`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` మూవీ రివ్యూ, రేటింగ్‌.. తిరువీర్‌ మూవీ నవ్వించడంలో సక్సెస్‌ అయ్యిందా?

Published : Nov 06, 2025, 10:44 AM IST

తిరువీర్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో`. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రియలిస్టిక్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నవ్వించడంలో సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

PREV
15
ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో మూవీ రివ్యూ

తిరువీర్‌ `మసూద`తో హిట్‌ అందుకున్నాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు. మధ్యలో `పరేషాన్‌`తో మెప్పించాడు. ఇప్పుడు `ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. ఇందులో టీను శ్రావ్య హీరోయిన్‌గా నటించింది. నరేంద్ర, యామిని, మాస్టర్‌ రోహన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించగా, అథర్వన భద్రకాళి పిక్చర్స్ పతాకంపై అగరమ్‌ సందీప్‌, అష్మితా రెడ్డి బసని నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 7న విడుదల కానుంది. ముందుగానే మీడియాకి ప్రీమియర్స్ ప్రదర్శించారు. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

25
`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` మూవీ స్టోరీ

రమేష్‌(తిరువీర్‌) జీరాక్స్ షాప్‌, ఫోటో స్టూడియోని నిర్వహిస్తుంటాడు. తన ఊర్లో గ్రామపంచాయతీలో హేమ(టీను శ్రావ్య) జాబ్‌ చేస్తుంటుంది. ఆమెని రమేష్‌ ఇష్టపడుతుంటాడు. రోజూ ఆమెని చూస్తుంటాడు. కానీ తన ఇష్టాన్ని చెప్పడు. ఆమెకి కూడా రమేష్‌ అంటే ఇష్టం. కానీ పైకి కాస్త గడుసుగా కనిపిస్తుంటుంది. రమేష్‌కి ఒక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వస్తుంది. మండల ప్రెసిడెంట్‌ వద్ద పనిచేసే ఆనంద్‌(నరేంద్ర)కి సౌందర్య(యామిని)తో పెళ్లి కుదురుతుంది. తన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ మండలంలోనే గ్రాండ్‌గా ఉండాలని రమేష్‌ వద్దకు వస్తాడు. బయటకు వెళ్లి చాలా డిఫరెంట్‌ లొకేషన్లలో షూట్‌ చేస్తారు. తీరా ఆ కెమెరా చిప్‌ని రమేష్‌ అసిస్టెంట్‌(మాస్టర్‌ రోహన్‌) పోగొడతాడు. ఎంత వెతికినా దొరకదు. ఫోటోలు, వీడియోలు కావాలని ఆనంద్‌ రోజూ ఫోన్‌ చేస్తుంటాడు, ఏం చేయాలో తెలియక రమేష్‌ టెన్షన్‌ పడుతుంటాడు. ఆనంద్‌ ఈ ఫోటోలు అడగకుండా ఉండాలంటే పెళ్లి క్యాన్సిల్‌ చేయాలని భావిస్తాడు. అటు అమ్మాయి వాళ్లకి, ఇటు అబ్బాయి వాళ్లకి తప్పుగా చెబుతాడు. అయినా వాళ్లు పట్టించుకోరు. తన లవర్‌ హేమనే ఆనంద్‌ని లవ్‌ లో పడేయమని రిక్వెస్ట్ చేస్తాడు. ఆమె కూడా ఎంత ప్రయత్నించినా వర్కౌట్‌ కాదు. ఇక లాభం లేదు, నిజం చెబుదామని డిసైడ్‌ అవుతాడు రమేష్‌. అంతలోనే పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందని ఆనంద్‌ చెబుతాడు. దీంతో రమేష్‌ ఆనందానికి అవదుల్లేవ్‌. కానీ ఆనంద్‌ బాధని చూసి తట్టుకోలేక తాను తప్పు చేశానని రమేష్‌ బాధపడుతుంటాడు. మళ్లీ ఇరు కుటుంబాలను కలపాలని, వీళ్ల పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు? మరి మళ్లీ వాళ్లు కలిశారా? ఆనంద్‌, సౌందర్య పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం ఏంటి? చివరికి ఏం జరిగిందనేది మిగిలిన కథ.

35
`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` మూవీ విశ్లేషణః

విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సిచ్చువేషన్‌ నేపథ్యంలో సాగే కామెడీ చాలా వరకు వర్కౌట్‌ అవుతుంది. కన్ఫ్యూజన్‌, గజిబిజి వ్యవహారాలు, తప్పులు చేసి దాన్ని కప్పిపుచ్చేందుకు మరిన్ని తప్పులు చేయడం నవ్వులు పూయిస్తుంది. వాళ్ల బాధలు, ఆడియెన్స్ కి కామెడీగా అనిపిస్తాయి. ఇలాంటి కాన్సెప్ట్ తో అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. ఆదరణ పొందుతున్నాయి. అయితే జెన్యూన్‌గా, రియలిస్టిక్‌గా కథని చెబితే, అంతే బాగా సినిమాని తెరకెక్కిస్తే హిట్‌ పక్కా అని చెప్పొచ్చు. తాజాగా `ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` కూడా ఆ కేటగిరిలోకి చెందిందే. ఈ మూవీ కూడా విలేజ్‌ నేపథ్యంలో సాగుతుంది. హీరో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసిన కెమెరా చిప్‌ పోగొట్టడం, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏకంగా పెళ్లినే ఆపేయాలనుకోవడం, ఈ క్రమంలో చేసే ప్రయత్నాలు బెడిసి కొట్టడం ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. సినిమా ఫస్టాఫ్‌ లో మొదట తన లవర్స్ కి సైట్‌ కొట్టడంతో సాగుతుంది. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్‌ ఫోటో షూట్‌తో, అనంతరం చిప్‌ పోయినందుకు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలతో సాగుతుంది. సెకండాఫ్‌ పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు, ఆ తర్వాత మళ్లీ కలిపే ప్రయత్నాలు కామెడీని జనరేట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యాయి. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ఇలా సరదాగా సాగుతూ ఉంటుంది. చివరికి చిన్న ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చిన తీరు బాగుంది. అలా ఎమోషనల్ టచ్‌ ఇస్తూనే క్రేజీగా ముగింపు పలికిన తీరు బాగుంది. సినిమాని చాలా నేచురల్‌గా తెరకెక్కించారు. హీరో, హీరోయిన్‌ అనే గొడవే లేదు. పాత్రలే సినిమాని నడిపిస్తాయి. నవ్వులు పూయిస్తాయి. వాళ్ల బాధలు, వాళ్ల చిలిపి పనులు, వాళ్లు అమాయకత్వం కామెడీగా ఉంటుంది. స్లాంగ్‌ మరింతగా హైలైట్‌గా నిలిచింది. రియాలిటీకి దగ్గరగా, చాలా సహజంగా సినిమాని నడిపించిన తీరు హైలైట్‌గా చెప్పొచ్చు.

`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో`మూవీలో ప్లస్‌ లు, మైనస్‌లు

సినిమా ఆద్యంతం రియాలిటీ దగ్గరగా ఉండటంతో సహజమైన కామెడీ బాగా వర్కౌట్‌ అయ్యింది. పాత్రల అమాయకత్వం నవ్వులు పూయిస్తుంది. మ్యూజిక్‌ కూడా అంతే బాగా కుదిరింది. కొత్తగా ఉంది. ఫన్‌ని హైలైట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యింది. సహజమైన, సింపుల్‌గా ఉండే డైలాగ్‌లు, దర్శకుడి రియలిస్టిక్ అప్రోచ్‌ సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు.

మైనస్‌లు చెప్పాల్సి వస్తే, ఫస్టాఫ్‌లో కొన్ని రొటీన్‌ సీన్లు ఉంటాయి. కామెడీకి ఇంకా చాలా స్కోప్‌ ఉన్నా, లైటర్‌ వేలో డీల్‌ చేశారు. ఎమోషన్స్ ని బలంగా చూపించాల్సింది. హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌కి క్లారిటీ ఇవ్వకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. కొన్ని సీన్లు లాజిక్‌ లెస్‌గా ఉండటం.

45
`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` మూవీలో నటీనటుల పర్‌ఫెర్మెన్స్

ఫోటోగ్రాఫర్‌ రమేష్‌ పాత్రలో తిరువీర్‌ జీవించాడు. అమాయకత్వంతో కూడిన పాత్రలో అదరగొట్టాడు, ఆద్యంతం నవ్వించాడు. ఇక ఆనంద్‌ పాత్రలో నరేంద్ర ఇరగదీశాడు. తిరువీర్‌ని డామినేట్‌ చేశాడు. అతనే హీరో అనేలా ఆయన పాత్ర ఉండటం విశేషం. ఈ మూవీతో ఇండస్ట్రీలో బిజీ అయిపోతాడు. అలాగే రమేష్‌ అసిస్టెంట్‌ మాస్టర్‌ రోహన్‌ నవ్వులు పూయించడంలో సక్సెస్‌ అయ్యాడు. అతని కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. ఇక రమేష్‌ గర్ల్ ఫ్రెండ్‌గా టీను శ్రావ్య సైతం పాత్రలో ఒదిగిపోయింది. ఆ పాత్రకి పర్‌ఫెక్ట్ గా సూట్‌ అయ్యింది. అంతే సహజంగా చేసి మెప్పించింది. అలాగే సౌందర్య పాత్రలో యామిని కూడా అదరగొట్టింది. యామిని పేరెంట్స్ పాత్రలు, ఆనంద్‌ పేరెంట్స్ పాత్రలు చేసిన నటులు కూడా బాగా నటించి సినిమాకి సపోర్ట్ గా నిలిచారు. ఇందులో ఎవరికి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు రెచ్చిపోయారని చెప్పొచ్చు.

55
`ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో` మూవీ టెక్నీషియన్ల పనితీరు

ఈ సినిమాకి సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్‌ పెద్ద అసెట్‌ అని చెప్పాలి. కామెడీని హైలైట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యింది. కొంత `జాతిరత్నాలు` ఫ్లేవర్‌ కనిపించినా, ఆకట్టుకుంది. కె సోమ శేఖర్‌ కెమెరా వర్క్ బాగుంది. విలేజ్‌ లోకేషన్లని బాగా చూపించారు. సినిమా మాదిరిగానే విజువల్స్ అంతే నేచురల్‌గా ఉన్నాయి. నరేష్‌ అడుపా ఎడిటింగ్‌ సైతం చాలా షార్ప్ గా ఉంది. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు రాహుల్‌ శ్రీనివాస్‌ ఎంచుకున్న కాన్సెప్ట్ బాగుంది. దాన్ని తెరకెక్కించిన విధానం అంతే బాగుంది. డైలాగ్‌లు, సహజమైన ఫన్నీ సీన్లు ఆకట్టుకున్నాయి. అలరించాయి. స్లాంగ్‌ కూడా సినిమాకి అసెట్‌గా నిలిచింది. దర్శకుడిగా రాహుల్‌కి మంచి ఫ్యూచర్‌ ఉందని చెప్పొచ్చు.

ఫైనల్‌గాః సరదాగా కడుపుబ్బా నవ్వుకునే చిత్రం `ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో`.

రేటింగ్‌ః 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories