Published : Jun 20, 2025, 03:14 PM ISTUpdated : Jun 20, 2025, 03:15 PM IST
కొన్నిసార్లు సమాజంలో జరుగుతోన్న సంఘటనలు భయబ్రాంతులకు గురి చేస్తుంటాయి. అయితే అదే సమాజంలో మరో కోణం కూడా ఉంటుంది. అలాంటి ఒక హ్యుమన్ టచ్ యాంగిల్ గురించి ఈరోజు తెలుసుకుందాం.
పెళ్లైన వారం రోజులకే కట్టుకున్న భర్తను హనీమూన్ పేరుతో కడతేర్చింది ఓ నవ వధువు. ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టించింది. మరో భార్య ప్రియుడి మోజులో పడి భర్తను చంపి శవాన్ని డ్రమ్ములో దాచి సిమెంట్‌తో కప్పేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు ఇటీవల ఎన్నో జరిగాయి.
దీంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి అంటేనే భయం వేస్తోంది. అసలు పెళ్లిళ్లు చేసుకోకూడదు అంటూ పోస్టులు చేస్తున్నారు. అయితే ఇలాంటి దారుణాలు జరుగుతోన్న సమాజంలోనే పెళ్లి బంధానికి అసలైన అర్థం చెప్పే ఓ సంఘటన జరిగింది.
25
93 ఏళ్ల వయసులో
మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతులకు సంబంధించిన వార్త ఒకటి తాజాగా తెగ ట్రెండ్ అవుతోంది. 93 ఏళ్ల వయసులో ఓ తాత భార్య కోసం జువెలరీ షాప్ కు వెళ్లి స్వయంగా తాళి బొట్టు కొనడం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. భార్యను వెంటపెట్టుకుని షాప్ కు వెళ్లి ఆమెకు నచ్చిన తాళిని తాత కొనిస్తుండటం సిబ్బందినీ, కస్టమర్లను అబ్బురపరిచింది. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియా ద్వారా ప్రపంచమంతా చుట్టేసింది.
35
ఇంతకీ ఏం జరిగిందంటే.?
93 ఏళ్ల నివృతి షిండే అనే తాతా తన భార్య శాంతాబాయికు జీవితంలో బంగారాన్ని కొనించలేకపోయాడు. చాలిచాలనీ ఆదాయం, కుటుంబ పోషణ, ఎన్నో బాధ్యతలు ఇలా రకరకాల కారణాలతో భార్యకు తాలిని కొనించలేకపోయాడు. జాల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన దంపతులు పండరీపూర్ లోని ఆశాదీ ఏకాదశి వేడుకలకు వెళ్తున్న క్రమంలో భార్యకు మంగళ సూత్రం కొనుగోలు చేయాలని మహారాష్ట్రలోని ఛత్రపతి షంభాజీ నగర్‌లో ఉన్న జువెలరీ షాప్‌కి వెళ్లాడు.
షాక్ అయిన యజమాని
అయితే తొలుత ఆ జంటను చూసిన షాపులో ఉన్న వారు వీరేం కొంటారన్నట్లు చూశారు. అయితే తన భార్యకు మంగళసూత్రం కావాలని అడగడంతో అంతా షాక్ అయ్యారు. ఈ వయసులో భార్య కోరికను తీర్చేందుకు వచ్చిన తాతను చూసి ఫిదా అయ్యారు. ఆ వృద్ధ జంట ప్రేమను చూసి మంత్రమూగ్దుడైన షాప్ ఓనర్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నాడు. కేవలం 20 రూపాయలు తీసుకుని మంగళ సూత్రం గిఫ్ట్ గా ఇచ్చాడు. దీంతో వృద్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సంతోషంతో కంటతడి పెట్టుకున్నారు.
ఈ విషయమై షాప్ యజమానికి మాట్లాడుతూ.. ‘‘తాత, బామ్మ షాపులోకి వచ్చారు. తన భార్యకు మంగళ సూత్రం కావాలని అడిగాడు. రూ. 1120 ఇచ్చి మంగళ సూత్రం కావాలని అడిగాడు. వారు అడిగే విధానం.. భార్య కోసం ఆ వయసులో ఆయన పడే తపన చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే కేవలం టోకెన్ అమౌంట్ 20 రూపాయలు తీసుకుని తాళి వాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చాను’’ అని చెప్పుకొచ్చాడు.
55
నెట్టింట తెగ వైరల్
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వయసులో కూడా జంట మధ్య అన్యోన్యతకు ఫిదా అవుతున్నారు. బోర్ కొడితే విడాకులు తీసుకుంటున్న ఈ రోజుల్లో.. భార్యలను భర్తలు, భర్తలను భార్యలను హత్య చేస్తున్న ఇలాంటి తరుణంలో ఇలా కడవరకు నిలవడమే కాకుండా. 100 ఏళ్లకు దగ్గర పడుతోన్న తరుణంలో కూడా భార్య కోరికను నిజం చేసిన ఈ తాత నిజంగానే ఈ తరం జంటలకు ఆదర్శం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కదూ!