Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌

Published : Dec 19, 2025, 04:59 PM IST

Avatar 3 Movie Review: `అవతార్‌` సినిమాలు ప్రపంచ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా `అవతార్‌ 3` మూవీ వచ్చింది. మరి ఇది మన ఆడియెన్స్ ఆకట్టుకుందా అనేది తెలుసుకుందాం. 

PREV
15
అవతార్‌ 3 మూవీ రివ్యూ

ప్రపంచ సినిమాలో అతిపెద్ద మూవీ సిరీస్‌గా `అవతార్‌` చిత్రాలను చెబుతారు. `అవతార్‌` మొదటి పార్ట్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌ దీన్ని రూపొందించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ చూసి ఎంజాయ్‌ చేశారు.  దీంతో ఈ చిత్రాలకు విశేషమైన క్రేజ్‌ ఉంది. `అవతార్‌` నుంచి ఐదు మూవీస్‌ తీయబోతున్నట్టు అప్పట్లోనే ప్రకటించారు. ఆ తర్వాత `అవతార్‌ 2 (ది వే ఆఫ్‌ వాటర్‌) మూడేళ్ల క్రితం విడుదలైంది. ఇది బాగానే ఆడింది. కాకపోతే మొదటి పార్ట్ అంతగా మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు `అవతార్‌ 3 ఫైర్‌ అండ్‌ యాష్‌` ని రూపొందించారు జేమ్స్ కామెరూన్‌. ఈ చిత్రం నేడు శుక్రవారం(డిసెంబర్‌ 19)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా మొదటి భాగం తరహాలో మెప్పించిందా, రెండో భాగం కంటే బెటర్‌గా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

25
అవతార్‌ 3 మూవీ కథ

`అవతార్‌ 2` కథకి కొనసాగింపుగా ఈ మూవీ కథ సాగుతుంది. జేక్‌ సల్లీ(సామ్‌ వర్తింగ్టన్‌), నేతిరి(జో సల్దానా) తమ కుమారుడు నెతియమ్‌ మరణంతో తీవ్రవిషాదంలో ఉంటారు. ఆ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతుంటారు. తమ పిల్లలు కిరి(సిగౌర్నీ వీవర్‌), లోక్‌(బ్రిటన్‌ డాల్టన్‌), టుక్‌(ట్రినిటీ జో లి బ్లిస్‌)లతో కలిసి సేఫ్‌గా జీవితాన్ని సాగిస్తుంటారు. అయితే లోక్ మాత్రం తనవల్లే సోదరుడు చనిపోయాడనే బాధలో ఉంటాడు. రెండో పార్ట్ లో మరణించిన కల్నల్‌ క్వారిచ్‌(స్టీఫెన్‌ లాంగ్‌) మళ్లీ బతికి వస్తాడు. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ జీవం పోసుకొని సల్లీ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అందుకోసం అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్‌(ఊనా చాప్లిన్‌)తో కలుస్తాడు. వారి సపోర్ట్ తీసుకుని పండోరా గ్రహంలోని సల్లీ తెగని నాశనం చేయాలని భావిస్తాడు. అందులో భాగంగా జేక్‌ని పట్టుకుని తీసుకెళ్తారు. ఆర్డీఏ క్యాంప్‌లో ఉంచి వారి రహస్యాలను కనిపెట్టే పనిలో ఉంటారు. వారి అంతానికి ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో ఆర్డీఏ బలగాల నుంచి జేక్‌ ఎలా బయటపడ్డాడు, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆయన ఎలాంటి పోరాటం చేశారు? వీరికి అండగా నిలిచింది ఎవరు? వరంగ్‌ ఎందుకు ఈవా దేవతపై కోపంతో రగిలిపోతుంటుంది? చివరికి ఏం జరిగిందనేది కథ.

35
అవతార్‌ 3 మూవీ ఎలా ఉందంటే?

జేక్‌ తమ పండోర గ్రహంపై ఉన్న తెగలను, తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు, తమ మనుగడ కోసం చేసిన పోరాటమే ఈ మూవీ. అయితే సినిమా రెండో పార్ట్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా సేమ్‌ అలానే ఉంది. కొంతగా అగ్ని తెగని ఇందులోకి తీసుకొచ్చారు. అది తప్పితే, అక్కడ, ఇక్కడ అదే జర్నీ. అదే యుద్ధం, మనుగడ కోసం వాళ్లు అదే తరహాలో యుద్ధం చేస్తుంటారు. అయితే ఇందులో యాక్షన్‌ కంటే ఎమోషన్స్ కి ప్రయారిటీ ఇచ్చారు జేమ్స్ కామెరూన్‌. డిటెయిల్‌ ఎమోషన్స్ ని ప్రతిబింబించాలనే తాపత్రయం కనిపించింది. కథనం చాలా స్లోగా సాగుతుంది. రిలేషన్స్ కి ప్రయారిటీ ఇవ్వడం, మరో తెగతో పోరాటం చేయడం, ఈ క్రమంలో రిస్క్ లో పడటానికి సంబంధించిన డ్రామా కొంత వరకు బాగానే ఉంది. కానీ బాగా సాగాదీయడంతో ఆ ఎమోషన్స్ కూడా తేలిపోయాయి. సెకండాఫ్‌లో కూడా అదే తరహాలో సాగింది. మధ్యలో జేక్‌ని కాపాడేందుకు చేసిన పోరాటం బాగుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. ఎండింగ్‌లో యాక్షన్‌తోపాటు అందులో ఎమోషన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. ఈ సినిమా మొత్తంలో  అదొక్కటే ఫర్వాలేదనిపిస్తుంది. అయితే కిరి తరచూ గ్రేట్‌ మదర్‌ కోసం ప్రే చేయడం అనేది బాగా ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో ఆ గ్రేట్‌ మదర్‌ని కొన్ని సెకన్లపాటు చూపించిన తీరు బాగుంది. వాహ్‌ అనిపించింది. కానీ ఆయా సీన్లని మరింతగా ఎలివేట్‌ చేసి, దానిపై ఫోకస్‌ పెడితే నిజంగా సినిమా అదిరిపోయింది. ప్రారంభం నుంచి స్లోగా సాగినా, అది కవర్‌ చేసేది. కానీ జస్ట్ అలా చూపించి వదిలేశారు. దీంతో డిజప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఒక్కటే సినిమాకి బలంగా చెప్పొచ్చు. టెక్నీకల్‌గా చూస్తే సినిమా విజువల్స్ పరంగా కనువిందు చేస్తుంది. ఈ సినిమాలు మెయిన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసమే చూడొచ్చు అనేలా ఉంటాయి. అయితే రెండో పార్ట్ తో పోల్చితే కొత్తగా, గొప్పగా లేకపోవడం గమనార్హం. బీజీఎం బాగుంది. ఆ డోస్‌ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. ఎడిటింగ్‌ పరంగా ఓ గంట సినిమా ట్రిమ్‌ చేసినా నష్టం లేదు. నివిడే సినిమాకి పెద్ద మైనస్‌.

45
అవతార్‌ 3లో ఆర్టిస్ట్ లు ఎలా చేశారు?

సామ్ వార్తింగ్టన్, జో సల్దానా ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీలో మెప్పించారు. వాళ్లు మనుగడ కోసం చేసిన పోరాటం మెప్పించింది. నటన పరంగానూ మెప్పించారు. ఎమోషన్స్ లో అదరగొట్టారు. ఇందులో కొత్త పాత్ర అయి వరంగ్ పాత్రలో చార్లీ చాప్లిన్ మనవరాలు ఊనా చాప్లిన్ నెగటివ్‌ రోల్లో అదరగొట్టారు. రోనల్ పాత్రలో కేట్ విన్స్‌లెట్ ఫర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు. 

55
ఫైనల్‌ నోట్‌

 `అవతార్‌`, `అవతార్‌` తో పోల్చితే మూడో భాగం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రొటీన్‌గా, రెగ్యూలర్‌ ఫీలింగ్‌ తెప్పించింది. పైగా స్లో నరేషన్‌గా ఆడియెన్స్‌ సహనాన్ని పరీక్షించింది. కాకపోతే విజువల్స్ పరంగా ఎంజాయ్‌ చేయగలిగే మూవీ అని చెప్పొచ్చు.

రేటింగ్‌ 2.5

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories