
యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన మూవీ `ఓ సుకుమారి`. దీనికి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణంలో రూపొందిన చిత్రమిది. ఐశ్వర్యా రాజేష్ నటించిన సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 17న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? నవ్వించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
యాదగిరి(తిరువీర్)ది కరీంనగర్ లోని భూంపల్లి గ్రామం. సర్పంచ్ కావాలని కలలు కంటుంటాడు. వీరిది పెద్ద కుటుంబం. కానీ వీరి నాన్న, చిన్నాకి పడదు. ఓ రోజు లాయర్ వచ్చి మీ తాత మీ పేర్లతో 80 ఎకరాలు రాసిచ్చాడు. కానీ మనవళ్లలో ముందుగా ఎవరికైతే వారసుడు జన్మిస్తాడో వాళ్లకే ఆ ఆస్తి చెందుతుందని వీలునామా రాశాడని చెబుతాడు. దీంతో ముందుగా తనే కొడుకుని కనాలని యాదగిరి తమ్ముడు తాను ప్రేమించానని చెప్పి ప్రెగ్నెంట్ అమ్మాయిని తీసుకొస్తాడు. దీంతో యాదగిరి కూడా అర్జెంట్‌గా పెళ్లి చేసుకోవాలని అమ్మాయిల కోసం చూస్తుంటాడు. ఇంతలో దామిని(ఐశ్వర్యా రాజేష్) ని చూసి ఇష్టపడతాడు. ఆమెని ఊర్లో జనం తరిమేస్తుంటారు. ఆమెకి చిన్నప్పట్నుంచి ఒక సమస్య ఉంటుంది. ఆమెని ఎవరైనా ముట్టుకుంటే షాక్ కొడుతుంది. దీంతో దామినిని వదిలించుకోవాలని చూస్తుంటారు. కరెక్ట్ గా యాదగిరి తగులుతాడు. ఆయనకు దామిని గురించి తెలియక పెళ్లికి సిద్ధమవుతాడు. దామిని తండ్రి చెప్పే ప్రయత్నం చేసినా వినడు. దీంతో ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటాడు. మధ్యలో ఒకటి రెండు సార్లు షాక్ కొట్టినా, `మగధీర` సినిమాలా జరుగుతుందనుకుంటాడు. కానీ ఫస్ట్ నైట్ రోజు యాదగిరికి అర్థమవుతుంది. మరి ఆమె అసలు సమస్య తెలిశాక యాదగిరి ఏం చేశారు? వీరిద్దరు కలిసి ఉన్నారా? విడిపోయారా? దామిని వల్ల వాళ్ల ఇంట్లో వచ్చిన మార్పేంటి? ఆ తర్వాత యాదగిరి, దామిని లైఫ్‌లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది మిగిలిన సినిమా.
హీరోకిగానీ, హీరోయిన్‌కి గానీ ఒక సమస్య నేపథ్యంలో మంచి కాన్సెప్ట్ తో రూపొందించిన చిత్రాలకు ఇటీవల కాలంలో మంచి ఆదరణే ఉంటుంది. అయితే ఆ కాన్సెప్ట్ ని ఎంత బాగా తెరపై ఆవిష్కరిస్తారు, ఎంత గ్రిప్పింగ్‌గా కథనాన్ని తీసుకెళ్తారు, ఎంతగా నవ్వించారనే దాన్ని బట్టి సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. `ఓ సుకుమారి` సినిమా ఆ విషయంలో చాలా వరకు రీచ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇందులో హీరోకి ఒక సమస్య, హీరోయిన్‌కి ఒక సమస్యని పెట్టి, ఆ రెండింటిని కలిపిన తీరు, ఈ క్రమంలో చోటు చేసుకునే కామెడీని ప్రధానంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. సందర్బానుసారంగా కామెడీ వర్కౌట్ అయ్యేలా సినిమాని రూపొందించడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో తిరువీర్ సర్పంచ్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటారు. మరోవైపు ఫ్యామిలీలో పడకపోవడం, అంతలోనే 80ఎకరాల తాత భూమి ఆఫర్ రావడం, దానికోసం హీరో పెళ్లి ప్రయత్నాలు చేయడం, ఇద్దరు రంగు తక్కువ ఉన్న అమ్మాయిలతో మంచి కామెడీ పెట్టి నవ్వించే ప్రయత్నం చేశారు. ఇంకోవైపు ఐశ్వర్యా రాజేష్‌కి కరెంట్ షాక్ కొట్టడం, దీంతో ఊరంతా ఆమెని సమస్యగా ఫీలవడం వంటివి కామెడీగా చూపించారు. ఇలా చాలా వరకు నవ్వులు పూయించింది. అయితే ఫ్యామిలీ డ్రామా ఓవర్‌గా అయ్యింది. చాలా వరకు లాజిక్ లెస్ సీన్లు ఉన్నాయి. సెకండాఫ్‌లో అది మరింత ఎక్కువగా అయ్యింది. హీరో తిరువీర్ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు ఓవర్‌గా ఉన్నాయి. ఝాన్సీ సీన్లు కూడా ఇరిటేట్ తెస్తాయి. ఐశ్వర్యా రాజేష్ సమస్యకి సంబంధించిన సీన్లు కూడా బలవంతంగా అనిపిస్తాయి. వాటిలో ఫన్ వర్కౌట్ కాలేదు. కామెడీ సీన్లు డైలాగులు ఇరికించినట్టుగా ఉంటాయి. దీంతో నవ్వులు రావడం కాదు కదా, గోల గోలగా మారిపోయింది. దీనికితోడు చాలా వరకు సన్నివేశాలు సాగదీసినట్టుగా, లాగ్ అనేలా ఉంటాయి. తిరువీర్ ఫ్యామిలీలో హీరోయిన్ ఏమార్పు తెచ్చిందనేది స్పష్టత లేదు. చాలా సీన్లు ఊహించినట్టుగానే ఉంటాయి. ఇలాంటి కొన్ని సినిమాకి మైనస్ గా చెప్పొచ్చు. కానీ చాలా వరకు సినిమా నవ్వులు పంచడంలో సక్సెస్ అయ్యిందని చెప్పొచ్చు.
యాదగిరి పాత్రలో తిరువీర్ బాగా చేశాడు. పాత్రలో జీవించాడు. అంతే నేచురల్‌గా నటించి మెప్పించాడు. అమాయకంగా కనిపిస్తూ నవ్వించాడు. తన సమస్యతో అలరించాడు. అదే సమయంలో యాక్షన్‌తోనూ మెప్పించాడు. ఇక దామిని పాత్రలో ఐశ్వర్యా రాజేష్ ఇరగదీసింది. హీరో రేంజ్‌లో ఆమె పాత్ర ఉంటుంది. చాలా వరకు తిరువీర్‌ని డామినేట్ చేసింది. ఆమెపై ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంది. ఆమె పాత్ర బలంగా ఉంది. ఊరు సర్పంచ్‌గా మురళీధర్ గౌడ్ తనకు సెట్ అయ్యే పాత్రలో అలరించారు. తిరువీర్ తమ్ముడిగా శ్రీనివాస్ గవిరెడ్డి ఫర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
భరత్ మాంచి రాజు మ్యూజిక్ బాగుంది. ఉన్నంతలో ఆకట్టుకుంది. పాటలు ఫర్వాలేదు. ఆర్‌ఆర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. కుషేందర్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ గా సినిమా కనువిందుగా ఉంది. శ్రీ వర ఎడిటింగ్ ఫర్వాలేదు. మహేశ్వర్ రెడ్డి మౌళి నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు భరత్ దర్శన్ ఎంచుకున్న కథ బాగుంది. కాకపోతే ఇంకా బాగా రాసుకోవాల్సింది. కామెడీ విషయంలో మరింత ఫోకస్ పెట్టాల్సింది. కామెడీ నేచురల్‌గా పండించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుండేది. మాటల విషయంలో ఇంకా బెటర్‌మెంట్ అవసరం.
లాజిక్కులు వెతక్కుండా చూస్తే టైమ్ పాస్‌కి సరదాగా నవ్వుకునే మూవీ ఓ సుకుమారి.
రేటింగ్: 2.5