
తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ దళపతి కరూర్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో పలువురు చిన్నారులు, మహిళలు సహా మొత్తం 34 మంది మరణించారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం సృష్టించింది.
విజయ్ ప్రచార వాహనం వైపు లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు గుమిగూడటంతో ఈ తోపులాట జరిగింది. పిల్లలు, మహిళలతో సహా చాలా మంది స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్ మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కూడా జనం చెదరకముందే 20 మందికి పైగా స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. వారిని అంబులెన్స్‌ల ద్వారా కరూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. మొత్తం 45-50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వార్డులు నిండిపోయాయి. కరూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 74 పడకలు పూర్తిగా నిండిపోయాయి. దీంతో త్రిచి సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి వైద్య బృందాలను రప్పించారు.
కరూరు తొక్కిసలాట నేపథ్యంలో విజయ్‌పై కేసు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 డిసెంబర్ 13న హైదరాబాద్‌లో జరిగిన 'పుష్ప 2: ది రూల్' సినిమా ఫస్ట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ దురదృష్టవశాత్తు మరణించిన ఘటనకు సంబంధించి, అల్లు అర్జున్ అరెస్టు అయిన విషయం గుర్తుందా? డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో ఈ ఘటన జరిగింది, అప్పుడు 35 ఏళ్ల మహిళ మరణించగా, ఆమె కుమారుడు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు అయ్యారు.
ఆయనపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 105, 118(1) కింద కేసు నమోదు అయింది. BNS లోని సెక్షన్ 105 'హత్య కాని నరహత్య' (Culpable Homicide not amounting to murder)కి సంబంధించినది. చంపాలనే ఉద్దేశంతో లేదా మరణం సంభవించవచ్చని తెలిసీ చేసిన చర్యల వల్ల మరణం సంభవిస్తే ఇది తీవ్రమైన నేరం. ఈ సందర్భంలో, ఒక బహిరంగ కార్యక్రమంలో జన సమూహాన్ని సరిగా నిర్వహించడంలో విఫలం కావడం, అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం ఈ సెక్షన్ కింద నిర్లక్ష్యంగా పరిగణిస్తారు. విజయ్ పై కూడా దీని కింద కేసు నమోదు, అరెస్టు అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ సెక్షన్ కింద నేరం రుజువైన వారికి జీవిత ఖైదు లేదా 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో సహా కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు. ఈ నియమం భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 304 ('హత్య కాని నరహత్య' - Culpable Homicide not amounting to murder)ని పోలి ఉంటుంది. అయినప్పటికీ, BNS లోని సెక్షన్ 105 ఇటువంటి పెద్ద బహిరంగ కార్యక్రమాల సమయంలో జన సమూహాన్ని నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించినప్పుడు వర్తిస్తుంది. అధిక జనాభాతో సంబంధం ఉన్న ప్రమాదాలను అంచనా వేసి, వాటిని తగ్గించాలి అనే విషయాన్ని ఈవెంట్ నిర్వాహకులు గుర్తుంచుకోవాలని చట్టం చెబుతుంది.
BNS లోని సెక్షన్ 118(1) ప్రమాదకరమైన ఉపకరణాలు లేదా ఇతర పద్ధతులను ఉపయోగించి ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మరొకరికి హాని కలిగించినప్పుడు అమలు చేస్తారు. ఈ సెక్షన్ సాధారణంగా శారీరక గాయాలకు సంబంధించినదైనప్పటికీ, జనసమూహం ప్రమాదకరమైన స్వభావం, తగిన నియంత్రణ చర్యలు లేకపోవడం కారణంగా ఈ కేసులో అరెస్టు చేయవచ్చు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైన వ్యక్తికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 20,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇది ప్రమాదకరమైన మార్గాలను ఉపయోగించి స్వచ్ఛందంగా హాని కలిగించడాన్ని గురించి తెలిపే IPC సెక్షన్ 324ను పోలి ఉన్నప్పటికీ, BNS సెక్షన్ 118(1) జంతువులు లేదా ఇతరులకు హాని కలిగించడం గురించి నిర్దిష్ట నిబంధనలను కలిగి ఉండటంలో విభిన్నంగా ఉంటుంది.
ఈ రెండు సెక్షన్లు (విభాగాలు) కాగ్నిజబుల్ నేరాలు (Cognizable Offences) కాబట్టి, పోలీసులు వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్టు చేయవచ్చు. అయితే, ఇవి బెయిల్ పొందదగిన (Bailable) నేరాలు. కాబట్టి, నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేసులను మాజిస్ట్రేట్ కోర్టులో విచారించవచ్చు. సెక్షన్ 118(1) కొంత క్లిష్టమైనది, ఇందులో ఇరుపక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరితే కోర్టు వెలుపల పరిష్కారానికి అవకాశం ఉంటుంది.
ఒక ప్రాణం పోయినందుకే ఈ చట్టం కింద అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. కరూర్ సంఘటనలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి విజయ్ మాత్రమే బాధ్యత వహించాలి అని అంటున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 118(1) కింద విజయ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.