
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మొదటిసారి నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ `ది గర్ల్ ఫ్రెండ్`. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో `దసరా` ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. రాహుల్ రవీంద్రన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఈ మూవీకి మంచి బజ్ ఉంది. అల్లు అరవింద్‌తోపాటు చాలా మంది సెలబ్రిటీలు మూవీపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా నేడు శుక్రవారం(నవంబర్ 7)న విడుదలయ్యింది. ముందుగా మీడియాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రసాద్ ఐమాక్స్ లో వీక్షించాను. మరి టీమ్ చెప్పినట్టుగానే సినిమా ఆకట్టుకుంటుందా? రష్మిక మందన్నా విశ్వరూపం చూపించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
భూమి(రష్మిక మందన్నా) సిటీలోని రామలింగయ్య కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతుంటుంది. ఊరు నుంచి వచ్చిన ఆమె కాలేజీ హాస్టల్‌లోనే ఉంటుంది. భవిష్యత్‌లో బుక్స్ రాయాలనేది తన కోరిక. వచ్చిన కొత్తలోనే ఓ రోజు రాత్రి ఫ్రెండ్‌తో కలిసి ప్రయాణిస్తూ రాంగ్ రూట్‌లో వెళ్లి కారుని యాక్సిడెంట్ చేస్తారు. అతను భూమిపై అరుస్తుంటాడు. ఆ సమయంలోనే పక్కన వెళ్తున్న విక్రమ్(దీక్షిత్ శెట్టి), వారి ఫ్రెండ్స్ చూస్తారు. తమ కాలేజీ అమ్మాయిలు కావడంతో హెల్ప్ చేయడానికి వస్తారు. ఈ క్రమంలో ఆ కారు ఓనర్ ని కొడతారు. అతనొక పోలీస్. మరుసటి రోజు విక్రమ్ బ్యాచ్‌ని పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లి చితక్కొడతారు. ఈ విషయం తెలిసి, భూమి బాధపడుతుంది. గాయాలతో వచ్చిన విక్రమ్‌కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఆమె కేరింగ్ చూసిన విక్రమ్ తన అమ్మలా కేర్ చేస్తుందని ఫిదా అయిపోతాడు. వెంటపడుతుంటాడు. ఈ ప్రాసెస్‌లో తను కూడా విక్రమ్‌కి పడిపోతుంది. ఇద్దరు కలుస్తారు. కిస్ చేసుకుంటారు. ఆ ప్రేమలో చాలా దూరం వెళ్తారు. విక్రమ్ చాలా డామినేటింగ్ పర్సన్. అన్ని నిర్ణయాలు తనే తీసుకుంటాడు. ఎప్పుడూ భూమి తన వెంటే ఉండాలని కోరుకుంటాడు. దీంతో భూమి కొంత ఇబ్బంది పడుతుంది. అదే సమయంలో మరో ఫ్రెండ్ దుర్గా(అను ఇమ్మాన్యుయెల్) ఇదే విషయం చెబుతుంది. అతను నీకు కరెక్ట్ కాదని, దీంతో ఆలోచనలో పడుతుంది భూమి. ఈ అయోమయంలో ఉన్న సమయంలోనే విక్రమ్‌ని భూమి రూమ్‌లో చూస్తారు వాళ్ల నాన్న(రావు రమేష్). ఆమె రూమ్‌లో విక్రమ్ ని చూసి షాక్ అవుతాడు. అతన్ని కొడతాడు. కాలేజీలో పెద్ద గొడవ అవుతుంది. ప్రేమికుడా? తండ్రినా ? అనే పరిస్థితిలో కాలేజీ కోసం తండ్రి మాటని కాదంటుంది. దీంతో ఆయన భూమిని వదిలి వెళ్లిపోతాడు. మరోవైపు విక్రమ్ భూమిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతాడు. ఈ క్రమంలో భూమి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? విక్రమ్‌తో భూమికి సమస్య ఏంటి? తండ్రిని భూమి కలుసుకుందా? ఆమె గతం ఏంటి? లవర్, నాన్న ఇద్దరిలో భూమి ఎవరిని ఎంచుకుంది? చివరికి ఈ కథ ఏ తీరం చేరిందనేది మిగిలిన సినిమా.
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తెలుగులో అడపాదడపా వస్తుంటాయి. అందులో ఆకట్టుకునే మూవీస్ ఒకటి అర మాత్రమే ఉంటాయి. అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ కమర్షియల్ మూవీస్ ఉంటాయి. కాన్సెప్ట్ చిత్రాలుంటాయి. మహిళా సాధికారత అనే అంశాన్ని చర్చించే చిత్రాలుంటాయి. అవి చాలా అరుదుగానే వస్తుంటాయి. అలాంటి మూవీనే `ది గర్ల్ ఫ్రెండ్`. మహిళ స్వేచ్ఛ, వారి స్వాతంత్య్రం ప్రధానంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. మగాళ్ల వెనకాల ఉండటం కాదు, తామే ముందుండి, స్వేచ్ఛగా జీవించడం, నచ్చిన పని చేస్తూ, నచ్చిన జీవితాన్ని గడిపే స్వేచ్ఛ ఉండాలనేది ఈ మూవీ ద్వారా చెప్పాడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. సినిమా రష్మిక కాలేజీకి ఎంట్రీ నుంచి ప్రారంభమవుతుంది. మొదట్లో చాలా సిన్సియర్‌గా చదువుపైనే దృష్టి పెట్టడం, ఆ తర్వాత నెమ్మదిగా విక్రమ్‌కి పడిపోవడం, ఇంతలోనే కాలేజీ మొత్తం చర్చనీయాంశంగా మారడం, అట్నుంచి విక్రమ్ తో కలిసి తిరగడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ సాగుతుంది.
సెకండాఫ్‌లో సంఘర్షణకు గురి కావడం, తాను వెళ్తున్న దారి కరెక్టేనా అనేది, తనకు విక్రమ్ కరెక్టేనా అనేది తనని తాను చెక్ చేసుకోవడం, ఇంతలో తనే రియలైజేషన్ కావడం, తండ్రి వచ్చి గొడవ చేయడం దీంతో కథ, రష్మిక లైఫ్ కాంప్లికేటెడ్‌గా మారుతుంది. ఊహించని పరిణామాలు ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఇటు ప్రేమించిన వాడి డామినేషన్, అటు పెంచిన తండ్రి డామినేషన్ ఇద్దరి మధ్య తాను నలగడం ఎమోషనల్‌గా ఆకట్టుకుంది. మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది. ఎమోషనల్ టచ్ ఇస్తూనే లవ్ ట్రాక్, యూత్‌ఫుల్ డైలాగ్‌లతో అలరిస్తుంది. సెకండాఫ్‌లోనే అసలు కథ ఉంటుంది, అసలు డ్రామా నడుస్తుంది. సినిమాపై ఆసక్తిని పెంచింది. పైకి చూడ్డానికి రెగ్యూలర్ లవ్ కమర్షియల్ మూవీ అనిపించినా, అంతర్లీనంగా చాలా ఎమోషన్ ఉంది. అమ్మాయి పెయిన్ ఉంటుంది. అదే మూవీ కోర్ పాయింట్. ఆ పాయింట్ చెప్పే విషయంలో కొన్ని చోట్ల హైలో, మరికొన్ని చోట్ల లో అయ్యింది. సినిమా పడుతూ లేస్తూ సాగింది. హీరోయిన్ ప్రియుడి నుంచి స్వేచ్ఛని పొందలేకపోతుంది, తండ్రి నుంచి కూడా అదే జరుగుతుంది. దీంతో ఇద్దరినీ ఎదురించి తానేంటో చూపించాలనుకోవడం, ఆ బంధాలు అనే బంధనాలను తెంచుకుని తానేంటో చూపించేందుకు ఓ లేడీ చేసిన సాహనం, తిరుగుబాటు అదిరిపోయింది. క్లైమాక్స్ లో గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. ఆడది అంటే మగవాడికి సేవలు మాత్రమే చేసేది కాదు, తనకంటూ ఓ లైఫ్ ఉంటుందని, దాన్ని గౌరవించాలని చెప్పే చిత్రమిది. ఆ సందేశాన్ని అందించడంతో దర్శకుడు సక్సెస్ అయ్యారు. దాన్ని అంతే బాగా తన పాత్ర ద్వారా ఆవిష్కరించడంలో రష్మిక సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు. మహిళ స్వేచ్ఛని ఆవిష్కరించే ఈ మూవీ లేడీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
ప్లస్ లు చూస్తే, రష్మిక మందన్నా, దీక్షిత్, మెయిన్ కాస్టింగ్ నటన. ఎమోషన్స్, ఇంటెన్సిటీ బాగా కుదిరింది. అదే సమయంలో మహిళలకు సంబంధించి చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మ్యూజిక్ మరో అసెట్‌గా చెప్పొచ్చు. కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. డైలాగ్స్ అదిరిపోయాయి.
