Coronavirus: భారీగా నమోదైన కరోనా వైరస్ కొత్త కేసులు.. పెరుగుతున్న మ‌ర‌ణాలు !

First Published | Jun 30, 2022, 11:00 AM IST

Coronavirus: ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెర‌గుతున్నాయి. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ కొత్త కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 
 

Coronavirus: భార‌త్ లో మ‌ళ్లీ క‌రోనా ప్ర‌భావం పెరుగుతోంది. కోవిడ్‌-19 కేసులు కూడా అధికంగా న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 18,819 క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 

క‌రోనా వైర‌స్ కొత్త కేసులు దాదాపు నాలుగు నెలల త‌ర్వాత గరిష్ట సంఖ్య‌లో న‌మోద‌య్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 20న 19,968 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌ర్వాత అత్య‌ధికంగా క‌రోనా కేసులు న‌మోదుకావ‌డం ఇదే మొద‌టిసారి. 


దేశంలో మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 39 మంది ప్రాణాలు కోల్పోయార‌ని కేంద్రం వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 5,25,116 కు పెరిగింది. మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 4,34,52,164కు చేరుకుంది. 
 

క‌రోనా వైర‌స్ కొత్త కేసుల పెరుగుద‌ల కార‌ణంగా యాక్టివ్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. క్రియాశీల కేసులు ఇప్ప‌టికే ల‌క్ష మార్కును దాటాయి. ప్ర‌స్తుతం 1,04,555 యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వ యాంత్రాంగాలు కోవిడ్‌-19 ప‌రీక్ష‌ల‌ను పెంచుతున్నాయి. గత 24 గంటల్లో 4,52,430 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్టు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌న మండ‌లి వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య 86.23 కోట్లకు చేరుకుంద‌ని ఐసీఎంఆర్ తెలిపింది. 
 

క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉంది. టాప్‌-10లో  మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్ లు ఉన్నాయి. 
 

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ సైతం ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 14,17,217 మందికి వ్యాక్సిన్‌లు వేయగా, మొత్తం టీకాల సంఖ్య 1,97,61,91,554కి చేరుకుంది. ఇందులో మొద‌టి డోసుల సంఖ్య 91.8 కోట్లుగా ఉండ‌గా, రెండు డోసులు తీసుకున్న‌వారి సంఖ్య 84.3 కోట్ల‌కు పెరిగింది. 

Latest Videos

click me!