Published : Dec 28, 2025, 11:33 PM ISTUpdated : Dec 28, 2025, 11:46 PM IST
CISF Officer Viral Video: ఎయిర్‌పోర్ట్‌లో తండ్రిని చూసి పరుగెత్తిన చిన్నారిని సీఐఎస్‌ఎఫ్ అధికారి అడ్డుకున్న వీడియో వైరల్ అవుతోంది. విధి నిర్వహణలోనూ ఆ ఆఫీసర్ చూపిన ప్రేమ, ఆప్యాయతలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వీడియో.. ఆ చిన్నారి, జవాన్ మధ్య ఏం జరిగింది?
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రమే మనసుకు హత్తుకుంటాయి. అలాంటి ఒక హృదయాలను గెలుచుకునే సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
చాలా కాలం తర్వాత తండ్రిని చూడగానే ఆనందంతో పరుగెత్తిన ఒక చిన్నారిని, విధి నిర్వహణలో ఉన్న ఒక సీఐఎస్‌ఎఫ్ అధికారి అడ్డుకున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సాధారణంగా భద్రతా సిబ్బంది అంటే కఠినంగా ఉంటారని అనుకుంటారు. కానీ విధి నిర్వహణలో కూడా దయ, సానుభూతి చూపవచ్చని ఈ అధికారి నిరూపించారు.
24
ఎయిర్‌పోర్ట్‌లో ఆసక్తికర సంఘటన
వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి చాలా రోజుల తర్వాత విమానంలో తన సొంత ఊరికి తిరిగి వచ్చారు. ఎయిర్‌పోర్ట్ అరైవల్ గేట్ వద్ద తన తండ్రిని చూడగానే, అక్కడ వేచి ఉన్న అతడి చిన్నారి కూతురు ఆనందంతో పొంగిపోయింది. ఎయిర్‌పోర్ట్ భద్రతా నిబంధనల గురించి ఆ చిన్నారికి తెలియదు. దీంతో తండ్రి కనిపించగానే సంతోషంతో గట్టిగా అరుస్తూ, తండ్రి వైపు పరుగెత్తుకుంటూ వెళ్లింది.
అయితే అది అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశం. సెన్సిటివ్ జోన్ కావడంతో ఎవరినీ అనుమతించరు. సరిగ్గా అదే సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న సీఐఎస్‌ఎఫ్ అధికారి ఆ చిన్నారిని గమనించారు. వెంటనే ఆమెను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే ఆయన అడ్డుకున్న విధానం చాలా స్పెషల్ గా ఉంది. చిన్నారిని భయపెట్టకుండా, ఎంతో ప్రేమగా, ఆమెతో ఆడుకుంటున్నట్లుగా చేతులు చాచి నిలువరించారు.
34
సీఐఎస్‌ఎఫ్ అధికారిక ట్వీట్
ఈ అందమైన వీడియోను సీఐఎస్‌ఎఫ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్వయంగా పోస్ట్ చేసింది. వీడియోలో అధికారి చిన్నారిని ప్రేమగా ఆపడం, ఆ తర్వాత తండ్రి అక్కడికి చేరుకుని బిడ్డను ఎత్తుకుని బయటకు వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియోను షేర్ చేస్తూ సీఐఎస్‌ఎఫ్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ ను కూడా పంచుకుంది. "సహనం, సానుభూతి, మానవతా స్పర్శ. విధి నిర్వహణ, కారుణ్యం ఎలా కలిసి ప్రయాణించగలవో ఈ వీడియో చూపిస్తుంది" అని పేర్కొంది. భారతీయ భద్రతా దళాల మానవీయ కోణాన్ని ఈ సంఘటన ప్రతిబింబిస్తోందని వారు తెలిపారు. విమానాశ్రయం అరైవల్ ప్లేస్ లో జరిగిన ఈ సంఘటన చూసి అక్కడి వారు కూడా ఎంతో సంతోషపడ్డారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ గా మారింది. ఏకంగా మూడు లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. నెటిజన్లు ఆ అధికారి ప్రవర్తనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ఒక నెటిజన్ స్పందిస్తూ.. "మన దేశ సైనికులు దయ, దమ్ము రెండూ ఉన్నవారు. అవసరమైనప్పుడు వారు దేశం కోసం ధైర్యాన్ని చూపిస్తారు, అదే సమయంలో అవసరమైనప్పుడు ఇలాంటి ప్రేమను కూడా కురిపిస్తారు. నా దేశ పౌరుల నుంచి ఇలాంటి దృశ్యాలు చూడటం ఎంతో సంతోషాన్నిస్తోంది" అని రాసుకొచ్చారు.
ఎయిర్‌పోర్ట్ భద్రత ఎంత ముఖ్యమో, ఒక చిన్నారి భావోద్వేగం కూడా అంతే ముఖ్యమని ఆ అధికారి గుర్తించిన తీరు అద్భుతమని పలువురు కొనియాడుతున్నారు. బాధ్యతను నిర్వర్తిస్తూనే దయ చూపించడం గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు.