The Raja Saab Movie Review: ది రాజా సాబ్ మూవీ రివ్యూ, రేటింగ్.. ప్రభాస్‌ ఇలా చేశాడేంటి?

Published : Jan 09, 2026, 06:46 AM IST

The Raja Saab Movie Review: ప్రభాస్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `ది రాజాసాబ్‌`. మారుతి దర్శకత్వంలో ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి ప్రభాస్‌ కి హ్యాట్రిక్‌ హిట్‌ పడిందా? 

PREV
17
ది రాజా సాబ్ మూవీ రివ్యూ

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ `సలార్‌`, `కల్కి 2898ఏడీ`తో బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్స్ అందుకున్నారు. అయితే ఇటీవల వరుస యాక్షన్ మూవీస్‌ చేస్తున్న క్రమంలో ఆయన జోనర్‌ మార్చారు. మంచి కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చేయాలని చెప్పి ఇప్పుడు `ది రాజాసాబ్‌` మూవీ చేశారు. ప్రభాస్‌ యాక్షన్‌ సినిమాలతో మెప్పించారు. కానీ ఆయన హర్రర్‌ సినిమా చేయడం దీని ప్రత్యేకత. ఇదే ఇప్పుడు సినిమాపై అంచనాలు ఏర్పడటానికి కారణమయ్యిందని చెప్పొచ్చు. ఫాంటసీ హర్రర్ కామెడీగా దీన్ని రూపొందించారు దర్శకుడు మారుతి. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ నేడు శుక్రవారం(జనవరి 9)న విడుదలైంది. సంక్రాంతి పండగ సందర్భంగా పండగని ముందుగానే తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరి ఆ పండగని తీసుకురావడంతో ప్రభాస్‌ సక్సెస్‌ అయ్యారా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీని మీడియా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమా ఎలా అనిపించిందనేది రివ్యూలో చూద్దాం.

27
ది రాజా సాబ్‌ మూవీ కథ ఇదే

రాజు(ప్రభాస్‌)కి అమ్మనాన్న లేరు. తన నానమ్మ గంగవ్వ(జరీనా వాహబ్‌)నే ప్రాణంగా బతుకుతుంటాడు. నానమ్మకు తను, తనకు నానమ్మనే అన్నీ. వీరికి అనిత(రిద్ధి కుమార్‌) సపోర్ట్ చేస్తుంటుంది. అయితే నాన్నమ్మకి కొన్ని ఏళ్లుగా తన భర్త కనకరాజు(సంజయ్‌ దత్‌) కోసం వెతుకుతుంటుంది. ఆయన కొన్నేళ్ల క్రితం తన సంపదని దోచుకొని వెళ్లిన గంగరాజు(సముద్రఖని)ని పట్టుకునేందుకు వెళ్తాడు. మళ్లీ తిరిగిరాడు. దీంతో తన భర్త కోసం ఆమె ఎంతో తపిస్తుంది. ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తూ మతిమరుపు కూడా తెచ్చుకుంటుంది. తాతని వెతికి తీసుకురమ్మని మనవడు రాజుని కోరుతుంది. హైదరాబాద్‌లో కనకరాజు ఉన్నాడని తెలిసి రాజు వెతకడానికి వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తాడు. అక్కడ క్రిస్టియన్‌ అమ్మాయి బ్రెస్సీ(నిధి అగర్వాల్‌)ని చూసి ఫిదా అవుతాడు. చర్చ్‌లో ఓ పాప హార్ట్ ఆపరేషన్‌ కోసం మూడు లక్షలు కూడా ఇస్తాడు. కానీ ఆ డబ్బుని కనకరాజు కాజేశాడని బ్రెస్సీ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అ సమయంలోనే గంగరాజు మనవరాలు భైరవి(మాళవిక మోహనన్‌) సూట్‌ కేసులో భారీగా డబ్బుతో ఎంట్రీ ఇస్తుంది. వీరంతా కలిసి గురించి వెతకగా ఆయన నరసాపూర్‌ ఫారెస్ట్ లో ఒక కోటలో ఉంటున్నాడని గంగరాజు ద్వారా తెలుస్తుంది. తన పోలీస్ బాబాయ్ (వీటీవీ గణేష్‌), స్నేహితుడు ప్రభాస్‌ శ్రీను(ఒరిజినల్ పేరే), భైరవిని తీసుకుని ఆ కోటలోకి వెళ్తారు. మరి అక్కడ రాజు తన తాతని కలిశాడా? తన నానమ్మ కోరిక తీర్చాడా? ఆ కోటలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అందులో ఉన్న దెయ్యం ఎవరు? కనకరాజుకి డబ్బు అంటే ఎందుకంత పిచ్చి? ఇంతకి అతని వెనుకున్న కథేంటి? దేవనగరి సామ్రాజ్యం జమిందారిణి గంగాదేవి కథేంటి? ఆమె గంగవ్వగా ఎలా మారింది? దేవనగరి సామ్రాజ్యంలోని సంపదనంతా దొంగిలించింది ఎవరు? దీనికి గంగరాజుకి ఉన్న సంబంధమేంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే సినిమా.

37
ది రాజా సాబ్‌ మూవీ ఎలా ఉందంటే?

హర్రర్‌ కామెడీ చిత్రాలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రభాస్‌ మొదటిసారి ఈ జోనర్‌ మూవీ చేయడం, ఫాంటసీ ఎలిమెంట్లు, రొమాన్స్ మేళవించడం, పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌గా దీన్ని రూపొందించడం ఈ మూవీ స్పెషాలిటీ. దీనికితోడు చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌ ఇందులో కామెడీ చేయడం విశేషం. ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా అంటే ఆ విషయంలో ఆలోచించాల్సిందే. చాలా వరకు డిజప్పాయింట్‌ చేసిందని చెప్పొచ్చు. అయితే టెక్నీకల్‌గా ఈ మూవీ చాలా బాగుంది. ఎంచుకున్న కథ  కొత్తగా బాగుంది. ఇలాంటి కథతో సినిమాలు రాలేదని చెప్పొచ్చు. అంతేకాదు ఇందులో మెయిన్‌ ప్లాట్‌ని చూపించిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. ఎంగేజింగ్‌గా ఉంటుంది. సినిమా ఫాంటసీ హర్రర్‌ కామెడీ అన్నారు, కానీ ఎక్కువగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి. అవే సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. 

సినిమా ఫస్టాఫ్‌లో సరదాగా సాగిపోతుంది. ప్రారంభంలో సంజయ్ దత్ పాత్రని పరిచయం చేయడం, బ్యాక్‌ స్టోరీని కాస్త రివీల్ చేయడంతో క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది. హర్రర్‌ ఎలిమెంట్లు భయపెట్టిస్తాయి. ఆ తర్వాత ఓ ఊర్లో ప్రభాస్‌ తన నాన్నమ్మతో ఉండటం, ఆమె కనకరాజు కోసం వెయిట్‌ చేయడం, తాత కోసం వెతకడం వంటి సన్నివేశాలతో సాగుతుంది. అందులోనే ముగ్గురు హీరోయిన్లని పరిచయం చేసి, గ్లామర్‌ సైడ్‌ వాళ్ల ప్రతాపం చూపించి ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రభాస్‌ ప్రారంభం నుంచి అడుగడుగునా కామెడీ చేశారు. కోటలోకి వెళ్లేంత వరకు కథ కాస్త స్లోగా సాగుతున్నట్టుగా ఉంటుంది. అందులోకి వెళ్లాక వచ్చే సన్నివేశాలు కొంత వరకు ఎంగేజ్‌ చేస్తాయి. మరికొంత రెగ్యూలర్ ఫీలింగ్‌ని తెస్తాయి. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ మాత్రం ఎంగేజింగ్‌గా, ఆసక్తికరంగా సాగుతుంది. వాహ్‌ అనిపిస్తుంది. సెకండాఫ్‌ మొత్తం కోటలోనే సాగుతుంది. కోటలోకి వెళ్లాక, అందులో నుంచి బయటపడేందుకు వాళ్లు పడే తిప్పలు, మాళవికతో ప్రభాస్‌ రొమాన్స్, ఆ తర్వాత నిధి కూడా రావడం ఆమెతోనూ రొమాన్స్, చివరికి రిద్ధి కూడా వస్తుంది. ఇలా ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్‌ నలిగిపోయే సన్నివేశాలు కొంత వరకే నవ్వులు పూయిస్తాయి. చాలా వరకు ఇరిటేట్‌ తెప్తిస్తాయి. అవి బలవంతంగా ఇరికించినట్టుగా ఉంటాయి. 

ఫస్టాఫ్‌లో కామెడీ అంతగా వర్కౌట్‌ కాలేదు. కానీ సెకండాఫ్‌లో కాస్త నవ్వించింది. మెప్పించింది. సైకలాజికల్‌ అంశాలు చూపించిన తీరు బాగున్నాయి. అవి కొత్తగా ఉన్నాయి. ఎంగేజ్‌ చేసేలా ఉన్నాయి. మన మైండ్‌కి పదును పెట్టేలా వస్తుంది. క్లైమాక్స్ ని బాగా డీల్‌ చేశారు. వేరే లెవల్‌ అనేలా ఉంటుంది. మొత్తానికి క్లైమాక్స్ తో బాగానే హడావుడి చేశారు. పార్ట్ 2కి కూడా లీడ్‌ ఇవ్వడం విశేషం. ఓవరాల్‌గా మూవీలో ఫస్టాఫ్‌లో స్లోగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ కొంత కవర్‌ చేశారు. అయితే చాలా చోట్ల కామెడీ సీన్లు తేలిపోయాయి. ఫస్టాఫ్‌లో ఏమాత్రం వర్కౌట్‌ కాలేదు. ఇరికించినట్టుగానే ఉన్నాయి. చాలా లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. ఎంత సేపు అక్కడక్కడే తిరుగుతుంటుంది. ముందుకు కదలదు. అదే సమయంలో లవ్ ఎపిసోడ్లు కూడా కనెక్ట్ అయ్యేలా లేవు.  సెకండాఫ్‌లో కొంత కామెడీ, క్లైమాక్సే సినిమాకి ప్రధాన బలంగా చెప్పొచ్చు.

47
ది రాజా సాబ్‌లోని నటీనటుల పర్‌ఫెర్మెన్స్

రాజా పాత్రలో ప్రభాస్‌ ఇరగదీశాడు. కొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. ఫన్నీగా కనిపించింది మెప్పించాడు. ఓపెన్‌ అయి నటించి అలరించారు. ఆయనకిది మంచి ఛేంజోవర్‌ అవుతుందని చెప్పుచ్చు. డాన్సుల్లోనూ ఇరగదీశాడు ప్రభాస్‌. హీరోయిన్లు ముగ్గురు గ్లామర్‌తో మెప్పించారు. ఆయన్ని కూడా ఆడుకున్నారని చెప్పొచ్చు. భైరవిగా మాళవిక, బ్లెస్సీగా నిధి, అనిత్‌గా రిద్ధి చాలా బాగా చేశారు. గ్లామర్‌ విషయంలో వాళ్లు సక్సెస్‌ అయ్యారు. సత్య కామెడీ నవ్విస్తుంది. అలాగే వీటీవీ గణేష్‌, ప్రభాస్‌ శ్రీను పోటీ పడి నవ్వించే ప్రయత్నం చేశారు. సప్తగిరి కూడా కాసేపు ఆకట్టుకున్నారు. గంగరాజుగా సముద్రఖని కాసేపు మెరిశారు. నానమ్మగా జరీనా వాహబ్‌ చాలా బాగా చేశారు. పాత్రలో జీవించారు. ఇక కనకరాజుగా సంజయ్‌ దత్‌ విశ్వరూపం చూపించారు. సెటిల్డ్ గా చేసి మెప్పించారు. అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నారు. ఎవరు ఎలాచేసినా ప్రభాస్‌ అందరిని డామినేట్‌ చేశాడని చెప్పొచ్చు.

57
`ది రాజా సాబ్‌` టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

ఈ సినిమాకి మ్యూజిక్‌ పెద్ద అసెట్‌. పాటలు కొంత వరకు ఫర్వాలేదు. కానీ వాటికి లాంగ్‌ రన్‌ లేదు. బిజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాకి బ్యాక్‌ బోన్‌గా నిలిచింది. క్లైమాక్స్ లో బీజీఎం వాహ్‌ అనేలా ఉంది. కార్తీక్‌ ఫలనీ కెమెరా వర్క్ బాగుంది. వీఎఫ్‌ఎక్స్ స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్‌ తేలిపోయింది. ఇంకా ట్రిమ్‌ చేయాల్సింది. ఇక ఆర్ట్ స్పెషల్‌ హైలైట్‌. దర్శకుడు మారుతి ఎంచుకున్న కథ బాగుంది. కొత్త పాయింట్‌ చెప్పాలనుకున్నారు. కానీ దాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో కొంత వరకే సక్సెస్‌ అయ్యాడు. విజువల్ గ్రాండియర్‌ని అందించాడు. స్క్రీన్‌ పరంగా మరింత కేర్‌ తీసుకోవాల్సింది. మరింత గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది.  కామెడీపై బాగా వర్క్ చేయాల్సింది. ప్రభాస్‌ పాత్రని బాగా మలిచాడు. బాగా చూపించాడు. సెకండాఫ్‌లో కామెడీ వర్కౌట్‌ చేశాడు. కానీ ఫస్టాఫ్‌లో ఆ లోటు కనిపిస్తుంది. క్లైమాక్స్ ని మరింత అర్థవంతంగా, మరింత గ్రిప్పింగ్‌గా, గూస్‌ బంమ్స్ తెప్పించేలా చేస్తే సినిమా అదిరిపోయేది.

67
ది రాజా సాబ్‌ మూవీలోని ప్లస్‌ లు, మైనస్‌ లు

సినిమాలో ప్రభాస్‌ కొత్త లుక్‌, ఆయన కామెడీ, రొమాన్స్, ముగ్గురు హీరోయిన్ల మధ్య నలిగిపోయే సీన్లు బాగున్నాయి.  డాన్సులు కూడా బాగా చేశాడు. బిజీఎం అదిరిపోయింది. విజువల్స్ బాగున్నాయి. వీఎఫ్‌ఎక్స్ ఆకట్టుకునేలా ఉంది. నటీనటులు బాగా చేశారు. హర్రర్‌ ఎపిసోడ్‌, సైకలాజికల్‌ అంశాలు ఫర్వాలేదు. ఇంటర్వెల్‌, సెకండాఫ్‌లో కొంత కామెడీ, క్లైమాక్స్ ప్లస్‌గా చెప్పొచ్చు.

మైనస్‌ లు

ఫస్టాఫ్‌, చాలా ల్యాగ్‌ సీన్లు, చాలా వరకు కామెడీ వర్కౌట్‌ కాలేదు. అందులోనూ చాలా  రొటీన్‌ సీన్లు. ఇరికించిన లవ్‌ ట్రాక్‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్‌ ప్లే, రొటీన్‌ డైలాగ్‌లు మైనస్‌గా చెప్పొచ్చు. దీనికితోడు నిడివి కూడా మైనస్‌. 

77
ఫైనల్‌ నోట్‌

 ప్రభాస్‌ `ది రాజా సాబ్‌` నవ్వులు, భయం కొంత వరకే పరిమితం. 

రేటింగ్‌ 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories