Bengaluru : బెంగళూరులో ఒక కాలేజీ విద్యార్థి తన పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM) కోసం అద్దెకు తల్లిదండ్రులు కావాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీని కోసం అతను ఏకంగా రూ. 15,000 ఆఫర్ చేయడం విశేషం.
సాధారణంగా పాఠశాలల్లో లేదా కళాశాలల్లో జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ (PTM) అంటే విద్యార్థులకు కాస్త వణుకు పుట్టడం సహజం. మార్కుల గురించి, క్రమశిక్షణ గురించి లెక్చరర్లు తమ తల్లిదండ్రులకు ఏం చెప్తారో అని భయపడుతుంటారు. అయితే, బెంగళూరుకు చెందిన ఒక విద్యార్థి ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక వింత మార్గాన్ని ఎంచుకున్నాడు. తన తల్లిదండ్రులకు బదులుగా, నకిలీ తల్లిదండ్రులను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకుని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చాడు.
25
రూ. 15,000 ఆఫర్.. షరతులు ఇవే
రెడ్డిట్ (Reddit) లో ఈ విద్యార్థి పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తన కాలేజీలో జరగబోయే పీటీఎం కోసం ఎవరో ఒకరు తండ్రిగా లేదా తల్లిగా నటించడానికి రావాలని ఆ పోస్ట్‌లో కోరాడు. ఈ పని చేసినందుకు గాను ఏకంగా రూ. 15,000 చెల్లిస్తానని ఆఫర్ ఇచ్చాడు. అయితే దీనికి కొన్ని షరతులు కూడా పెట్టాడు. వచ్చే వ్యక్తి వయస్సు 40 ఏళ్లకు పైబడి ఉండాలని, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలగాలని పేర్కొన్నాడు. ముఖ్యంగా కాలేజీ యాజమాన్యంతో మాట్లాడేటప్పుడు ఎక్కడా అనుమానం రాకుండా నిజమైన తండ్రిలాగే నమ్మించగలగాలని వివరించాడు. సదరు విద్యార్థి తన కాలేజీ జేపీ నగర్‌లో ఉందని, ఇందిరానగర్ పరిసరాల్లో ఉండేవారికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు.
35
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు
ఈ వింత ప్రకటన చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నవ్వుకుంటే, మరికొందరు ఆ రోల్‌కు తాము సరిపోతామా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. "మా నాన్న రిటైర్ అయ్యారు, సైడ్ ఇన్కమ్ కోసం ఇలాంటి పని వెతుకుతున్నారు" అని సరదాగా కామెంట్ చేశారు. మరొకరు "నా వయసు 34, కానీ నా గడ్డం, మీసాల్లో తెల్ల వెంట్రుకలు ఉన్నాయి.. నేను తండ్రి పాత్రకు సెట్ అవుతానా?" అని అడిగారు. ఇంకొక యూజర్ అయితే.. "నేను 46 ఏళ్ల వాడిని, కేవలం ఆ కిక్కు కోసం నేను ఉచితంగా రావడానికి సిద్ధం" అని రాసుకొచ్చాడు.
ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో, ఒక నెటిజన్ 2003లో తన క్లాస్‌మేట్ చేసిన ఇలాంటి పనిని గుర్తు చేసుకున్నాడు. "నా స్నేహితుడు ఒకరు తన వంట మనిషికి రూ. 10,000 ఇచ్చి, తండ్రిగా నటించమని కాలేజీకి తీసుకెళ్లాడు. ఆ వంట మనిషి అద్భుతంగా నటించి అందరినీ నమ్మించాడు. అంతా సవ్యంగా సాగిపోతోంది అనుకున్న సమయంలో.. అతని అసలు తండ్రి కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్‌కు హలో చెప్పడంతో అసలు విషయం బయటపడింది" అని షేర్ చేశాడు.
55
కాలేజీల్లో పీటీఎం అవసరమా?
ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. డిగ్రీ లేదా అంతకంటే పై చదువులు చదివే కాలేజీ విద్యార్థులకు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్‌లు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి వల్లే ఇలాంటి వింత నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, 15 వేల రూపాయలు ఇచ్చి మరీ తండ్రిని అద్దెకు తెచ్చుకోవాలనుకున్న ఈ విద్యార్థి ఆలోచన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.