఏపీకి పెద్దపీట

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ను గట్టెక్కించే ప్రకటనలు వెలువడ్డాయి. ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతికి రూ.15వేల కోట్లు కేటాయించారు. అవసరమైతే మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టానికి కట్టుబడి ఉంటామని.. పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ- చెన్నై, హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. 

వెనకబడిన రాష్ట్రాలకు ఊతం

పూర్వోదయ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు బిహార్, జార్ఖండ్, పశ్చిమ్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను అభివృద్ధి చేయనుంది కేంద్ర ప్రభుత్వం. వరదల కారణంగా దెబ్బతిన్న బిహార్‌కు 11 వేల కోట్లు వరద నివారణ ఉపశమనం కింద అందించనుంది. ఆ రాష్ట్రంలో హైవేల అభివృద్ధికి రూ.20వేల కోట్లు మంజూరు చేయనుంది.

రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాలు

రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాన్ని అందజేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అయితే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు భారత్‌ చేపట్టే సంస్కరణలను రాష్ట్రాలు అమలు చేయాలని, సహకారం అందిచాలని పేర్కొన్నారు. అమృత్‌ భారత్‌ సాకరమయ్యేందుకు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సహాయం అందించనుది. వడ్డీ లేకుండా రుణాలందించి రాష్ట్రాల పరిస్థితిని మెరుగుపరచనుంది. ఈ పథకాన్ని గతంలోనే ప్రారంభించిన మోదీ ప్రభుత్వం.. భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రాలకు కేంద్రం అందించే సాయం హెల్త్‌, ఎడ్యుకేషన్‌, రోడ్లు, కరెంటు, ఇరిగేషన్‌, నీటి సరఫరా, రైల్వేలతో సహా వివిధ రంగాల్లో మూలధన పెట్టుబడి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తోడ్పడుతుంది. 

భూ సంస్కరణలు.. భూ ఆధార్‌

తాజా బడ్జెట్‌ ప్రసంగంలో భూ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. రానున్న మూడేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూ సంబంధిత సంస్కరణలు చేపట్టేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు. 
గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి రికార్డుల ప్రక్షాళన చేపట్టేందుకు భూ ఆధార్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. ఇందులో భాగంగా భూములకు సంబంధించిన లిమిట్స్‌తో మ్యాప్స్‌, అనుభవదారు/యజమాని వివరాలు, ఇతర వివరాలన్నీ డిజిటలైజ్‌ అవుతాయి. అలాగే, మనకు ఆధార్‌ యూనిక్‌ నంబర్‌లా.. భూ ఆధార్‌కి కూడా యూనిక్‌ ల్యాండ్‌ పార్సెల్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ కేటాయిస్తారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లోనూ భూములు, ఆస్తులకు సంబంధించిన రికార్డులను పూర్తిగా చేస్తారు. 

పరిశ్రమలకు ప్రోత్సాహం

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వనుంది మోదీ ప్రభుత్వం. క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ కింద ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్స్ ఇస్తామని ప్రకటించింది. సెల్ఫ్ గ్యారెంటీ ఫండ్ కింద ఎంఎస్ఎంఈలకు రూ.100 కోట్లు కేటాయించనున్నారు. అలాగే, 500 పరిశ్రమల్లో కోటికి మంది యువతకు ఉద్యోగాలు కల్పించనున్నారు. దేశ వ్యాప్తంగా కొత్తగా 12 పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల నివాసానికి డార్మిటరీ తరహా అద్దె ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 

ఎఫ్‌డీఐ విధానాలు సులభతరం

బడ్జెట్ ప్రసంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సడలించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ‘‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సులభతరం చేయడానికి, ప్రాధాన్యతను తగ్గించడానికి, ఇంకా విదేశీ పెట్టుబడుల కోసం భారతీయ రూపాయిని కరెన్సీగా ఉపయోగించుకునే అవకాశాలను ప్రోత్సహించడానికి ఎఫ్‌డీఐ, విదేశీ పెట్టుబడి నియమాలు సరళీకృతం చేస్తామని నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో తెలిపారు. కాగా, ప్రస్తుతం అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.6313 వద్ద ట్రేడవుతోంది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌

వాణిజ్యం, వ్యాపారాలను ప్రోత్సహించేందుకు జన్‌ విశ్వాస్‌ బిల్లు బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావనకు తీసుకొచ్చింది. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు- 2022 వ్యవసాయం, పర్యావరణం, మీడియా సహా అనేక రంగాల్లో 42 చట్టాలను సవరించింది. ఈ చట్టాల్లో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం- 1898, పర్యావరణ రక్షణ చట్టం- 1986, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ చట్టం- 1991, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం- 2000 ఉన్నాయి.

డిజిటల్‌ ఇండియా మిషన్‌

ఆర్థిక వ్యవస్థను డిజిటలైజేషన్ చేసేందుకు సాంకేతికతను అందిపుచ్చుకునే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేస్తోందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. డిజిటల్ పద్ధతులను ఉపయోగించి వ్యాపార సంస్కరణల ప్రణాళికలను అమలు చేసే రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. వ్యవస్థలో ఉత్పాదకతను మెరుగుపరచడానికి, అసమానతలను తగ్గించడానికి మోదీ ప్రభుత్వం గడిచిన పదేళ్లుగా సాంకేతికతను విజయవంతంగా ఉపయోగించుకుందని తెలిపారు. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్, ప్రైవేట్ రంగ ఆవిష్కరణలు పౌర సేవలను చేరువ చేయడంలో సహాయపడిందని, ముఖ్యంగా సామాన్య ప్రజలకు మార్కెట్ వనరులు, ఆరోగ్యం, విద్యకు ప్రాప్యతను మెరుగుపరచడంలో దోహదం చేసిందని వివరించారు. 

Latest Videos

click me!