Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?

Published : Sep 21, 2026, 05:40 PM IST

Chapati Dough: చపాతీ పిండి ముందుగానే కలిపి ఫ్రిజ్ లో స్టోర్ చేసినా కూడా నల్లగా మారుతోందా? ఆ పిండితో చపాతీ చేసుకోలేక పారేస్తున్నారా? అసలు పిండి ఎందుకు నల్లగా మారుతుంది? దీని వెనక కారణం ఏంటి?

PREV
13
చపాతీ పిండి నల్లగా మారిపోతోందా?

చాలామంది సమయాన్ని ఆదా చేసుకోవడానికి ముందుగానే పిండిని కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. కానీ కొద్ది సేపటి తర్వాత రోటీలు చేయడానికి తీస్తే, పిండి రంగు మారి నల్లగా లేదా ముదురు రంగులోకి మారిపోతుంది. దాదాపు.. కలిపిన పిండిని.. అందరూ ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అయినా, సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే దాని రంగు మాత్రమే కాకుండా రుచి, వాసన కూడా మారుతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే పిండిని చాలాకాలం పాటు తాజాగా ఉంచుకోవచ్చు.

23
పిండి నల్లగా మారడానికి అసలు కారణం ఏమిటి?

పిండిని కలిపినప్పుడు అందులో ఉండే 'పాలిఫెనాల్ ఆక్సిడేస్' వంటి సహజ ఎంజైమ్‌లు గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరుపుతాయి. ఈ ప్రక్రియనే 'ఆక్సిడేషన్' అంటారు. దీనివల్లనే కాలక్రమేణా పిండి రంగు మారుతుంది. గాలి తగలడం వల్ల ఈ రసాయన చర్య వేగవంతమై, పిండి రంగు, తాజాదనం దెబ్బతింటాయి.

పిండి నల్లగా మారకుండా ఉండాలంటే ఎలా కలుపుకోవాలి?

పిండి కలిపేటప్పుడు నీటిని కొద్దికొద్దిగా పోయాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోస్తే పిండి జిగటగా మారుతుంది. రోటీలు మృదువుగా మారాలి అంటే.. పిండిని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు సాగే గుణం వచ్చే వరకు బాగా కలపాలి. నీటితో పాటు కొద్దిగా పాలు కలిపి పిండి కలిపితే... పిండి ఎక్కువసేపు మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా పిండి రంగు మారకుండా ఉండటంతో పాటు రోటీల టెక్చర్ కూడా మెరుగవుతుంది.

33
పిండిని తాజాగా ఉంచే చిట్కాలు:

ఎయిర్‌టైట్ కంటైనర్: పిండిని కలిపిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గాలికి వదిలేయకండి. గాలి తగలకుండా ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేయడం వల్ల ఆక్సిడేషన్ ప్రక్రియ మందగించి, పిండి త్వరగా నల్లబడకుండా ఉంటుంది.

క్లింగ్ ఫిల్మ్ లేదా అల్యూమినియం ఫాయిల్: మీ దగ్గర ఎయిర్‌టైట్ కంటైనర్ లేకపోతే, ఒక గిన్నెలో పిండిని పెట్టి అల్యూమినియం ఫాయిల్‌తో గట్టిగా చుట్టండి. ఇది గాలి సోకకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

నెయ్యి లేదా నూనె రాయండి: పిండిని కలిపిన తర్వాత దానిపై కొద్దిగా నెయ్యి లేదా వంట నూనెను తేలికగా రాయాలి. ఇది పైభాగంలో పొడి బారకుండా ఆపుతుంది, గాలితో సంబంధాన్ని తగ్గించి పిండిని మెత్తగా, తాజాగా ఉంచుతుంది.

జిప్‌లాక్ బ్యాగ్: పిండికి కొద్దిగా నూనె రాసి జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టండి. బ్యాగ్‌ను సీల్ చేసే ముందు లోపల ఉన్న గాలిని పూర్తిగా బయటకు తీసేయండి. ఆ తర్వాత వెంటనే ఫ్రిజ్‌లో భద్రపరచండి.

ఎక్కువ పిండి కలపకపోవడం మంచిది: ఎప్పుడూ మీకు ఎంత అవసరమో అంతే పిండిని కలుపుకోండి. తక్కువ మోతాదులో ఉంటే తాజాగా ఉంటుంది, వ్యర్థం కాదు. నిల్వ చేయడం కూడా సులభం అవుతుంది.

ఈ చిన్నపాటి టిప్స్ పాటిస్తే చపాతి పిండి రంగు మారకుండా, ఎల్లప్పుడూ మెత్తగా , తాజాగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories