
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయోగాలకు సూపర్ స్టార్ కృష్ణ పెట్టింది పేరుగా ఉన్నారు. ఆయన టాలీవుడ్ కు పరిచయం చేసిన టెక్నాలజీ అంతా ఇంతా కాదు.. ఫస్ట్ కౌబాయ్, ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమాలు చేసిన రికార్డు కూడా కృష్ణదే. ఆయన చేసిన సాహసాలు.. ఏ హీరో కూడా చేసి ఉండరు. టాలీవుడ్ నుంచే కాదు.. ఏకంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ కౌబాయ్ ఫిల్మ్ చేసింది కృష్ణ. ఆయన హీరోగా నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా 50 దేశాల్లో రిలీజ్ అయ్యి.. ఇండియా నుంచి ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రికార్డును ఇంత వరకూ ఏ సినిమా బీట్ చేయలేకపోయింది. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా, విజయనిర్మల హీరోయిన్ గా, నాగభూషణం, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, వంటి నటీనటులు నటించిన ఈమూవీని కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేయగా.. పద్మాలయ బ్యానర్ పై కృష్ణ సమర్పణలో.. ఆయన తమ్ముళ్లు హనుమంత రావు, ఆదిశేషగిరి రావులు నిర్మించారు. 1971 లో రిలీజ్ అయిన ఈసినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో సరికొత్త పేజీని రాసింది.
ఈ సినిమా వెనుక పెద్ద కథ నడిచింది. 1970వ దశకంలో కొన్ని ఇంగ్లీష్ సినిమాలు మద్రాస్ కేంద్రంగా విపరీతంగా ఆడేవి. వాటికి మన ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో, భారీగా కలెక్షన్లు కూడా సాధించాయి. దాంతో అలాంటి సినిమాలు మనం ఎందుకు చేయకూడదు అని సూపర్ స్టార్ కృష్ణ మనసులో ఓ ఆలోచన వచ్చింది. ఆయనకు ఆలోచన వస్తే చాలు వెంటనే ఆచరణలో పెట్టేస్తుంటాడు. అనుకున్నదే తడవుగా.. వెంటనే రచయిత ఆరుద్రని పిలిచి.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా.. ఇంగ్లీష్ సినిమాను తలదన్నే కథను రాయమని చెప్పారు. అప్పుడు ఆరుద్ర ద గుడ్, ద బ్యాడ్ అండ్ అగ్లీ అనే హాలీవుడ్ మూవీ ఇన్స్‌పిరేషన్ గా తీసుకుని... ఆ లైన్ ను తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా ఓ కథను రాశారు. అది కృష్ణకు నచ్చడంతో.. వెంటనే తన సొంత బ్యానర్.. పద్మాలయ స్టుడియోస్‌పై సినిమాను ఆయనే నిర్మించారు. అప్పట్లోనే కనీవినీ ఎరుగని రీతిలో 8లక్షల భారీ బడ్జెట్‌తో ఈసినిమాను తెరకెక్కించారు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ అంతా.. దాదాపుగా రాజస్థా జరిగింది.
బొబ్బిలి యుద్ధం జరిగే సమయంలో.. తమ సంపద బ్రిటిష్ వారికి దక్కకుండా ఉండేందుకు జమీందారులు అంతా నిధిని ఓ చోట దాస్తారు. ఆ గుట్టు ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. దాని గురించి తెలిసిన కొత్వాల్( గుమ్మడి) ను నిధి రహస్యం చెప్పమని చిత్రహింసలు పెట్టి, విలన్లు చంపేస్తారు. వారు ఏం చేసినా ఆయన మాత్రం అసలు విషయం చెప్పకుండా చనిపోతాడు. ఇక ధర్మంకోసం పోరాడే కొత్వాల్ కొడుకు కృష్ణ ప్రసాద్( కృష్ణ) ఈ విషయం తెలుసుకొని, తన తండ్రిని చంపినవారికోసం వేట మొదలు పెడతాడు. వారిని అంతమొందించడానికి గుర్రమేసుకుని బయలుదేరుతాడు. ఈ విషయంలో కృష్ణ ప్రసాద్ కు నక్కజిత్తుల నాగన్న( నాగభూషణం) అనే దొంగ హెల్ప్ చేస్తాడు ఈక్రమంలో వీరి స్నేహం బలపడుతుంది. వీరిద్దరు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో.. కృష్ణ ప్రసాద్ కు రాధ(విజయ నిర్మల) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అయితే రాధ కూడా కృష్ణ ప్రసాద్ పనిలో వారికి సాయం చేస్తుంది. ముగ్గురు కలిసి దుండగుల వేటకు బయలు దేరతారు. అనుకున్నట్టుగానే అందరినీ చంపుతూ ముందుకు సాగుతాడు. చివరకు నిధిని సాధిస్తారు.. కానీ అక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి? కథ ముగిసే టైమ్ కు ఏం జరుగుతుంది. కృష్ణ ప్రసాద్ అనుకున్న పనిని మొత్తం పూర్తి చేసాడా? ఈక్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అనేది మోసగాళ్లకు మోసగాడు కథ.
ఈ సినిమా కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అసలు తెలుగు ఆడియన్స్ కౌబాయ్ సినిమాలను ఆదరిస్తారా లేరా అనే విషయాన్ని కృష్ణ ఎలా పసిగట్టారు. ఈ సినిమాను ఆయన ఎలా అంచనా వేశారు అనేది ఇప్పటికీ ఎవ్వరికి అర్ధం కాని విషయం. ఈసినిమా మాదిరిగా.. ఎంత మంది హీరోలు కౌబాయ్ గెటప్ లు ట్రై చేసినా.. వారికి అది వర్కౌట్ అవ్వలేదు. అంతెందుకు కృష్ణ తనయుడు మహేష్ బాబు కూడా కౌబాయ్ సినిమా ట్రై చేసి.. డిజాస్టర్ అయ్యారు. ఇక మోసగాళ్లకు మోసగాడు సినిమా విషయానికి వస్తే.. సాహసయాత్ర కథ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. అటు తన పగ తీర్చుకోవడం కోసం, మరో వైపు నిధిని సాధించడం కోసం.. హీరో మొదలుపెట్టిన ప్రయాణం, మధ్యలో పలువురు విలన్లు, వారి బారి నుండి హీరో తప్పించుకోవడం, వారిని అంతమొందించడం అన్నీ ఆసక్తికరంగా సాగాయి. నిజంగా ఒక హాలీవుడ్ మూవీని.. తెలుగులో చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఈసినిమా చూస్తే. అంతే కాదు ఈ సినిమాలో కృష్ణ గెటప్, మేకప్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమా అట్మాస్పియర్ అంతా ఆడియన్స్ కు కొత్త అనుభూతిని అందిస్తుంది. అప్పటి వరకూ రొటీన్ సినిమాలు చూసిన తెలుగు ఆడియన్స్ కు.. మోసగాళ్లకు మోసగాడు సినిమాతో మంచి విజ్యువల్ ట్రీట్ ఇచ్చాడు కృష్ణ. ఒక్కొక్క స్టేజ్ ను దాటుకుంటూ.. పద్మవ్యూహాలు చేదిస్తూ.. హీరో గమ్యాన్ని చేరుకోవడం.. చూసే ఆడియన్స్ కు ఉత్కంఠను కలిగిస్తుంది. సీరియస్ గా సాగుతున్న కథలో.. కృష్ణ, విజయనిర్మల మధ్య లవ్ ట్రాక్, డ్యూయోట్లు, రొమాన్స్.. కాసేపు ప్రేక్షకులకు చేంజ్ ఓవర్ అందించింది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఇంతకు ముందు సినిమాలకంటే కొత్తగా చూపించారు. తెలుగు సినిమా స్టంట్ కొరియోగ్రాఫర్లు.. అప్ డేట్ అయ్యే విధంగా.. మోసగాళ్లకు మోసగాడు సినిమా ఫైట్స్ కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాయి. మధ్యలో నగేష్ కామెడీ చమ్మక్కులు ఆడియన్స్ ముఖంపై నవ్వులు తెప్పిస్తాయి. మొత్తంగా ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులకు అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ ను అందించిందని చెప్పాలి.
కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈసినిమాలో గుమ్మడి, నాగభూషణం, సత్యనారాయణ, ముక్కామల, ధూళిపాల, జ్యోతిలక్ష్మి, ప్రభాకర్ రెడ్డి, నగేశ్, రావు గోపాలరావు ఇతరులు ముఖ్యపాత్రధారులుగా ఉన్నారు. అయితే ఎవరి పాత్రలను వారు ఏమాత్రం తగ్గకుండా పోషించారు. ఒక రకంగా చెప్పాలి అంటు పోటీపడి మరీ నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈసినిమా ప్రయోగం కృష్ణ ఆలోన..దానికి తగ్గట్టుగా ఎక్కువగా కష్టపడింది కూడా ఆయనే. ఇంత వరకు ఎవరు పోషించని పాత్ర, తెలియని మ్యానరిజం.. అయినా సరే తనకు వచ్చినంతలో కౌబాయ్ గా అలరించాడు. గుర్రపు స్వారీ చేస్తూ.. కృష్ణ నిజంగా హాలీవుడ్ హీరోలను మరిపించాడు. ఇక హీరోయిన్ గా విజయనిర్మాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటిలా హీరోయిన్ అంటే గ్లామర్ పార్ట్ మాత్రమే కాదు..అప్పట్లో హీరోకు సమానంగా యక్టింగ్ స్కోప్ హీరోయిన్లకు కూడా ఎక్కువగా దొరికేది. అందుకు తగ్గట్టుగానే సాహసయాత్రలో హీరోకు తోడుగా ఉంటూ.. ధైర్యంగా సమస్యలు ఫేస్ చేసే రాధ పాత్రలో.. అద్భుతం చేసింది విజయనిర్మల. ఇక సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, నాగ భూషణం, ముక్కామల, ధూళిపాల, ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి పాత్రలను కూడా ఈసినిమాతో కొత్తగా చూపించాడు కృష్ణ. ఇతర సినిమాల్లో వారు చూపించిన నటనకు, ఈసినిమాలో వారి పెర్ఫామెన్స్ కు తేడా కనిపిస్తుంది. కొత్తగా ఉన్నా.. ఎక్కడా తగ్గకుండా వారి పాత్రలకు న్యాయం చేశారు సీనియర్ నటులు. ఇక కమెడియన్ నగేష్.. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా.. ఆరోగ్యకరమైన కామెడీతో అలరించాడని చెప్పాలి. ఆర్టిఫిషల్ గా కాకుండా.. సహజ హాస్యంతో ప్రేక్షకులను నవ్వించాడు స్టార్ కమెడియన్. ఇతర నటీనటలు తమ పరిదిమేరకు పాత్రలకు న్యాయం చేశారు.
ఈ చిత్రానికి వి.ఎస్.ఆర్.స్వామి ఫోటోగ్రఫి అద్భుతం చేసింది. ఆయన అందించిన విజ్యూవల్స్ భలేగా ఆకట్టుకున్నాయి. చేసేది కొత్త ప్రయోగం.. దానికి తగ్గట్టుగా కెమెరా వర్క్ ను చూపించడంతో స్వామి సక్సెస్ అయ్యాడు. యాక్షన్ సీన్లు, గుర్రపు స్వారీ ఛేజింగ్ లు.. ఇలా ఏ సీన్ అయినా. తన 100 పర్సెంట్ ఇచ్చాడు. అంతే కాదు కొత్తగా స్వామి చూపించిన కెమెరా టెక్నీక్స్ ఆడియన్స్ కు మంచి విజ్యువల్ ట్రీట్ గా మారాయి. ఇక ఈసినిమాకు కెప్టెన్ కె.ఎస్.ఆర్.దాస్. ఆయన దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆరుద్ర రాసిన కథకు ప్రాణం పోశారు దాస్. కృష్ణ ఈసినిమాను ఎలా చూడాలి అనుకున్నారో.. అలా చేసి చూపించగలిగారు. అప్పటి పిల్లలను, పెద్దలను ఆకర్శించే విధంగా 'మోసగాళ్ళకు మోసగాడు' సినిమాను రూపొందిచారు దాస్. ఇక ఈ చిత్రానికి ప్రాణం పోసింది ఆరుద్ర అని చెప్పాలి. ఆయన రచనతో పాటు కొన్ని పాటలు కూడా రాశారు. మిగిలిన పాటలను అప్పలాచార్య రాశారు. వారి సాహిత్యానికి ఆదినారాయణ రావు సంగీతం తోడయ్యింది. వారి స్వరకల్పనలో రూపొందిన పాటలు తిరుగులేని విజయాన్ని అందించాయి. కోరినది నెరవేరినిది.. అంటూ సాగే డ్యూయట్, ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా... కామెడీ సాంగ్ తో పాటు “కత్తిలాంటి పిల్లా... పాట అలరించింది. వీటితో పాటు గురిని సూటిగా......, తకిట ధిమితక... లాంటి పాటలు ఆడియన్స్ ను అలరించాయి. పాటలు మాత్రమే కాదు, ఈసినిమా కోసం ఆరుద్ర రాసిన పదునైన మాటలు అప్పటి యూత్ ఆడియన్స్ లో దూసుకుపోయాయి. అందరిని భలేగా ఆకట్టుకున్నాయి. ఇక నిర్మాతలుగా కృష్ణ సోదరులు పడ్డ కృషికి తగ్గ ఫలితం దక్కింది - ఈ సినిమా పెద్ద హిట్ గా నిలచింది.
ఈ సినిమాకి ముందుగా వేరే టైటిల్ అనుకున్నారు. ‘అదృష్ట రేఖ’ అనే పేరు బాగుంటుంది అనుకున్నారట. కానీ కృష్ణ మాత్రం ఇది కౌబాయ్ సినిమా కదా.. ఈ టైటిల్ సూట్ కాదని చెప్పేశారట. దాంతో కొన్ని టైటిల్స్ పరిశీలించి.. చివరికి ‘ మోసగాళ్లకు మోసగాళ్లు ’ అనే పేరును ఫైనల్ చేశారు.
మోసగాళ్ళకు మోసగాళ్లు 1971, ఆగస్టు 27న ఇండియాలోనే తొలి తెలుగు కౌబాయ్ సినిమాగా రిలీజయ్యింది. ఈ సినిమాలో 54 ఏళ్ల క్రితమే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 8 లక్షల బడ్జెట్ ఖర్చుపెడితే.. ఏకంగా 50లక్షల గ్రాస్‌ను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
మోసగాళ్ళకు మోసగాళ్లు అద్భుత విజయంతో.. ఆ తర్వాత హిందీలో ‘ ఖజానా’, తమిళంలో ‘మోసక్కారనుక్కు మోసక్కారన్’ అనే టైటిల్స్ తో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది కూడా ఒక రకంగా కృష్ణ చేసిన సాహసమే అనాలి. కానీ ఆయన ఆలోచన ఫలించింది. అక్కడ కూడా ఈసినిమాకు అనూహ్య స్పందన వచ్చింది.
హిందీ తమిళ భాషల్లో వచ్చిన స్పందన చూసి.. కృష్ణ మరో సాహసం చేశారు. హాలీవుడ్ సినిమాలు మన దగ్గరకి రావడం కాదు.. మన సినిమాను అటు ఎందుకు పంపించకూడదు అని అనుకున్నారు. వెంటనే మోసగాళ్ళకు మోసగాళ్లు సినిమాలో పాటలు తీసేసి ‘ది ట్రెజర్’ పేరుతో ఇంగ్లీష్ భాషలోకి డబ్ చేసి వదిలారు. అలా తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి డబ్ అయిన తొలి తెలుగు సినిమాగా మోసగాళ్ళకు మోసగాళ్లు చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 దేశాల్లో విడుదలై తొలి తెలుగు పాన్ వరల్డ్ మూవీగా ఈ మూవీ రికార్డులకెక్కింది.
ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత రూ.50లక్షల గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూడో హీరోగా కృష్ణ నిలిచారు. మాస్ మూవీస్ లో డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ సాగుతున్న యన్టీఆర్ కూడా ఈసినిమా చూసి ఆశ్చర్యపోయారట. కృష్ణతో పాటు ఆయన సోదరులు చేసిన ప్రయత్నాన్ని మనస్పూర్తిగా అభినందించారు కూడా. ఈ సినిమా దెబ్బకు టాలీవుడ్ లో కౌబాయ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. కృష్ణతోనే ఈ సినిమాలు చేయడానికి ఇతర నిర్మాతలు ముందుకు వచ్చారు. దాంతో తెలుగువారి కౌబోయ్ హీరోగా కృష్ణ చరిత్రలో నిలిచిపోయారు.
ఇక ఈసినిమా స్పూర్తితో ఎంతో మంది హీరోలు కౌబాయ్ గెటప్ వేశారు. కానీ ఆసినిమాలు పెద్దగా ఆడలేదు. కృష్ణ తరువాత ఎంత పెద్ద హీరోన కౌబాయ్ గెటప్ వేసినా.. జనాలు ఆధరించలేదు. కృష్ణ నటవారసుడు మహేష్ బాబు కూడా ఆ తరువాతి రోజుల్లో 'టక్కరిదొంగ' అనే కౌబోయ్ మూవీలో నటించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో కృష్ణ కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు అది అభిమానులకు తెగ నచ్చేసింది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది.
ఏది ఏమైనా.. 54 ఏళ్ళ క్రితం సూపర్ స్టార్ కృష్ణ తెచ్చిన ట్రెండ్.. టాలీవుడ్ ను మార్చేసింది.ఎంత మంది ట్రై చేసినా. .తెలుగువారికి కౌబాయ్ హీరో అంటే ఆయనే. ఇక ఈసినిమా ఈ తరం ఆడియన్స్ ను కూడా అలరిస్తుంది. సాసహ యాత్రం కాన్సెప్ట్ కాబట్టి.. అందరికి నచ్చుతుంది. ఈమధ్య కాలంలోనే ఈసినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మోసగాళ్ళకు మోసగాళ్లు సినిమాను 4k లోకి మార్చి రీరిలీజ్ చేశారు. ఈమూవీని చూడాలి అనుకున్నవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.