మైనస్‌లు చెప్పాల్సి వస్తే.. మూవీ స్టార్ట్ అయిన కాసేపు తర్వాత డల్ అనిపిస్తుంది. కొన్ని సార్లు లేస్తుంది, మళ్లీ పడిపోతుంది. మధ్య మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతుంది. అబ్బాయిల పాత్రలను చూపించే క్రమంలో కొంత క్లారిటీ మిస్ అయ్యింది. కొన్ని సీన్లతోపాటు, కన్ క్లూజన్ ఊహించినట్టుగానే ఉండటం మైనస్‌గా చెప్పొచ్చు.
రష్మిక మందన్నా భూమి పాత్రలో జీవించింది. ప్రాణం పోసింది. అదరగొట్టింది. ఫన్నీగా కనిపిస్తూనే రెచ్చిపోయింది. విశ్వరూపం చూపించింది. సెటిల్డ్ గా చేసి ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో వాహ్ అనిపించింది. ఇందులో ఆమెది ది బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. దీక్షిత్ శెట్టి సైతం చాలా బాగా చేశాడు. చాలా సార్లు వాహ్ అనిపించాడు. ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. రావు రమేష్ తండ్రిగా రెచ్చిపోయాడు. మరోవైపు లెక్చరర్‌గా రాహుల్ రవీంద్రన్ ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రలు ఫర్వాలేదనిపించాయి.
ఈ చిత్రానికి అబ్దుల్ హేషామ్ అందించిన సంగీతం బిగ్ అసెట్. థ్రిల్లర్ సినిమాని తలపించేలా కొట్టాడు. పాటలు ఇప్పటికే సూపర్ హిట్. బిజీఎం కూడా అదిరిపోయింది. కెమెరా వర్క్ సూపర్బ్ అనిచెప్పొచ్చు. ఎడిటింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సినిమా చాలా చోట్ల పడుతూ, లేస్తూ వచ్చింది. ఆయా చోట్ల ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా తీశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. మహిళల స్వేచ్ఛకి సంబంధించి చెప్పిన పాయింట్ బాగుంది. దాన్ని చూపించిన తీరు బాగుంది. సినిమాని కూడా ఇంటెన్సిటీతో నడొపించిన తీరు బాగుంది. అయితే ఈ చిత్రం ఏ సెంటర్లకి పరిమితమయ్యే మూవీలా ఉంది. బీ, సీ సెంటర్లకిది ఏ మేరకు వెళ్తుందనేది ప్రశ్న.
ఫైనల్‌గా.. మహిళలు చూడాల్సిన మూవీ. మగాళ్లు తెలుసుకోవాల్సిన పాయింట్. పైనల్‌గా హృదయాన్ని హత్తుకునే చిత్రం.
రేటింగ్‌ః 3