Assembly Election 2026 : షాకింగ్ ఓటింగ్ శాతం.. వర్షాన్ని కూడా లెక్కచేయని ఓటర్లు.. 3 రాష్ట్రాల్లో హోరాహోరీ !

Published : Apr 09, 2026, 08:08 PM IST

Assembly Election 2026 : అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భారీ ఓటింగ్ తో ముగిసింది. అస్సాంలో 85%, పుదుచ్చేరిలో 87% ఓటింగ్ నమోదు కాగా, ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.

PREV
16
Assembly Election 2026 : అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో భారీగా ఓటింగ్

దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా భావించే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ భారీ ఓటింగ్ తో ముగిసింది. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో గురువారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య త్రిముఖ పోరు నెలకొనడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మే 4న వెలువడనున్న ఫలితాల కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురుచూస్తోంది.

26
అస్సాంలో ఓటర్ల సునామీ.. రికార్డ్ స్థాయిలో 85 శాతం ఓటింగ్

ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. మొత్తం 126 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో సుమారు 85 శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇది అత్యధికం కావడం విశేషం. ముఖ్యంగా దల్‌గావ్‌లో ఏకంగా 94.57 శాతం ఓటింగ్ నమోదు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీజేపీ ఇక్కడ వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిస్తోంది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి కావడంతో, ఈ ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా మారనున్నాయి.

36
కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ హ్యాట్రిక్ కొడుతుందా?

కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో సుమారు 75 శాతం ఓటింగ్ నమోదైంది. సీఎం పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF) వరుసగా మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూడా ఈసారి కేరళలో తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదైంది. సుపరిపాలన, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

46
పుదుచ్చేరిలో భారీ ఓటింగ్.. రంగస్వామి ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 87 శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్.రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ-బీజేపీ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా, కాంగ్రెస్-డీఎంకే కూటమి గట్టి సవాల్ విసిరింది. ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' పార్టీ కూడా ఈ ఎన్నికలతో అరంగేట్రం చేయడంతో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.

56
అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు

పోలింగ్ పర్వం దాదాపు ప్రశాంతంగా సాగినప్పటికీ, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పుదుచ్చేరిలోని మన్నడిపేటలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఇక అస్సాంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ లోపల వీడియో తీసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరో విషాదకర ఘటనలో, కేరళలోని త్రిస్సూర్‌లో ఓటు వేయడానికి గంటన్నర పాటు క్యూలో ఉన్న వినోదన్ (62) అనే వ్యక్తి, ఓటు వేసిన వెంటనే అస్వస్థతకు గురై మరణించారు.

66
మే 4న తేలనున్న అభ్యర్థుల జాతకం

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఈవీఎంలు ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరాయి. భారీగా నమోదైన ఓటింగ్ శాతం ఎవరికి లాభిస్తుందనే దానిపై రాజకీయ విశ్లేషకులు రకరకాల అంచనాలు వేస్తున్నారు. అధిక పోలింగ్ శాతం ఎప్పుడూ మార్పును కోరుకుంటుందని కొందరు అంటుంటే, సంక్షేమ పథకాల పట్ల సంతృప్తిగా ఉన్న ఓటర్లు భారీగా తరలివచ్చారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా, ఓటరు తీర్పు ఏమిటో తెలియాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories