తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం...
ఆగస్టు 5వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌లో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ఆందోళనకారులు, అల్లరి మూకలు ఏకంగా ప్రధాని హసీనా నివాసంలోకి చొరబడ్డారు. ప్రధాని నివాసంలోని వస్తువులు, దుస్తులు, ఇతర విలువైన సామగ్రిని లూటీ చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు, అల్లర్లు చెలరేగడంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు వెనుక అమెరికా హస్తం ఉందని ఆమె ఆరోపించారు. తన దేశంలో మృతదేహాల ఊరేగింపును తాను చూడాలని అనుకోలేదన్నారు. విద్యార్థుల మృతదేహాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కొందరు భావించారని... దాన్ని తాను అంగీకరించలేదని ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్ వ్యూలో హసీనా పేర్కొన్నారు. ఆ పరిస్థితులు చూడకూడదనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు.