ఇంట్లో సోఫాపై కొద్ది రోజుల్లోనే దుమ్ము, మరకలు చేరుతుంటాయి. పిల్లలు తినే ఆహార పదార్థాలు, టీ, కాఫీ మరకలు, చెమట కారణంగా సోఫా త్వరగా మురికిగా మారుతుంది. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ సోఫాలపై పడిన మరకలను తొలగించడం కొంచెం కష్టమే. వాటిని శుభ్రం చేయడానికి ఎక్కువ నీళ్లు వాడితే లోపల ఉండే ఫోమ్ తడిసిపోయి దుర్వాసన వచ్చే ప్రమాదం ఉంది. అయితే నీళ్లు ఎక్కువగా వాడకుండానే సోఫాను శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా సోఫా కింద లేదా వెనుక ఉండే కేర్ లేబుల్‌ను పరిశీలించాలి. ఏ రకమైన క్లీనింగ్ పద్ధతి ఉపయోగించాలో అందులో ఉంటుంది. ఆ తర్వాత సోఫా కుషన్లను తొలగించి వాక్యూమ్ క్లీనర్‌తో దుమ్ము, వెంట్రుకలు, ఆహార పదార్థాల చిన్న ముక్కలను తొలగించాలి. మూలల్లో పేరుకున్న దుమ్మును తొలగించడానికి వాక్యూమ్ క్లీనర్‌కు ఉండే సన్నని నాజిల్ ఉపయోగపడుతుంది.