Diwali 2026: దీపావళి పూజ జరగడానికి ముందే ఇంటి గుమ్మానికి చాలా మంది నిమ్మకాయలు, పచ్చిమిర్చి గుచ్చి తగిలిస్తారు. ఇలా ఎందుకు చేయాలో చాలా మందికి తెలియదు. ఇంటికి ఇలా కట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగాతాయో తెలుసుకోండి.
దీపావళి పండుగ వేళ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇళ్లను, వ్యాపార సంస్థలను ముస్తాబు చేయడం అందరికీ తెలిసిందే. అయితే పండుగకు ముందే గుమ్మాలకు నిమ్మకాయలు, పచ్చిమిర్చి వేలాడదీసే దృశ్యాలు చాలా చోట్ల కనిపిస్తాయి. కొంతమంది పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చిని కూడా వాడతారు. సాధారణంగా దీనిని దిష్టి తగలకుండా చేసే పనిగా భావిస్తారు. ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించాలంటే ప్రధాన ద్వారం ఎంతో పవిత్రంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. అందుకే ప్రతికూల శక్తులు, చెడు దృష్టి లోపలికి రాకుండా నిరోధించడానికి గుమ్మానికి నిమ్మ, మిర్చిని కట్టే ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది.
23
ఆచారం వెనుక అసలు కథ
ఈ ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ప్రచారంలో ఉంది. పురాణాల ప్రకారం సంపదను ఇచ్చే లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది, ఆమె పేరు అలక్ష్మి. అలక్ష్మి దరిద్రానికి, దురదృష్టానికి ప్రతీకగా చెబుతారు. లక్ష్మీదేవికి తీపి వంటకాలు, పాయసం అంటే ఇష్టం ఉంటే, అలక్ష్మికి మాత్రం పులుపు, కారంతో కూడిన ఘాటైన రుచులంటే ఎంతో ప్రీతికరమని నమ్ముతారు. రుచుల్లో ఉండే ఈ వ్యత్యాసమే ప్రధాన ద్వారం వద్ద నిమ్మ-మిర్చి కట్టడానికి ప్రధాన కారణమని పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి.
33
ఇంట్లోకి రాకుండా అడ్డుకుని..
దీపావళి పూజకు ముందే అలక్ష్మి ఇళ్ల సమీపానికి వస్తుందని ఒక లోక ప్రతీతి. ఇంటి ముఖద్వారం వద్ద వేలాడదీసిన నిమ్మకాయలోని పులుపును, పచ్చిమిర్చిలోని కారాన్ని ఆమె చూస్తుంది. గుమ్మం వద్దే తనకు ఇష్టమైన ఆహారం దొరకడంతో సంతృప్తి చెంది, ఇంట్లోకి రాకుండా అక్కడి నుంచే వెనుదిరిగి వెళ్లిపోతుందని విశ్వసిస్తారు. దీనివల్ల దరిద్రం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనంతరం పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల బలమైన నమ్మకం. అందుకే దీపావళికి ముందు ఈ సంప్రదాయాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారు.