
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావును అందరు అన్నగారు అని పిలుచుకుంటారు. అయితే ఆయన సరసన ఆడిపాడిన హీరోయిన్ తో అన్నయ్య అనిపించుకున్న సినిమా రక్తసంబంధం. ఈసినిమాకు ముందు ఆయన ఎన్ని చిత్రాలలో యన్టీఆర్ అన్న పాత్రల్లో నటించి అలరించినా.. పెద్దాయనకు అన్నగా తరిగిపోని, చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా రక్తసంబంధం మాత్రమే. అప్పటికే గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన సావిత్రి... ఈ సినిమాలో ఎన్టీ రామారావుకి చెల్లెలుగా నటించింది. ఈ కాంబినేషన్ అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. సావిత్రి ఎన్టీఆర్ కు చెల్లెలుగా నటించడం ఏంటీ అని ముక్కున వేలేసుకున్నారు కొందరు. కానీ ఈ సినిమాలో ఇద్దరూ అన్నాచెల్లెళ్ళుగా తమ పాత్రల్లో జీవించారు. విమర్శించినవారి నోర్లు మూతపడేలా అద్భుతం చేశారు. అందుకే రక్తసంబంధం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. శతదినోత్సవాలు చేసుకుంది. వి.మధుసూదనరావు దర్శకత్వంలో సుందల్ బాబ్ సహతా, మాండీ నిర్మించిన రక్తసంబంధం సినిమా 1962 నవంబర్ 1వ విదుదలై ఘన విజయం సాధించింది. తమిళంలో శివాజీగణేశన్, సావిత్రి అన్నాచెళ్ళుగా నటించిన 'పాశమలర్ సినిమాకు ఇది రీమేక్ మూవీ.
చిన్నతనంలోనే కన్నవారిని పోగొట్టుకున్న, రాజు( ఎన్టీ రామారావు), రాధ (సావిత్రి) ఎన్నో కష్టాలు పడి పెరిగిపెద్దవారు అవుతారు. చెల్లెలు రాధ అంటే రాజుకు ప్రాణం. అన్న అంటే రాధకు కూడా ప్రాణమే. ఒక వైపు పేదరికం ఇబ్బందిపెడుతున్నా.. చెల్లెలికి ఏమాత్రం లోటు లేకుండాచూసుకునేవాడు రాజు. ఈక్రమంలో వీరి జీవితంలోకి స్నేహితుడిగా ఆనంద్ (కాంతారావు) వస్తాడు. రాజు, ఆనంద్ ఒక దగ్గరే పనిచేస్తుంటారు. రాజు ద్వారా ఆనంద్ రాధకు పరిచయం అవుతారు. వీరి పరిచయం ప్రేమగా మారుతుంది. ఈలోపు రాజు పనిచేసే ఫాక్టర్ మూతపడుతుంది. ఆ సమయంలో రాధ కూడబెట్టిన డబ్బుతో.. బొమ్మల వ్యాపారం చేసి.. లక్షాధికారులు అవుతారు రాజు, రాధ. తాను పనిచేసిన ఫ్యాక్టరీని రాజు కొనేస్తాడు.. ఇక ఆనంద్ రాజు దగ్గరకు పనికోసం వస్తాడు. కానీ మిత్రుడు తన కింద పనిచేయడం ఇష్టంలేని రాజు, మొదట కలపటాయించినా, ఆనంద్ కోసం సరే ఈ నీకు సచ్చిన ఉద్యోగం చేయమంటారు. ఆనంద్, రాధ ప్రేమ విషయం తెలిసి.. రాజు కోపంతో ఆనంద్ ను కొడతాడు.. తన మనుషులను కూడా పనిలోంచి తీసేస్తాడు... దాంతో కార్మికుల పక్షాన ఆనంద్ పోరాటం చేస్తాడు. రాధను తనతో రమ్మన్నా.. ఆమె అన్నకోసం రాను అంటుంది. దాంతో తనపై చెల్లెలుకు ఉన్న ప్రేమను గ్రహించిన రాజు, ఆమెకు నచ్చిన ఆనంద్ తోనే పెళ్ళి జరిపిస్తారు. ఈలోపు.. రాజుకు.. మాలతి(దేవిక)తో పెళ్ళి చేస్తుంది రాధ. ఇక ఆనంద్ తో పాటే ఆయన మేనత్త(సూర్యకాంతం), ఆమె కొడుకు కూడా రాజు ఇంట్లోనే ఉంటారు.
