
నాగార్జున నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. ఇప్పటి వరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని `లెనిన్` మూవీ చేశాడు. ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ నిర్మించారు. ఇందులో అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నేడు శుక్రవారం(జులై 10) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? ఈసారైనా అఖిల్‌కి హిట్ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
చిత్తూరులోని శ్రీరామపురంలో భారతం మిట్ట అనే జాతర చాలా ఫేమస్. ఒక పండగలా జరుపుకుంటున్నారు. రెండేళ్లకోసారి వచ్చే ఈ పండగ సమయంలోనే ఊరి పెద్దని నిర్ణయిస్తారు. ఆయన్నే ధర్మరాజుగా భావిస్తారు. ధర్మరాజుగా ఎవరు ఉండాలనేది ధర్మకర్తగా ఉన్న జయమ్మ(ఈశ్వరీరావు) నిర్ణయిస్తుంది. అయితే ఈ సారి వందవ జాతరని గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఆ జాతర పనులు లెనిన్(అఖిల్ అక్కినేని) సమక్షంలో జరుగుతుంటాయి. లెనిన్ ఒక అనాథ. అతన్ని చిన్నప్పుడే జయమ్మ చేరదీస్తుంది. తన కొడుకు వసంత్(ప్రమోద్ పంజు)తో కలిసి పెంచుతుంది. లెనిన్, వసంత్ మంచి ఫ్రెండ్స్ గా పెరుగుతారు. వసంత్ చదువులకోసం మద్రాస్ వెళ్తాడు. ఈ సారి జాతర సమయంలోనే ఆయన డాక్టర్ చదువు పూర్తి చేసుకొని వస్తాడు. అయితే జాతరలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి ఇష్టపడతాడు లెనిన్. లెనిన్‌ని భారతి కూడా ప్రేమిస్తుంది. జాతర జరుగుతున్న సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే రాఘవరెడ్డి(రమేష్ ఇందిరా)కి అవమానం జరుగుతుంది. లెనిన్ అతని కటౌట్‌ని కూల్చేస్తారడు. దీంతో ఎమ్మెల్యే పగతో రగిలిపోతుంటాడు. మరోవైపు యతిరాజు(శివాజీ) ధర్మరాజుగా మారాలని కలలు కంటుంటాడు. కానీ తన మామ ఉంచుకున్న దానికి పుట్టినావని చెప్పి యతిరాజుని అవమానిస్తుంది జయమ్మ. దీంతో ఆమెపై పగతో రగిలిపోతుంటాడు యతిరాజు. కానీ లెనిన్ కి బాగా దగ్గరగా ఉంటాడు. ఈ క్రమంలో జాతరలో వసంత్‌కి వైదేహిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ ఆమె మరో వ్యక్తితో లేచిపోతుంది. దీంతో పెళ్లి ఆగిపోతుంది. లేచిపోయిన అమ్మాయి చెల్లినే భారతి. ఆమెతో వసంత్ పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ భారతి ఏకంగా పెళ్ళి పీఠలమీదే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, లెనిన్ ని ప్రేమిస్తున్నట్టు చెబుతుంది. దీంతో వసంత్.. లెనిన్‌తో భారతికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాడు. అతని వద్దకు తీసుకెళ్లగా, కొందరు దుండగులు వీరిని చంపేందుకు వస్తారు. వసంత్‌ని కాపాడుకుంటాడు లెనిన్. వసంత్‌ని చంపేందుకు ప్రయత్నించింది ఎవరనే షాకింగ్ నిజం తెలుస్తుంది. మరి వీరిపై దాడి చేసింది ఎవరు? దీనికి యతిరాజుకి ఉన్న సంబంధం ఏంటి? వైదేహి ఎలా మిస్ అయ్యింది? భారతిని లెనిన్ పెళ్లి చేసుకున్నాడా? లెనిన్ జీవితంలోని విషాదం ఏంటి? ఎందుకు యతిరాజుని, వసంత్‌ని చంపాలనుకుంటాడు? అనేది మిగిలిన కథ.
లెనిన్ ఒక ఫక్తూ కమర్షియల్ మూవీ. మంచి డ్రామా, యాక్షన్, లవ్ స్టోరీ, ఊరి జాతర అనే సెంటిమెంట్, స్నేహం ఇలా అన్ని అంశాలను మేళవించి రూపొందించారు. అఖిల్ అక్కినేనికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని లక్ష్యంతో నాగార్జున చేసిన ప్రయత్నం `లెనిన్` మూవీ అని చెప్పొచ్చు. భారతం మిట్ట అనే జాతర బ్యాక్ డ్రాప్‌ని ఎంచుకుని దాని చుట్టూ కురుక్షేత్రం తరహా కథని రాసుకుని రూపొందించారు. జాతరకి సంబంధించిన బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉంది. ఆ తర్వాత చోటు చేసుకునే సన్నివేశాలు రెగ్యూలర్‌గానే ఉంటాయి. జాతర గొప్పతనం చెబుతూనే సినిమా స్టార్ట్ అవుతుంది. హీరో అనాథకి సంబంధించిన అంశాలు, అతని జయమ్మ చేరదీయడం, పెద్ద చేయడం, ఆమెకి నమ్మిన బంటుగా హీరో ఉండటం వంటి సన్నివేశాలు రొటీన్‌గానే ఉంటాయి. మరోవైపు హీరో జైల్ నుంచి బార్‌కి రావడం, అతన్ని చూసి చాలా మంది భయపడటం, కొందరు ఆశ్చర్యపోవడం, మరికొందరు ఆసక్తికరంగా ఎదురుచూడటం వంటి సీన్లు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తాయి. ఒక చిన్నోడుకి హీరో తన కథ చెప్పడం నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ప్రారంభంలో సీన్లు రొటీన్‌గానే ఉంటాయి. హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం, వారి లవ్ ట్రాక్ రొటీన్‌గానే ఉన్నా ఆకట్టుకుంటుంది. మరోవైపు జాతరలో బ్రహ్మాజీ పాత్రలోని కామెడీ సీన్లు ఫర్వాలేదనిపిస్తాయి. ఇంకోవైపు ధర్మరాజు పీఠం కోసం శివాజీ ప్రయత్నించడం, మరోవైపు జాతరలో తనకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే రగిలిపోవడం వంటి సీన్లతో ఆసక్తికరంగా మారుతుంది. భాగ్యశ్రీని విలన్లు ఎత్తుకుపోయినప్పుడు అఖిల్ చేసే యాక్షన్ ఆకట్టుకుంటుంది. వసంత్ కి పెళ్లి సీన్ తర్వాత నుంచి కథ సీరియస్‌గా మారుతుంది. అనేక ములపులు తీసుకుంటుంది. ఒకదాని తర్వాత మరో ట్విస్ట్ వస్తుంటుంది. ఆ ట్విస్ట్ లు ఆశ్చర్యపరుస్తుంటాయి. సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్‌లో వచ్చే మరో ట్విస్ట్ మతిపోయేలా ఉంటుంది. ఆ తర్వాత సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ బయటకు వస్తుంటుంది. ఒక్కో పాత్ర రంగులు మారుస్తుంటుంది. మంచి అనుకున్న వాళ్లు చెడుగా మారడం వంటి సీన్లు కొంత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంటాయి. సెకండాఫ్‌లో డ్రామా మరింత రక్తికడుతుంది. అదే సమయంలో యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. లెనిన్, భారతి పాత్రల్లోని ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. లెనిన్ ఎందుకు జైలుకు వెళ్లాడనేది రివీల్ అవుతుంది. తన ప్రతీకారం ఎవరి మీద అనేది తెలుస్తుంది. దీంతో సినిమా మరింత రసవత్తరంగా మారుతుంది. నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ మాత్రం గట్టిగా ప్లాన్ చేశారు. పూనకాలు తెప్పించేలా యాక్షన్ పెట్టారు. ఇలా ఫస్టాఫ్‌లో ఒకటి, ద్వితియార్థంలో మరోటి యాక్షన్ హైలైట్‌గా నిలుస్తాయి. క్లైమాక్స్ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. దీనికితోడు థమన్ బీజీఎం సినిమాని బాగా హైలైట్ చేస్తుంది.
సినిమాలో డ్రామా బాగా వర్కౌట్ అయ్యింది. ట్విస్ట్ లు బాగున్నాయి. యాక్షన్ ఎపిసోడ్లు అదిరిపోయాయి. బీజీఎం బాగుంది. మరోవైపు హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు కొంత వరకు ఆకట్టుకుంటాయి. ప్రధాన పాత్రలు రంగులు మార్చే సీన్లు, ఈ క్రమంలోని కొన్ని మలుపులు వాహ్ ఫ్యాక్టర్‌ని అందిస్తుంటాయి. విజువల్‌గా మూవీ ఆకట్టుకుంటుంది. సినిమాని అన్ని అంశాల మేళవింపుతో తెరకెక్కించడం హైలైట్‌గా చెప్పొచ్చు. కానీ చాలా వరకు రొటీన్‌గా ఉంటుంది. కథనం రెగ్యూలర్‌గానే ఉంటుంది. చాలా లాజిక్ లు మిస్ అయ్యారు. ట్విస్ట్ లు చాలా పెట్టినా అవి చాలా వరకు తేలిపోయాయి. అంతగా కిక్ ఇవ్వలేదు. దీనికితోడు ఆ ట్విస్ట్ లకు సంబంధించి ముందే హింట్ ఇవ్వడం కొంత మైనస్‌గా చెప్పొచ్చు. హీరోయిన్ పాత్రని తీసుకెళ్లిన తీరు బాగాలేదు. ఇంకా బాగా చేయాల్సింది. హీరోహీరోయిన్ల లవ్ స్టోరీని కూడా బలంగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇలాంటివి సినిమాకి మైనస్‌గా చెప్పొచ్చు. కాకపోతే కమర్షియల్ యాంగిల్‌లో సినిమాని నడిపించిన తీరు మాత్రం మాస్ లవర్స్ కి బాగా నచ్చుతుందని చెప్పొచ్చు.
లెనిన్ పాత్రలో అఖిల్ అక్కినేని చాలా బాగా నటించాడు. నటుడిగా ఆయనలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ నుంచి యాక్షన్ వరకు అదరగొట్టాడు. సినిమాని తన భుజాలపై నడిపించాడని చెప్పొచ్చు. ప్రేమకి సంబంధించిన సీన్లు, ఎమోషనల్ సీన్లు, యాక్షన్, కొంత ఫన్నీ సీన్లలోనూ అఖిల్ తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. గత చిత్రాలను మరిపించేలా ఆయన నటన ఉంది. ఇక భారతి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే ఉన్నంత సేపు మెప్పించింది. లవ్ సీన్లలో ఫర్వాలేదనిపించింది. పాటల్లో మాత్రం తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్లలోనూ కనువిందు చేసింది. ఆమె పాత్రని ఇంకా బాగా రాసుకోవాల్సింది. వసంత్ పాత్రలో ప్రమోద్ చాలా బాగా చేశాడు. తన పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి. ట్విస్ట్ కూడా బాగుంది. ఇక జయమ్మగా ఈశ్వరీరావు మరోసారి బలమైన పాత్రలో అదరగొట్టింది. యతిరాజుగా శివాజీ పాత్ర కూడా ఆకట్టుకుంది. ఆయన పాత్రలోని ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయి. ఇక మిగిలిన పాత్రలు మెప్పించాయి. ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ లేదు. ఎందుకు పెట్టారో కూడా అర్థం కాకుండా ఉంటాయి.
మ్యూజిక్ థమన్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. ఒక్క పాట తప్ప మిగిలిన సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బీజీఎం ఒక్కటి బాగుంది. అది కూడా రొటీనే కానీ, ఇందులోని యాక్షన్‌కి సెట్ అయ్యింది. యాక్షన్ సీన్లని ఎలివేట్ చేసింది. లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ బాగుంది. కనువిందుగా ఉంది. చాలా చోట్ల విజువల్స్ గ్రాండియర్ నెస్ కనిపిస్తుంది. ఎడిటర్ నవీన్ నూలి ఇంకా కొంత షార్ప్ చేయాల్సింది. కొల్లా అవినాష్ ఆర్ట్ వర్క్ బాగుంది. సినిమాకి ప్లస్ అయ్యింది. దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరి ఎంచుకున్న కథ, తీసుకెళ్లిన తీరు కొంత రొటీన్‌గానే ఉన్నా, డ్రామాని పండించడంలో, యాక్షన్‌తో ఆకట్టుకోవడంలో, ఎమోషన్స్ తో కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యాడు. అదే ఈ సినిమాకి ప్లస్‌గా చెప్పొచ్చు. మహాభారతంలోని కురుక్షేత్రంతో దీన్ని పోల్చుతూ కథని నడిపించిన తీరు బాగుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కానీ చాలా వరకు రొటీన్‌గా వెళ్లడమే మైనస్‌గా చెప్పొచ్చు.
అఖిల్‌ని కమర్షియల్‌గా నిలబెట్టే మూవీ అవుతుంది. నటుడిగానూ తనని కొత్తగా ఆవిష్కరించే చిత్రమవుతుంది. మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారికి నచ్చే చిత్రమవుతుంది. కమర్షియల్‌గా ఎలా మెప్పిస్తుందనేది ప్రశ్న.
రేటింగ్ : 2.75