
మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ల గ్యాప్ తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. చివరగా ఆయన `భోళాశంకర్` చిత్రంలో నటించారు. అది ఆడలేదు. ఆ తర్వాత ఫాంటసీ సినిమా `విశ్వంభర` చేశారు. ఇది అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో అనూహ్యంగా ఇప్పుడు `మన శంకర వర ప్రసాద్ గారు` చిత్రంతో వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఇందులో వెంకటేష్ కీలక పాత్రలో సర్‌ప్రైజ్ చేయబోతుండటం విశేషం. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఈ నెల 12న సోమవారం ఈ మూవీ విడుదలయ్యింది. ముందుగా మీడియాకి ప్రదర్శించారు. గతేడాది `సంక్రాంతికి వస్తున్నాం`తో బ్లాక్ బస్టర్ కొట్టాడు అనిల్ రావిపూడి. వెంకటేష్‌కి కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అలాంటి హిట్ ఇచ్చాడా? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం.
కేంద్ర మంత్రి నితిన్ శర్మ(శరత్ సక్సేనా)కి ఒకడు ఫోన్ చేసి బెదిరిస్తాడు. బర్త్ డే రోజు నీ డెత్ డే అంటాడు. ఆ విలన్ నుంచి కాపాడమని నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకరవరప్రసాద్(చిరంజీవి) టీమ్‌ని వేడుకుంటాడు మంత్రి. ప్రసాద్ టీమ్ మంత్రి రక్షణ బాధ్యతలు తీసుకుని ఆయన్ని కాపాడతాడు. అయితే మంత్రి హ్యాపీగా బర్త్ డే చేసుకుంటుండగా, ప్రసాద్ బాధపడుతుంటాడు. ఎందుకు అలా డల్‌గా ఉన్నావని మంత్రి అడగ్గా తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇండియాలోనే బిగ్గెస్ బిజినెస్ ఉమెన్ శశిరేఖ(నయనతార) తన భార్య అని, ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. పెళ్లైన మూడేళ్లకి విడిపోయినట్టు చెబుతాడు. తన మామ, శశిరేఖ తండ్రి(సచిన్ ఖేడ్కర్)తమని విడదీశాడని చెప్పి ఆవేదన చెందుతాడు. మళ్లీ తన పిల్లల్ని కలవాలని, భార్య పిల్లలతో ఉండాలని అనిపిస్తుందని మంత్రి వద్ద బాధపడుతుంటాడు ప్రసాద్. ఆయన వద్ద వారం రోజులు లీవ్ తీసుకుని పిల్లల్ని కలిసేందుకు వారు చదువుకునే స్కూల్‌కి పీఈటీ టీచర్‌గా వెళ్తాడు. కానీ పిల్లల వద్ద మొదట బ్యాడ్ అవుతాడు. ఆ తర్వాత ఫస్ట్ కొడుకుకి దగ్గరవుతాడు, ఆ తర్వాత కూతురుకి దగ్గరవుతాడు. ఇద్దరూ పీఈటీ టీచర్ ప్రసాద్‌ని బాగా లైక్ చేస్తారు. క్లోజ్ అవుతారు. అమ్మకి కూడా టైమ్ ఇవ్వకుండా టీచర్‌తోనే ఉంటారు.
డౌట్ వచ్చి శశిరేఖ నాన్నతో కలిసి సడెన్‌గా స్కూల్‌కి వస్తుంది. అక్కడ వాళ్లకి ప్రసాద్ అడ్డంగా దొరికిపోతాడు. వారిద్దరు ప్రసాద్‌కి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతున్న సమయంలో శశిరేఖ తండ్రిపై కొందరు దుండగులు ఎటాక్ చేస్తారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నేషనల్ సెక్యూరిటీ టీమ్‌ని సెక్యూరిటీగా రావాలని కోరగా ప్రసాద్ టీమ్‌ని శశిరేఖ కుటుంబానికి సెక్యూరిటీగా పంపిస్తారు. మరి తన మాజీ భార్యకి సెక్యూరిటీగా వచ్చిన ప్రసాద్ ఆమెకి ఎలా దగ్గరయ్యాడు? ఇంతకి ఈ ఇద్దరు ఎలా కలిశారు, ఎలా పెళ్లి చేసుకున్నారు? ఎలా విడిపోయారు? మాజీ భార్య ఇంట్లో సెక్యూరిటీ పేరుతో ప్రసాద్ చేసిన రచ్చ ఏంటి? ఇందులోకి కర్నాటకలో పెద్ద బిజినెస్ మేన్ అయిన వెంకీ గౌడ(వెంకటేష్) ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? ఆయనకు, ప్రసాద్ కి మధ్య గొడవేంటి? శశిరేఖ ఫ్యామిలీపై ఎటాక్ చేసింది ఎవరు? చివరికి శశిరేఖ, ప్రసాద్ మళ్లీ కలిశారా? లేదా? అనంతరం ఏం జరిగిందనేది మిగిలిన సినిమా.
దర్శకుడు అనిల్ రావిపూడి ఫెయిల్యూర్ లేకుండా, అత్యంత సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన చిత్రాల్లో కథ కంటే ఎంటర్‌టైన్‌మెంటే ఎక్కువగా ఉంటుంది. వినోదం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. కానీ కథగా చూసినప్పుడు ఏమీ ఉండదు. స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేస్తాడు. చూస్తున్నంత సేపు నవ్వులు పూయిస్తాడు. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయడంలో సక్సెస్ అవుతూ, వరుసగా విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు చిరంజీవితో చేసిన `మన శంకర వరప్రసాద్ గారు` విషయంలోనూ అదే చేశాడు. సీన్ బై సీన్ కామెడీ ఎపిసోడ్లని పేర్చుకుంటూ వెళ్లాడు. ఎక్కడా డౌన్ కాకుండా చూసుకున్నారు. డల్ అవుతున్న సమయంలో మంచి కామెడీ బ్లాక్‌ని వేసి నవ్వులు పూయించాడు. అయితే ఇలాంటి సినిమాలకు ఆయా సీన్లు పండితేనే కామెడీ వర్కౌట్ అవుతుంది. లేదంటే చాలా దారుణంగా తేడా కొడుతుంది. కామెడీ ఎంత వరకు వర్కౌట్ అయ్యిందనేది ఇందులో చాలా ముఖ్యం. అదే దర్శకుడికి కత్తిమీద సాము లాంటిది. ఆ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కథ కంటే స్క్రీన్‌ప్లే పై బాగా ఫోకస్ పెట్టాడు. కామెడీ పార్ట్ ని బాగా రాసుకున్నాడు. దానికి చిరంజీవి యాడ్ అయ్యారు. చిరంజీవిలోని పూర్తి కామెడీ టైమింగ్‌ని, ఫన్ యాంగిల్‌ని, స్టయిల్‌ని, యాక్షన్‌ని ఇందులో గట్టిగా వాడుకున్నాడు అనిల్. దీంతో ఆయా సీన్లు బాగా ఎలివేట్ అయ్యాయి. తెరపై బాగా వర్కౌట్ అయ్యాయి.
సినిమాగా చూసినప్పుడు ఫస్ట్ చిరంజీవిని సింపుల్‌గా పరిచయం చేసి, మంత్రిని రక్షించే టైమ్‌లో యాక్షన్ ఎపిసోడ్ పెట్టి, మెగాస్టార్‌కి అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు. అక్కడ విజిల్స్ పడతాయి. ఒకప్పుడు తానేంటో అందరికి తెలుసు. ఇప్పుడు పిల్లబచ్చాలకు తానేంటో చూపిస్తాను అంటూ డైలాగ్ కొడుతూ చిరంజీవి చేసే రచ్చ అదిరిపోయింది. టీవీ సీరియల్ చూస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, దాన్ని తన లైఫ్‌కి ఆపాదించుకోవడం, ఆవేదన చెందడం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత మంత్రి వద్ద చేసే రచ్చ, అంతలోనే పడిపోవడం, ఆ గ్యాప్‌లోనే రెచ్చిపోవడం ఇలా ఎపిసోడ్లని పర్‌ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నారు. దీంతో ఆయా సీన్లు అదిరిపోయాయి. అనంతరం హీరోయిన్ ని కలిసే సీన్లు, వీరి మధ్య మూగ సందేశం కూడా ఆకట్టుకుంది. డిఫరెంట్‌గా ఉంది. పెళ్లి చేసుకోవడం, అంతలోనే గొడవలు స్టార్ట్ కావడం, విడిపోవడం చకాచకా జరిగిపోతుంటాయి. ఎక్కడా గ్యాప్ లేకుండా సీన్లని హిలేరియస్‌గా నడిపించాడు దర్శకుడు. చిరంజీవి ఛాన్స్ దొరికినప్పుడు తన డైలాగ్‌లతో రెచ్చిపోయాడు. డైలాగ్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. దీనికి చిరంజీవి యాక్టింగ్ తోడు కావడంతో మరింతగా కామెడీ పండింది. స్కూల్‌లో పిల్లలకు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలు బెడిసి కొట్టడం, ఆ తర్వాత వర్కౌట్ కావడం నవ్విస్తుంది. ఇందులో బుల్లిరాజు ఎపిసోడ్ కూడా బాగా ఆకట్టుకుంటుంది.
ఫస్టాఫ్ వరకు ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్లతో అలరించారు. ఇంటర్వెల్ యాక్షన్ సీన్ అదిరిపోయింది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్ కూడా విజిల్స్ వేసేలా ఉంటుంది. ఫస్టాఫ్ వరకు ఎక్కడా తగ్గకుండా నడుస్తుంది. కానీ సెకండాఫ్ తర్వాత క్రమంగా డౌన్ అయ్యింది. ఆ తర్వాత సినిమా అంతా శశిరేఖ ఇంటికి వెళ్తుంది. అది గతంలో వచ్చిన రొటీన్ ఫ్యామిలీ డ్రామాలా నడుస్తుంది. భార్యని ఇంప్రెస్ చేయడానికి చిరంజీవి పడే పాట్లు రొటీన్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడ ఫన్ వర్కౌట్ అయ్యింది. కానీ ఆ ఫస్టాఫ్ స్థాయిలో లేదు. ఇన్వెస్టిగేషన్ పేరుతో చేసే డ్రామా కూడా బోరింగ్‌గా అనిపిస్తుంది. సినిమా డల్ అవుతున్న సమయంలో వెంకటేష్ దిగుతాడు. ఆ తర్వాత సినిమా లేస్తుందని భావించగా, అది మరింతగా డల్ చేసింది. ఆ ఎపిసోడ్ ఆశించిన స్థాయిలో లేదు. కాకపోతే చిరంజీవి, వెంకీ అభిమానులు మాత్రం ఆయా సీన్లని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే వెంకీ ఎపిసోడ్‌ని బలవంతంగానే ఇరికించినట్టుగా ఉంది. సెకండాఫ్ మొత్తం ఊహించినట్టుగానే వెళ్తుంది. అక్కడ కూడా సేమ్ కామెడీ సీన్లు పెట్టుకోవడంతో ఆ కిక్ మిస్ అయ్యింది. చివర్లో యాక్షన్ సీన్ తో రెగ్యూలర్‌గానే ముగించాడు. విలన్ పాత్ర చాలా వీక్‌గా ఉంది. దీంతో చివర్లో యాక్షన్ అంతగా కిక్ ఇవ్వలేదు. ఫస్టాఫ్ లాగా సెకండాఫ్‌ని కూడా వర్కౌట్ చేస్తే, క్లైమాక్స్ ని బాగా చేయగలిగితే సినిమా ఇంకా వేరే లెవల్‌లో ఉండేది. వెంకీ ఎపిసోడ్‌ని కూడా బాగా డిజైన్ చేయాల్సింది. అయితే ఓ వైపు కామెడీ, మరోవైపు ఫ్యామిలీ ఎలిమెంట్లు, భార్యతో గొడవలు, పిల్లల సెంటిమెంట్, యాక్షన్, వెంకీ సర్‌ప్రైజ్‌లతో మంచి ఫ్యాకేజీ ఫిల్మ్ గా ఇది సాగుతుంది. ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసేలా డిజైన్ చేశారు. అదే ఈ సినిమాకి పెద్ద అసెట్‌గా చెప్పొచ్చు.
నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా చిరంజీవి నటన అదిరిపోయింది. వింటేజ్ మెగాస్టార్‌ని ఇందులో చూడొచ్చు. ఆయన కామెడీ సినిమాకి మరో ఎట్రాక్షన్. తన నెక్ట్స్ లెవల్ చూపించాడని చెప్పొచ్చు. డాన్సుల్లో ఆ గ్రేస్ చూస్తే ఆశ్చరపోతారు. ర్యాప్ సాంగ్‌లో ర్యాంప్ ఆడించారు. చిరంజీవి ఇప్పటి వరకు 156 సినిమాలు చేసినా, ఇంత ఫ్రీగా, ఓపెన్ అయి నటించడం ఇదే అని చెప్పొచ్చు. దర్శకుడు అనిల్ రావిపూడి చిరులో అన్ని యాంగిల్స్ ని పర్‌ఫెక్ట్ గా వాడుకున్నాడు. చిరు కామెడీ, డాన్సులు, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్నీ నేచురల్‌గా కుదిరాయి. ఆయన కూడా అంతే నేచురల్‌గా చేశారు. అది సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లాయి. ఇక నయనతార గ్లామర్, యాటిట్యూడ్ సినిమాకి మరో ఎట్రాక్షన్. చిరు భార్య శశిరేఖగా డామినేటింగ్ పాత్రలో అదరగొట్టింది. ఇక క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు వెంకటేష్. ఆయన, చిరంజీవి మధ్య ఎపిసోడ్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది. మాస్ ఆడియెన్స్ కి బాగా ఎక్కుతుంది. ఇక బుల్లిరాజు మరోసారి ఇందులో అదరగొట్టారు. పిల్లలు కూడా చాలా బాగా చేశారు. కేంద్ర మంత్రిగా శరత్ సక్సేనా నటన ఉన్నంత సేపు అలరిస్తుంది. హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడ్కర్ యాప్ట్ అయిన పాత్రలో ఒదిగిపోయాడు. నవ్వించాడు. చిరంజీవి టీమ్‌గా అభినవ్ గోమటం, కేథరిన్ థ్రేస్సా, విష్ణు వర్థన్ సైతం నవ్వించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి.
సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం మరో అసెట్‌గా చెప్పొచ్చు. పాటలు మంచి హుషారుగా, డాన్సులు వేసేలా ఉన్నాయి. మాస్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. చిన్న చిన్న బిట్ సాంగ్‌లు తేడా కొట్టినా, అదరగొట్టారు. వెంకటేష్‌తో పాట ఊపు తెచ్చేలా ఉంది. కానీ ఆ స్థాయిలో పాట లిరిక్ లేదు. చాలా తేలిపోయింది. డాన్సులు ఆకట్టుకున్నాయి. బిజీఎం విషయంలో మ్యాజిక్ చేశారు. సినిమాని అది మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక సమీర్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా, ట్రీట్‌లాగా ఉంది. కనువిందుగా ఉంది. దీనికి ఆర్ట్ వర్క్ కూడా తోడయ్యింది. ఏఎస్ ప్రకాష్ తన టాలెంట్ కనిపిస్తుంది. ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. ఎక్కడా డిస్టర్బ్ లేకుండా కథ నడుస్తుంది. అయితే సెకండాఫ్‌లో ఓ ఐదు, పది నిమిషాలు కట్ చేసినా నష్టం లేదు. క్రిస్పీగా, షాట్ అండ్ స్వీట్‌గా ఉండేది. నిర్మాణ విలువలకు కొదవలేదు. చాలా రిచ్‌గా, రాజీపడకుండా నిర్మించారు. అది ప్రతి ఫ్రేములోనూ ఆ రిచ్‌నెస్ కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చేసే మ్యాజిక్ గురించి అందరికి తెలిసిందే. ఇందులోనూ ఆయన మరోసారి ఆ మ్యాజిక్ వర్కౌట్ చేశారు. అయితే సినిమాకి సంబంధించిన కంటెంట్‌ని పెద్దగా బయటకు విడుదల చేయలేదు. టీజర్, ట్రైలర్‌లో చూపించింది చాలా తక్కువ. దీంతో సినిమాలో చాలా ఎపిసోడ్‌లు సర్‌ప్రైజింగ్‌గా ఫీలవుతారు. అదే సమయంలో కామెడీని పర్‌ఫెక్ట్ మీటర్‌లో రాసుకున్నాడు. రొటీన్ కామెడీ, రొటీన్ స్టోరీనే అయినా, సందర్భానుసారంగా దాన్ని వర్కౌట్ చేశాడు. చిరంజీవి దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్లారు. దీంతో అవి బాగా పండాయి. అలరించాయి. అన్ని ఎలిమెంట్లని పర్‌ఫెక్ట్ గా మేళవించడంలో అనిల్ సక్సెస్ అయ్యాడు. అది రిజల్ట్ లో కనిపిస్తుంది. మొత్తంగా దర్శకుడు తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి సక్సెస్ అయ్యాడు.
ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. చిరంజీవి, వెంకటేష్ అభిమానులు మాత్రం ఊగిపోతారు.
రేటింగ్ 3