రాజు ఇంట్లోనే ఉంటూ.. ప్రతీ పనికి ఆ గయ్యాలి మేనత్త, రాధను దాచిరంపాన పెడుతూ ఉంటుంది. ఆమె కారణంగా ఓ సారి రాధపై ఆనంద్ చేయి చేసుకుంటాడు. అక్కడే ఉన్న రాజు, ఆనంద్ ను కొడతారు. ఇక కలసి ఉండడం కల్ల అంటాడు ఆనంద్. ఆస్తి మొత్తం చెల్లెలుకే వదిలేసి మాలతి. వెంట వెళ్ళిపోతాడు రాజు. ఈలోపు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టి రాజు బాగా సంపాదిస్తుంటాడు. అటు రాధ సంసారం మాత్రం గొడవలు, బాధలతో సాగుతుంది. అది తెలిసి రాజు కుమిలిపోతాడు. ఈక్రమంలో రాధ ఓ బాబుకు జన్మనిస్తుంది. మాలతి ఓ పాపను కని కన్నుమూస్తుంది. ఈ విషయం తెలిసి రాజును చూడడానికి ఆనంద్ వెళతాడు. అయితే మాటని అన్న భాస్కర్ అతడిని చూడగానే, తన చెల్లెలు చావుకు నీవు, మీ అత్తనే కారణమని నిందించి ముఖానే తలుపులు వేస్తారు. ఇక ఈక్రమంలో రాజు తన చెల్లెలు కొడుకుని కాపాడబోయి కళ్లుపోగోట్టుకుంటాడు.. ఆనంద్ తన అత్త చేసే పనులు తెలిసి.. ఆమెను బయటకు గెంటేస్తాడు. తన చెల్లెలికోసం తపించిన రాజు.. కన్నుమూస్తాడు.. తన అన్న మరణం తట్టుకోలేనిరాధ కూడా మరణిస్తుంది. ఇద్దరు పిల్లలతో ఆనంద్ ఒంటరివాడు అవుతాడు. ఇలా విషాదంతో ఈసినిమా కథ ముగుస్తుంది. థియేటర్లలో ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది ఈసినిమా.
ఈ సినిమాలో ప్రతీ ఒక్కరు అద్భుతంగా నటించి మెప్పించారు. అన్నాచెల్లెల్లుగా ఎన్టీఆర్ సావిత్రి సాహసం చేసినా.. బాగా వర్కౌట్ అయ్యింది. భారీగా రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక సెకండ్ హీరోగా కాంతారావు నటన సినిమాకు ప్రాణం పోసింది. పరిమిత పాత్ర అయినా.. దేవికా అద్భుతంగా నటించింది. ఇక సూర్యకాంతం గురించి చెప్పనక్కర్లేదు. ఆమెతో పాటు రేలంగి, గిరిజ, రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కె.వి.యస్. శర్మ వై.వి.రాజు వారి పాత్రలకు న్యాయం చేశారు. ఎవరు ఎంత చేసినా.. సావిత్రి సెంటిమెంట్ ముందు.. ఎంత పెద్ద నటులైనా కనిపించరు.. సావిత్రి ఎమోషనల్ సీన్స్ ప్రతీ ఒక్కరి హృదయాలను పిండేశాయి.
ఈ సినిమాతోనే బాపురమణలలో ఒకరైన ముళ్ళపూడి వెంకటరమణ రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు అయ్యారు. తమిళ మాతృక ను తీసుకుని తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఇక ఈసినిమా తమిళ వెర్షన్ పాశమలర్ కు విశ్వనాథన్ - రామమూర్తి సంగీతం అందించగా.. ఈ సినిమా దర్శకుడు తెలుగు సినిమాకు కూడా డా వారితోనే స్వరకల్పన చేయించాలని భావించారు. అయితే కాల్ షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఘంటసాల సంగీతం కూర్చారు. ఈ సినిమాలో ప్రతీపాట ఓ ఆణిముత్యమే. "బంగారు బొమ్మ రావేమే...", "చెందురుని మించు అందమొలికించు...". "మంచి రోజు వస్తుంది.. "ఇదే రక్తసంబంధం...", "ఎవరో నన్ను కవ్వించి పోయే దెవరో... ఆకాశమేలే అందాల రాణి వో అల్లారు ముద్దుగా...." అంటూ సాగే పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈసినిమాలో పాటలను ఆరుద్ర, నారాయణరెడ్డి, కొసరాజు, అనిశెట్టి, దాశరథి లాంటి మహపండితులు రచించారు.
1962 లో రక్తసంబంధం సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈసినిమా రిలీజ్ కంటే ముందు.. ఇదే ఏడాది... యన్టీఆర్- సావిత్రి జంటగా రూపొందిన గుండమ్మ కథ' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో భార్య భర్తలు గా సావిత్రీ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆతరువాత 'రక్తసంబంధం లో అన్నా చెల్లెలుగా నటించి మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఇక ఆ తరువాత 43 రోజులకే యన్టీఆర్, సావిత్రి జోడీగా తెరకెక్కిన ఆత్మబంధువు సినిమా కూడా రిలీజ్ అయ్యింది... అయినా ఆ సినిమాలూ ఘనవిజయం సాధించాయి.
ఎన్టీఆర్ సావిత్రి అన్నాచెల్లెళ్ళుగా నటించిన రక్తసంబంధం సినిమాకు మహిళా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మళ్ళీ మళ్ళీ చూసి.. సావిత్రి నటనకు కన్నీరు పెట్టారు. ఎన్టీఆర్ లాంటి అన్న తమకు కూడా ఉంటే బాగుండు అనుకున్నారు. ఈ సినిమా 11 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.. బెజవాడలో రజతోత్సవం చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. రీరిలీజ్ లో కూడా 100 రోజులు ఆడిన సినిమాగా రక్త సంబంధం నిలిచిపోయింది. 1968లో ఈసినిమా రిలీజ్ చేయగా.. హైదరాబాద్ లో మరోమారు శతదినోత్సవం చేసుకోవడం విశేషం. ఈసినిమా ప్రభావంతో ఎన్టీఆర్ కు అన్నగా డిమాండ్ పెరిగింది. అన్న పాత్రల్లో ఎన్టీ రామారావు 'ఆడపడచు, చిట్టిచెల్లెలు లాంటి సినిమాలు చేయగా.. అవి కూడా హిట్ అయ్యాయి. తెలుగు హృదయాలను ద్రవింపచేసిన రక్తసంబంధం సినిమా చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.